Raghurama: ఏపీలో రఘురామకృష్ణరాజుది క్యూరియస్ కేసు. ఆయన రాజకీయ ప్రయాణం చాలా భిన్నంగా సాగుతున్నది. వైసీపీ టికెట్ పై నరసాపురం నుంచి ఎంపీగా గెలిచిన ఆయన ఆ తర్వాత సొంత పార్టీకే కొరకరాని కొయ్యగా మారారు. జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆ తర్వాత ప్రతిపక్ష టీడీపీకి చేరువయ్యారు. కానీ, ఇప్పుడు ఏ పార్టీ నుంచీ టికెట్ కన్ఫామ్ కాలేదు. కానీ, ప్రచారానికి మాత్రం కసరత్తు ప్రారంభించారు. ఆలు లేదు.. చూలు లేదు.. అల్లుడి పేరు సోమలింగం అన్నట్టుగా ఉన్నది రఘురామ వ్యవహారం అంటూ వైసీపీ శ్రేణులు విమర్శలు చేస్తున్నాయి.
పొత్తులో భాగంగా నరసాపురం ఎంపీ స్థానం బీజేపీ ఖాతాలోకి వెళ్లింది. దీంతో ఉండి అసెంబ్లీ టికెట్ రఘురామకు కేటాయించాలని టీడీపీ అనుకుంటున్నది. ఉండి అసెంబ్లీ టికెట్ ఇస్తానని చంద్రబాబు నాయుడు ప్రకటించారు కూడా. కానీ, ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కంటతడి కూడా పెట్టుకున్నారు. రామరాజు అనుచరులు రఘురామపై విమర్శలు చేస్తున్నారు. దమ్ముంటే ఆయన గతంలో పోటీ చేసి గెలిచిన నరసాపురం ఎంపీ టికెట్ సాధించుకోవాలని, ఉండి టికెట్ జోలికి రావొద్దని ఆగ్రహిస్తున్నారు.
Also Read:తెలంగాణలో కమలం బలం పెరుగుతోందా..?
ఇక రఘురామ మాత్రం తనకు ఏ టికెట్ అయినా ఓకే అని చెబుతున్నారు. అంతా చంద్రబాబు మీదే భారం వేశారు. ఆయన ఉండి టికెట్ ఇస్తే అసెంబ్లీకి లేదంటే నరసాపురం టికెట్ ఇస్తే లోక్ సభకు పోటీ చేస్తానని అంటున్నారు. టికెట్ ఇంకా కన్ఫామ్ కాలేదు. కానీ, ఆయన కోసం ప్రచారం చేయడానికి మాత్రం కసరత్తులు మొదలుపెట్టినట్టు చెప్పకనే చెప్పారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేసినా పవన్ కళ్యాణ్ తన తరఫున పోటీ చేస్తారని అన్నారు. మంగళవారం ఆయన పిఠాపురంలోని చేబ్రోలులో పవన్ కళ్యాణ్ గృహప్రవేశ కార్యక్రమానికి వచ్చారు. తాను అసెంబ్లీకైనా లేదా లోక్ సభకైనా పోటీ చేస్తానని, బరిలో ఉండటం మాత్రం ఖాయం అని తెలిపారు.
పవన్ కళ్యాణ్‌తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆయన అన్నగారు తనకు మిత్రుడని రఘురామ చెప్పారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేసినా పవన్ కళ్యాణ్ తన కోసం ప్రచారం చేస్తారని వివరించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ హామీ కూడా ఇచ్చారని తెలిపారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నానే సందేహానికి 48 గంటల్లో తెరపడుతుందని, ఓ స్పష్టత వస్తుందని చెప్పారు.