Kancha Gachibowli Land: అటవీ భూమా? ప్రభుత్వ భూమా?...
Kancha Gachibowli Land
Telangana News

Kancha Gachibowli Land: అటవీ భూమా? ప్రభుత్వ భూమా?.. లీగల్ స్టేటస్ పై దర్యాప్తు ముమ్మరం!

Kancha Gachibowli Land: కంచె గచ్చిబౌలిలో నాలుగు వందల ఎకరాల వివాదాస్పద భూమిలో సుప్రీం కోర్టు పరిధిలో పనిచేసే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ పర్యటించింది. కోర్టు ఆదేశాల మేరకు పర్యావరణ మదింపు, భూమి లీగల్ స్టేటస్‌పైనే ప్రధానంగా కమిటీ దృష్టి పెట్టినట్లు సమాచారం.ఉదయమే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చేరకున్న ఎంపవర్డ్ కమిటీ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతాన్ని పరిశీలిస్తూ, వివాదంలో ఉన్న నాలుగు వందల ఎకరాల్లోకి ప్రవేశించింది.

తమ వెంట పరిమిత సంఖ్యలో అధికారులు, సిబ్బంది చాలనే నిబంధన పెట్టినట్లు తెలిసింది. భూమి లీగల్ స్టేటస్, అక్కడ ఉన్న పర్యావరణం, రెండు పక్షాల వాదనలు, గత రికార్డులు ఏం చెబుతున్నాయి, కోర్టు ఉత్తర్వులు ఎలా ఉన్నాయి? అనే విషయాలపైనే ప్రధానంగా ఎంపవర్డ్ కమిటీ దృష్టి పెట్టింది. అటవీ, పర్యావరణం, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీయే, టీజీఐఐసీ, పోలీస్ ఉన్నతాధికారులను తమ వెంట తీసుకువెళ్లిన కమిటీ ఆయా శాఖలకు సంబంధించిన చట్టాలను తమ వెంట తెచ్చుకొని వాటి పైనే అధికారులను ప్రశ్నించినట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.

 Also Read: CM Revanth Reddy: నిరుద్యోగం తగ్గాలంటే నైపుణ్యాలు కావాలి.. యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీపై సీఎం దృష్టి

వివాదం ఎక్కడ ఏర్పడింది?
భూమి యాజమాన్య హక్కుల విషయంలో కోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పుడు వివాదం ఎక్కడ, ఎందుకు ఏర్పడింది? అన్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో స్వాధీనం కోసం ప్రయత్నించినప్పుడు అమల్లో ఉన్న కేంద్ర, రాష్ట్ర చట్టాలను అనుసరించారా? లేదా అన్న విషయాల్లో అధికారుల నుంచి స్పష్టత తీసుకున్నారు. రాష్ట్ర అధికారుల నుంచి వివరణ మాత్రమే కోరిన కేంద్ర బృందం పర్యావరణం, వైల్డ్ లైఫ్ యాక్ట్, వాల్టాతో సహా అన్ని చట్టాల కాపీలను తమ వెంట తెచ్చుకోవటం విశేషం. 400 ఎకరాలను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు చెట్ల తొలగింపు, ఉన్న జంతుజాలం విషయంలో పర్యావరణ మదింపు ఏరకంగా జరిగింది? అన్న విషయంపై స్పష్టత కోరినట్లు తెలిసింది.

అక్కడ ఉన్న చెట్లలో మెజారిటీ తొలగింపుకు అనుమతులు అవసరంలేని సుబాబుల్, లాంతానా లాంటి పొదలు మాత్రమే ఉన్నట్లు అటవీ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు టీజీఐఐసీ నుంచి ప్రతిపాదన అటవీశాఖకు చేరినట్లు వెల్లడించారు. అదే సమయంలో తొలగింపుకు అనుమతులు అవసరం అయిన వేప, చింత లాంటి వాటిని మినహాయించే ఇప్పటిదాకా అయిన క్లియరెన్స్ జరిగిందని క్షేత్ర స్థాయిలో ఎంపవర్డ్ కమిటీకి అధికారులు చూపించారు.

 Also Read; Sama Rammohan:హెచ్ సీయూ రగడ.. బీఆర్ఎస్ కి కాంగ్రెస్ సరికొత్త సవాల్!

వాహనాలు ఇక్కడే ఎందుకున్నాయి?
పరిశీలనలో భాగంగా కొన్ని వాహనాలు అక్కడే ఉండటంపై కమిటీ పోలీస్ అధికారుల నుంచి వివరణ కోరింది. సుప్రీం ఉత్తర్వులు ఉన్నా వాహనాలను ఎందుకు బయటకు పంపలేదని ప్రశ్నించింది. అయితే ఆందోళన చేస్తున్న విద్యార్థులు వాహనాల ట్యాంక్‌లో మట్టిపోయటం వల్ల పాడైన వాటిని తరలించలేకపోయినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. సుమారు 3గంటల పాటు అక్కడ పర్యటించిన ఎంపవర్డ్ కమిటీకి జింకలు, నెమళ్లు కనిపించలేదు.

పికాక్ లేక్, బఫెలో లేక్‌ల దగ్గర కొన్ని పక్షులు కనిపిస్తే వాటిని రికార్డు చేసుకున్నారు. అయితే ఈ రెండు సరస్సులు కూడా యూనివర్సిటీ పరిధిలోకే వస్తాయని, ప్రభుత్వానికి చెందిన నాలుగు వందల ఎకరాల్లోకి రావని అధికారులు స్పష్టం చేశారు.

కొన్ని సందర్భాల్లో కనిపిస్తున్న జింకలు, నెమళ్లు, ఇతర జంతుజాలం యూనివర్సిటీ పరిధిలో ఉన్న 1623 ఎకరాల్లో ఉన్నాయని, అవసరం అనుకుంటే సెంట్రల్ యూనివర్సిటీ యాజమాన్యం అనుమతితో వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాటు చేస్తామని అధికారులు వెల్లడించినట్లు తెలిసింది. ప్రభుత్వానికి సంబంధించిన నాలుగు వందల ఎకరాలను ప్రాథమ్యాల ప్రకారం అభివృద్ధి చేసినా, ప్రస్తుతం అక్కడ ఉన్న పర్యావరణం, వృక్ష, జంతుజాలం, రాక్ ఫార్మేషన్‌లకు ఎలాంటి నష్టం కలిగించమని ఎంపవర్డ్ కమిటీకి అధికారులు స్పష్టం చేశారు.

 Also Read: CS Shanti Kumari: శాంతికుమారికి షాక్ తప్పదా? కొత్త సీఎస్ పోస్టు ఎవరిది?

ఐటీ ‌జోన్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యం
యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, ఐటీ‌జోన్‌లో ఉన్న ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించినట్లు సమాచారం. యాభై ఏళ్ల కిందట సెంట్రల్ యూనివర్సిటీకి భూమి ఇచ్చినపుడు అది హైదరాబాద్ శివారు ప్రాంతమని ఇప్పుడు నగరంలో అంతర్భాగం అయిందన్న విషయాన్ని అధికారులు ఎంపవర్డ్ కమిటీకి వివరించారు.

విశాలమైన ప్రాంతం ఖాళీగా ఉండటంతో పట్టణాభివృద్ధిలో భాగంగా నిర్మాణాల వ్యర్థాలు పేరుకుపోతున్న విషయాన్ని ఫొటో‌ ఎగ్జిబిషన్‌తోసహా అధికారులు చూపించారు. సెంట్రల్‌ వర్సిటీ యాజమాన్యం అంగీకరిస్తే ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీలో తగినంత స్థలం కేటాయించి ప్రభుత్వఖర్చుతో తరలిస్తామని కూడా ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం సెంట్రల్ వర్సిటీ ప్రాంతాన్ని అర్బన్ ఎకో‌పార్క్‌గా డెవలప్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలిసింది.

వివిధ రాజకీయ పార్టీల నివేదికలు
మధ్యాహ్నం వివిధ రాజకీయ పార్టీల తరఫున నివేదికలను ఎంపవర్డ్ కమిటీ స్వీకరించింది. బీజీపీ, బీఆర్ఎస్ నేతలు పాల్గొని తమ వాదనలు వినిపిస్తూ, అవసరమైన డాక్యుమెంట్లను అందించారు. అలాగే సెంట్రల్ వర్సిటీ తరపున వీసీతోపాటు, విద్యార్థి సంఘాల తరపున 10 మందిని అనుమతించి వారితో కమిటీ సమావేశమై అభిప్రాయాలను రికార్డు చేసింది. రోజంతా క్షేత్రస్థాయి పర్యటన, స్టేక్ హోల్డర్స్‌తో సంప్రదింపులు జరిపి.. అధికారులతో సమావేశమైన ఎంపవర్డ్ కమిటీ ఢిల్లీ వెళ్లింది.

కమిటీలో ఒక సభ్యుడు మాత్రం అవసరమైన మరికొన్ని డాక్యుమెంట్ల కోసం హైదరాబాద్‌లో ఉన్నారు. శుక్రవారం ఢిల్లీ తిరిగి వెళ్తారని సమాచారం. ఈ నెల 16లోపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి అఫిడవిట్ ఇప్పటికే సుప్రీం కోరింది. ఈ లోగానే ఎంపవర్డ్ కమిటీ మధ్యంతర నివేదిక ఇచ్చే అవకాశముందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

కమిటీతో క్షేత్రస్థాయి పర్యటన తర్వాత జరిగిన సమావేశాల్లో చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, పీసీసీఎఫ్ (ఎఫ్‌సీ‌ఏ) సువర్ణ, హైదరాబాద్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రియాంక వర్గీస్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్దన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా డీఎఫ్ఓ సుధాకర్ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..