అందరి చూపు నజర్ విత్ డ్రా పైనే
జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి బీజేపీ, ఎంఐఎం అభ్యర్థులు మాత్రమే బరిలో ఉండటంతో అందరీ దృష్టి నామినేషన్ విత్ డ్రాకు చివరి తేదీ అయిన 9వ తేదీపైన పడింది. పోలింగ్ నిర్వహిస్తే గెలుపునకు కావల్సిన స్థాయిలో ఓటర్లున్న ఎంఐఎం, సొంత పార్టీ పరంగా గెలిచేందుకు అవసరమైన ఓట్ల సంఖ్య లేని బీజేపీ కేవలం ఎన్నిక ఏకగ్రీవం కాకుండా పోలింగ్ జరిపించేందుకు, ఎంఐఎం పార్టీని ఇరకాటంలో పెట్టేందుకే బరిలో నిలిచిన బీజేపీ చివరి నిమిషంలో నామినేషన్ ను విత్ డ్రా చేసుకుంటుందా? లేక ఓటమి తప్పదన్న విషయాన్నితెలిసే, ఇంకా బరిలోనే నిలుస్తుందా? అన్నది ఉత్కంఠగా మారింది.
పోలింగ్ ఏర్పాట్లలో అధికారులు
జీహెచ్ఎంసీలోని 81 మంది కార్పొరేటర్లు 31 మంది ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ వంటి ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి మొత్తం 112 మంది ఓటర్లున్న లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ తప్పేలా లేదన్న విషయాన్ని గుర్తించిన అధికారులు పోలింగ్ దిశగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. 56 మంది ఓటర్లకు ఒక పోలింగ్ బూత్ చొప్పున జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఆవరణలోనే రెండు పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేసి ఈ నెల 23న పోలింగ్ నిర్వహించే దిశగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ పోలింగ్ ప్రక్రియను ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నాం మూడు గంటల వరకు నిర్వహించి, 25 వ తేదీన ఓట్ల లెక్కింపును చేపట్టి, ఫలితాన్ని వెల్లడించే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిసింది.