Sand Mafia: మేడ్చల్ జిల్లాలో మట్టి దందా జోరుగా సాగుతోంది. అసైన్డ్ భూములు, చెరువుల నుంచి ఇష్టారాజ్యంగా మట్టిని తోడేస్తున్నారు. అక్రమ వ్యాపారంతో మాఫియా రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా పగలు, రాత్రి అనే తేడాలేకుండా మట్టిని తవ్వుకుపోతున్నారు. అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుండడం..రాజకీయ నాయకుల అండదండలు సైతం ఉండడంతో మట్టి మాఫియా దందా మూడు పూలు, ఆరు కాయలుగా సాగుతోంది.
అడ్డూ అదుపు లేకుండా..
అడ్డూ అదుపు లేకుండా సాగుతున్న మట్టి తవ్వకాలు అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. ఎర్ర మట్టి, నల్ల మట్టి అనే తేడా లేకుండా ఇష్టమొచ్చినట్లుగా తవ్వేస్తున్నారు. ఇటుక బట్టీలలో వాడేందుకు, రియల్ ఎస్టేట్స్ వెంచర్లలో రోడ్లు వేసేందుకు ఈ మట్టికి బాగా డిమాండ్ ఉండటంతో అక్రమార్కులు రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారు. శామీర్ పేట్, మూడుచింతలపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో మాఫియా మట్టి తవ్వకాలు చేపడుతోంది.
లాల్ గడి మలక్ పేట్ గ్రామంలోని అసైన్డ్ భూముల నుంచి కొందరు అక్రమార్కులు జోరుగా మట్టిని తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా..అధికారులు కన్నెత్తి చూడడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. రాత్రి, పగలు అనే తేడాలు లేకుండా విచ్చల విడిగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. గ్రామాల్లోని రహదారుల మీదుగా పెద్ద ఎత్తున వాహనాల్లో తరలిస్తుండడంతో రహదారులు దెబ్బతినడంతోపాటు తమకు ఇబ్బందిగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Khammam Priest: నవాపేట్ భూ వివాదం.. రైతుల హక్కుల కోసం పోరాటం
ఫిర్యాదు చేస్తేనే స్పందిస్తున్నారు..
శామీర్ పేట్ మండలం లాల్ గడిమలక్ పేట్ గ్రామంలోని కుడి చెరువు నుంచి అడ్డు అదుపు లేకుండా రాత్రి వేళల్లో మట్టిని తరలిస్తున్నారు. దీంతో స్థానికులు ఇరిగేషన్ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఇరిగేషన్ అధికారులు సోమవారం రాత్రి సంఘటన స్థలానికి చేరుకునే లోగా మట్టి తరలిస్తున్న లారీలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. అక్కడే ఉన్న హిటాచితోపాటు హిటాచిని తరలించే లారీని అధికారులు సీజ్ చేశారు. గతంలోఎన్ని సార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు