MLC Kavitha liquor case news(TS today news): తిహార్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న తనను సీబీఐ విచారించడాన్ని సవాల్ చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. ఇందుకు సమాధానం చెప్పడానికి సీబీఐకి కోర్టు గడువు కూడా ఇచ్చింది. కానీ, గడువులోపే ఎమ్మెల్సీ కవితను సీబీఐ ప్రశ్నించింది. తాజాగా కవిత వేసిన పిటిషన్ విచారణకు రాగా.. ఆమె తరఫు న్యాయవాది తొలిగా ఇదే అంశాన్ని లేవనెత్తారు. సీబీఐ సమాధానం తమకు ఇంకా అందలేదని అడిగారు. తాము ఇప్పటికే కవితను ప్రశ్నించామని, అందుకే కౌంటర్ దాఖలు చేయలేదని సీబీఐ పేర్కొంది. తాము వాదనలు వినిపిస్తామని కవిత తరఫు న్యాయవాదులు రాణా, మోహిత్ రావులు చెప్పారు. దీంతో విచారణను కోర్టు ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు వాయిదా వేసింది.
ఈడీ, ఐటీ అధికారులు సంయుక్తంగా ఎమ్మెల్సీ కవిత నివాసంలో సోదాలు చేసి మార్చి 15వ తేదీన అరెస్టు చేసి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఆమెను ఈడీ అధికారులు విచారించారు. ఈ నెల 23వ తేదీ వరకు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో కవితను అధికారులు తిహార్ జైలుకు తీసుకెళ్లారు. ఇంతలోనే సీబీఐ ఆమెను విచారించాలని అనుకుంది. రౌస్ అవెన్యూ కోర్టుకు శుక్రవారం విజ్ఞప్తి చేసింది. కవితను విచారించడానికి వెంటనే కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టు అనుమతించగానే కవిత పిటిషన్ వేశారు. తనను విచారించడానికి సీబీఐకి అనుమతించే నిర్ణయాన్ని పున:పరిశీలించాలని విజ్ఙప్తి చేశారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరగా.. సీబీఐని స్పందించాల్సిందిగా కోర్టు తెలిపింది. ఇందుకు సమయం కావాలని సీబీఐ గడువు కోరింది. ఈ నెల 10వ తేదీ వరకు గడువు ఇచ్చింది. దీంతో 10వ తేదీన వాదనలు విన్న తర్వాతే కవిత పిటిషన్ పై నిర్ణయం తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, కోర్టు అనుమతి తీసుకున్న మరుసటి రోజే సీబీఐ తిహార్ జైలులో కవితను ప్రశ్నించింది.
Also Read: ఆలు లేదు.. చూలు లేదు..! టికెట్ లేకున్నా క్యాంపెయిన్ కోసం కసరత్తు!
సీబీఐ విచారణపై కోర్టు ఆర్డర్ శనివారం సాయంత్రం 5.30 గంటలకు వచ్చిందని, కానీ, సీబీఐ అధికారులు అంతలోపే మధ్యాహ్నం 12.30 గంటలకే కవితను విచారించారని న్యాయవాదులు రాణా, మోహిత్ రావులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఆర్డర్ కాపీ రాక ముందే సీబీఐ విచారణ జరిపిందని తెలిపారు. భవిష్యత్‌లో జరిగే విచారణకు ముందస్తుగానే అప్లికేషన్ ఇవ్వాలని సీబీఐకి న్యాయమూర్తి కావేరీ బవేజా సూచించారు.
ఇక తమ పిటిషన్ పై సమాధానాలు ఇవ్వలేదని అడగ్గా.. ఆల్రెడీ ప్రశ్నించాం కాబట్టి కౌంటర్ దాఖలు చేయలేదని సీబీఐ వాదించింది. ఈ అంశంపై తాము వాదనలు వినిపిస్తామని రాణా, మోహిత్ రావులు అన్నారు. ఇందుకు అంగీకరిస్తూ కోర్టు విచారణను వాయిదా వాయిదా వేసింది.
Also Read: టికెట్ బీజేపీది.. కానీ ఆయనకు చంద్రబాబే దేవుడు!
ఈ కేసులో ఆమె జ్యుడీషియల్ కస్టడీ ఈ నెల 9వ తేదీతో ముగిసింది. వెంటనే ఈడీ ఆమెను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమె జ్యుడీషియల్ రిమాండ్‌ను ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించింది. అలాగే.. భర్త, ఇతర కుటుంబ సభ్యలుతో కవిత కలువడానికి కోర్టు అంగీకరించింది.
కాగా, ఇది కుట్ర కేసు అని, ఇల్లాజికల్ కేసు అని కవిత కోర్టు హాల్లోకి వెళ్లుతూ మీడియాతో పేర్కొంది. రిమాండ్ పొడిగింపు తీర్పు వచ్చిన తర్వాత ఆమె నాలుగు పేజీల లేఖను మీడియాకు విడుదల చేశారు.