తైపీ సిటీ స్వేచ్ఛ: Taiwan Earthquake: భారీ భూకంపం తైవాన్ దేశాన్ని వణికించింది. రిక్టర్ స్కేలుపై 5.0 గా నమోదయిన ఈ భూకంప తీవ్ర ధాటికి రాజధాని తైపీ సిటీలో అనేక భవంతులు ఊగిసలాడాయి. అయితే, ఎలాంటి నష్టం జరగలేదు. ప్రాణనష్టం వాటిల్లేదని, భవనాలు కూలలేదని స్థానిక అధికారులు తెలిపారు. తూర్పు తైపీలోని యిలాన్ కౌంటీలో భూఉపరితలానికి సుమారు 70 కిలోమీటర్ల లోపల భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు అమెరికా జియాలాజికల్ సర్వే తెలిపింది.
భూప్రకంపనలు వచ్చినప్పుడు భవనాలు ఊగాయని యిలాన్ కౌంటీ ఫైర్ బ్యూరో అధికారి ఒకరు వెల్లడించారు. భూప్రకంపనలు నమోదయినప్పటికీ, భవనాలు కూలలేదని, ఎవరికీ గాయాలు కాలేదని స్థానిక అధికారులు, నేషనల్ ఫైర్ ఏజెన్సీ ప్రకటించాయి. ముందస్తు జాగ్రత్త చర్యగా తైపీ నగరంలోని మెట్రో రైళ్ల నెట్‌వర్క్ స్పీడ్‌ను తాత్కాలికంగా తగ్గించామని అధికారులు చెప్పారు.
వేగాన్ని తగ్గించినప్పటికీ హైస్పీడ్ ట్రైన్లు సహా రైళ్ల సర్వీసులో ఎలాంటి అవాంతరాలు ఉండబోవని వివరించారు. కాగా, ‘పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్’ ప్రాంతంలో ఉండడంతో తైవాన్‌లో తరచుగా భూకంపాలు వస్తూనే ఉంటాయి. గతేడాది ఏప్రిల్ నెలలో ఏకంగా 7.4 శక్తిమంతమైన భూకంపం సంభవించింది.
ఈ ధాటికి 17 మంది ప్రాణాలు కోల్పోగా, ఆస్తి నష్టం భారీగా జరిగింది. గత 25 ఏళ్ల చరిత్రలో ఇదే అతితీవ్ర భూకంపమని అధికారులు వివరించారు. 1999లో తైవాన్2ను 7.6 తీవ్రత కలిగిన భూకంప కుదిపేసింది. దాదాపు 2,400 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆ తర్వాత, దేశంలో ఇళ్ల నిర్మాణ పద్ధతులను తైవాన్ ప్రభుత్వం సమూలంగా మార్చివేసింది. అంతేకాదు, భూకంప హెచ్చరికలు చేసే అత్యాధునిక వార్నింగ్ సిస్టమ్స్, సుదూర గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్‌ఫోన్లు, సెస్సార్లను ఏర్పాటు చేసింది.
Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/