తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శ్రవణ్ రావు విచారణాధికారులకు షాకిచ్చాడు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉపయోగించిన సెల్ ఫోన్లను తెచ్చివ్వమంటే ఓ తుప్పు పట్టిన మొబైల్ ఫోన్ ఇచ్చాడు. దాంతో అవాక్కయిన విచారణాధికారులు అడిగిన రెండు ఫోన్లు తీసుకుని ఈనెల 8న మరోసారి విచారణకు హాజరు కావాలని అతనికి నోటీసులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సెట్ విచారణను ముమ్మరం చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో కేసులు నమోదు కాగానే విదేశాలకు పారిపోయిన ఎస్ఐబీ మాజీ ఛీఫ్ ప్రభాకర్ రావుతోపాటు ఓ టీవీ ఛానల్ అధినేత శ్రవణ్ రావులపై అధికారులు రెడ్ కార్నర్ నోటీసులను కూడా జారీ చేయించారు. అరెస్ట్ తప్పదని భావించిన శ్రవణ్ రావు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటీషన్ పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేయకున్నా శ్రవణ్ రావును అరెస్ట్ చేయవద్దంటూ పోలీసులను ఆదేశించింది. అదే సమయంలో పోలీసుల విచారణకు హాజరు కావాలని శ్రవణ్ రావుకు సూచించింది. ఈ నేపథ్యంలో గతనెల 29న శ్రవణ్ రావు సిట్ ఎదుట హాజరయ్యాడు.
Also Read: Madhurawada Crime: ప్రేమ పేరుతో దాడి.. ప్రియురాలి తల్లి మృతి.. వైజాగ్ లో దారుణం
ఆ రోజున దాదాపు ఏడుగంటలపాటు శ్రవణ్ రావును ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు క్రితంసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సమయంలో వాడిన రెండు సెల్ ఫోన్లను తీసుకుని విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 11.30గంటల సమయంలో శ్రవణ్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చి విచారణకు హాజరయ్యాడు. అయితే, అధికారులు చెప్పినట్టుగా అసెంబ్లీ సమయంలో ఉపయోగించిన మొబైల్ ఫోన్లను తీసుకు రాలేదు.
ఓ తుప్పు పట్టిన సెల్ ఫోన్ ను అధికారులకు ఇచ్చి అసెంబ్లీ ఎన్నికలపుడు దానినే ఉపయోగించానని చెప్పాడు. ఇక, పోలీసులు అడిగిన చాలా ప్రశ్నలకు కూడా శ్రవణ్ రావు సరైన సమాధానాలు చెప్పలేదని తెలిసింది. అడిగిన సమాచారాన్ని ఇవ్వకుండా గుర్తు లేదని జవాబిచ్చినట్టుగా సమాచారం. తనకు ఎస్ఐబీ మాజీ ఛీఫ్ ప్రభాకర్ రావుతో పరిచయం ఉన్న మాట నిజమే అని చెప్పినా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల పాత్రపై మాత్రం పెదవి విప్పలేదని తెలిసింది.
Also Read: Sangareddy District: మీచేతిలో సెల్ ఫోన్ ఉందా.. తస్మాత్ జాగ్రత్త..
ఇదే కేసులో అరెస్టయిన మిగితా నిందితులను విచారించినపుడు శ్రవణ్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకపాత్ర పోషించినట్టుగా వెల్లడైంది. ప్రత్యర్థి పార్టీలు ప్రధానంగా కాంగ్రెస్ కు చెందిన ఏయే నాయకుల ఫోన్లను ట్యాప్ చేయాలన్న వివరాలను ఆయనే ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు అందచేసినట్టుగా తెలిసింది. దాంతోపాటు 18మంది జడ్జీలు, కాంగ్రెస్ పార్టీకి నిధులు సమకూరుస్తారనుకున్న పారిశ్రామిక వేత్తలు, బడా వ్యాపారుల పేర్లను కూడా శ్రవణ్ రావే ఇచ్చి వారి ఫోన్లను ట్యాప్ చేయించినట్టుగా వెల్లడైంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఓ మంత్రి అతనికి ఎస్ఐబీ మాజీ ఛీఫ్ ప్రభాకర్ రావును పరిచయం చేసినట్టుగా కూడా తెలిసింది. అయితే, తాజా విచారణలో ఈ వ్యవహారాలపై శ్రవణ్ రావు నోరు విప్పలేదని తెలిసింది.
8న మరోసారి రావాలి…
ఎన్నిరకాలుగా ప్రశ్నించినా శ్రవణ్ రావు సహకరించక పోవటంతో బుధవారం విచారణాధికారులు గంటలోపే విచారణను పూర్తి చేశారు. ఈనెల 8న మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఈసారి వచ్చేటపుడు క్రితంసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉపయోగించిన సెల్ ఫోన్లను ఖచ్చితంగా తీసుకు రావాలని దర్యాప్తు అధికారులు స్పష్టంగా చెప్పినట్టుగా తెలిసింది. లేనిపక్షంలో తీవ్రమైన చర్యలు తప్పవని హెచ్చరించినట్టుగా సమాచారం. ఈసారైనా శ్రవణ్ రావు ఆ రెండు మొబైల్ ఫోన్లను తీసుకువచ్చి అప్పగిస్తాడా? లేదా? కేసులోని కీలక వివరాలను వెల్లడిస్తాడా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ లింక్https://epaper.swetchadaily.com/ క్లిక్ చేయగలరు