రంగారెడ్డి బ్యూరో,స్వేచ్చ : Congress on Sand Mafia: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఇసుక తవ్వకాల్లో అడ్డగోలుగా దోపిడీ చేశారు. సహజ సంపదను ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఇష్టారీతిన ధరలను పెంచి జనాలకు చుక్కలు చూపించారు. వ్యాపారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులంతా..ఎవరికివారుగా వేలకోట్లు దోచుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇసుక మాఫియాను కట్టడి చేసేందుకు కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. తక్కువ ధరలకే సామాన్యులకు ఇసుక లభించేలా వెసలుబాటు కల్పించింది. ప్రయోగాత్మకంగా గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో శాండ్ బజార్లను ఏర్పాటు చేసింది. దీంతో అడ్డగోలుగా ఇసుక విక్రయాలు జరిపి కోట్ల రూపాయలు సంపాదించుకున్న అక్రమార్కుల ఆగడాలకు కళ్లెం పడింది. ఇసుక ధరలు సైతం దిగొచ్చాయి. బహిరంగ మార్కెట్లలో వ్యాపారులు తక్కువ ధరకే ఇసుకను అందిస్తున్నారు. ఇది ముమ్మాటికీ శాండ్ బజార్ల ప్రభావమేనని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
నెల రోజుల్లోనే 1,816 మెట్రిక్ టన్నుల విక్రయం
ఇసుకను నిబంధనలకు విరుద్దంగా తరలిస్తుండడంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదాయాన్ని కోల్పోవడంతోపాటు వినియోగదారులపై ఆర్థిక భారం పడుతోంది. ఈ నేపథ్యంలో పటిష్టమైన పాలసీని తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో కలిసి తీవ్రస్థాయిలో కసరత్తు చేశారు. రాష్ట్రంలోని అన్ని ఇసుక రీచ్‌ల వద్ద నిఘా వ్యవస్థను పటిష్టం చేయడంతోపాటు సీసీ టీవీ, జీపీఎస్, వే బ్రిడ్జి, బూమ్ బారియర్ వంటిని వినియోగించేలా చర్యలు తీసుకున్నారు. కమాండ్ కంట్రోల్ రూంకు అన్ని రీచ్‌లకు అనుసంధానం చేసి 24 గంటలూ పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. మరోపక్క ఇసుక పాలసీలో సంస్కరణల్లో భాగంగా శాండ్ బజార్లను ఏర్పాటు చేశారు.
Also read: TG Govt on LRS: లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ గడువు పెంపు.. మళ్లీ ఛాన్స్ ఇచ్చేశారు..
సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండాలని, బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు ఇసుక కొనుగోలు చేయాల్సిన పరిస్థితి తలెత్తకుండా ఉండడానికే శాండ్ బజార్‌లను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. ప్రయోగాత్మకంగా ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్, బౌరంపేట, వట్టినాగులపల్లిలో శాండ్ బజార్లను ఏర్పాటు చేసి ప్రారంభించారు. శాండ్ బజారులో టన్నుకు దొడ్డు ఇసుకను రూ.1,600, సన్న ఇసుకను రూ.1,800లకు విక్రయిస్తున్నారు. దూరాన్ని బట్టి రవాణా ఛార్జీలను అదనంగా వసూలు చేస్తున్నారు.
టీజీఎండీసీ వెబ్‌సైట్‌కు వెళ్లి ఇసుకను వినియోగదారుడు కొనుగోలు చేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా యాప్‌ను కూడా రూపొందించారు. ప్రస్తుతం టీజీఎండీసీ సిబ్బంది పర్యవేక్షణలో శాండ్ బజార్‌లను నిర్వహిస్తున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ శాండ్ బజార్‌లో 11,709 మెట్రిక్ టన్నుల సన్న ఇసుక, 18,005 మెట్రిక్ టన్నుల దొడ్డు ఇసుక నిల్వలను సిద్దంగా ఉంచారు. అందులో ఇప్పటికే 81 మెట్రిక్ టన్నుల సన్న ఇసుకను, 50 మెట్రిక్ టన్నుల దొడ్డు ఇసుకను విక్రయించారు.
బౌరంపేట 8,814 మెట్రిక్ టన్నుల సన్న ఇసుక నిల్వలకుగాను 571 మెట్రిక్ టన్నులు అమ్ముడుపోయింది. 19,269 మెట్రిక్ టన్నుల దొడ్డు ఇసుక నిల్వల్లో 517 మెట్రిక్ టన్నులు విక్రయానికి నోచుకుంది. వట్టినాగులపల్లిలో 9,793 మెట్రిక్ టన్నుల సన్న ఇసుక నిల్వలలో 246 మెట్రిక్ టన్నులను, 15,232 మెట్రిక్ టన్నుల దొడ్డు ఇసుక నిల్వలలో 351 మెట్రిక్ టన్నుల ఇసుకను వినియోగదారులు కొనుగోలు చేశారు. ప్రస్తుతం కొనుగోళ్లు మందకొడిగా సాగుతుండగా..త్వరలోనే పుంజుకోనున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.
దిగొచ్చిన ఇసుక వ్యాపారులు
హైదరాబాద్ నగరంతోపాటు చుట్టూత ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ తదితర జిల్లాల్లో ఇళ్ల నిర్మాణాల జోరు పెరిగింది. ఇదే క్రమంలో ఇసుకకు డిమాండ్ పెరిగింది. కాళేశ్వరం, భద్రాచలం, కరీంనగర్, భూపాలపల్లి తదితర ప్రాంతాల్లోని ఇసుక రీచ్‌ల నుంచి అనుమతుల పేరిట తరలిస్తున్న వ్యాపారులు గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అక్కడక్కడా ఇసుకను డంపింగ్ చేసి అక్రమ దందాను సాగిస్తున్నారు. తాము చెప్పిందే రేటు అన్నట్లుగా ఇసుక ధరను అమాంతం పెంచేసి అక్రమ వ్యవహారాన్ని నడిపిస్తూ వస్తున్నారు. నిన్నమొన్నటి వరకు దొడ్డు ఇసుక రూ.2వేలు, సన్న ఇసుక రూ.2,500 వరకు ధర పలికింది.
ప్రభుత్వం శాండ్ బజార్లను ఏర్పాటు చేశాక వ్యాపారులు విక్రయించే ఇసుక ధరల్లో పెను మార్పులు వచ్చాయి. వీటి ఏర్పాటుపై వ్యాపారులు గుస్సగా ఉన్నారు. కార్పోరేట్ సంస్థలకు రీచ్‌లను అప్పగించడంలో భాగంగానే శాండ్ బజార్లను తెరపైకి తెచ్చారన్న ఆరోపణలు చేస్తున్నారు. వీరి డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఎట్టకేలకు వ్యాపారులే దిగొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో సన్న, దొడ్డు ఇసుకలను రూ.2వేల లోపే వసూలు చేయడం ఇందుకు ఉదాహరణ అని వారు పేర్కొంటున్నారు.
Also read: Jagityal District: కమిషన్ కొనుగోలా? ఓపెన్ వేలమా? మామిడి కొనుగోలు పై మల్లగుల్లాలు..
మొన్నటివరకు బహిరంగ మార్కెట్లో ఉన్న ఇసుక ధరలను బట్టి శాండ్ బజార్లలో రేట్లను నిర్ణయించామని, వ్యాపారులు ఇసుక ధరలను తగ్గించడంతో శాండ్ బజార్లలోనే ధరల ఎక్కువ ఉన్నాయన్న భావన ప్రజల్లో నెలకొందని సంబంధిత అధికారులు వివరిస్తున్నారు. త్వరలోనే ఆదిభట్ల, ఉప్పల్, పటాన్ చెరు, ఘట్‌కేసర్‌లలోనూ శాండ్ బజార్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆతర్వాత జిల్లాల్లోని ప్రధాన పట్టణాల్లో అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా..గృహ నిర్మాణదారులకు ప్రస్తుత పరిస్థితులు కొంతవరకు ఊరటనిస్తున్నాయి.