Mega Job Mela: శాంతి భద్రతలతో పాటు సామాజిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రాఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోలీస్ శాఖను అభినందించారు. జిల్లా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో శనివారం నల్గొండ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జాబ్ మేళాలో కనీసం 30 వేల బేసిక్ పే నుండి ఉద్యోగాలు ఇవ్వడం సంతోషమన్నారు.
పోలీసులు 24 గంటలు పని చేసే ఉద్యోగులుగా ప్రజల భద్రతతో పాటు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో పోలీస్ తరఫున ఇంత పెద్ద జాబ్ మేళా నిర్వహించడం జిల్లాలో మొదటిదన్నారు. ఈ జాబ్ మేళాలో ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఉద్యోగాల కోసం వచ్చారని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మరో జాబ్ మేళాను త్వరలోనే నల్గొండలో ఏర్పాటు చేస్తామన్నారు.
LB Nagar Crime: ఫ్రెండ్ బిడ్డపైనే కన్నేశాడు.. పదేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా నల్గొండ జిల్లాను తీర్చిదిద్దడంలో మిషన్ పరివర్తనను అమలు చేయడం, అలాగే ఇతర సామాజిక సేవా కార్యక్రమాలను చేయడం అభినందనీయమని తెలిపారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి సామాజిక కార్యక్రమాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మెగా జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఏఎస్పీ మౌనిక, డీఎస్పీ శివరాంరెడ్డి, జాబ్ కో-ఆర్డినేటర్ రవి తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు