తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Cyber Criminal Arrested: సైబర్ క్రిమినల్స్ తో జతకట్టి డిజిటల్ అరెస్ట్ పేరుతో వ్యక్తి నుంచి డబ్బు కొల్లగొట్టిన నిందితురాలిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలి నుంచి 2 మొబైల్ ఫోన్లు. 9 చెక్ బుక్కులు, 3 పాస్ బుక్కులు, క్యూఆర్ కోడ్ స్కానర్, 3 ఏటీఎం కార్డులు, 5 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. సైబర్ క్రైం డీసీపీ డీ.కవిత తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లో నివాసముంటున్న ఓ వ్యక్తికి ఇటీవల ముంబయి బాంద్రాలోని కుర్లా పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినట్టుగా ఓ ఫోన్ కాల్ వచ్చింది.
ఫోన్ చేసిన వ్యక్తి తనను తాను హెడ్ కానిస్టేబుల్ గా పరిచయం చేసుకున్నాడు. ఐసీఐసీఐ బ్యాంక్ కుర్లా బ్రాంచ్ లో నీ పేరన ఉన్న ఖాతా నుంచి పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు జరిగాయంటూ బాధితున్ని భయపెట్టాడు. అనంతరం స్కైప్ యాప్ ద్వారా బాధితునికి ఫోన్ చేసి ఇప్పటికే కేసులు నమోదైన నేపథ్యంలో అరెస్ట్ తప్పదంటూ బాధితున్ని బెదరగొట్టాడు. అలా కాకుండా ఉండాలంటే తాను చెప్పిన ఖాతాలోకి నగదును ట్రాన్స్ ఫర్ చేయమన్నారు.
విచారణ పూర్తి చేసి 24 గంటల్లో డబ్బు వాపసు చేస్తామని, దాంతోపాటు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ కూడా ఇస్తామన్నాడు. దాంతో బాధితుడు బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని మరీ సైబర్ క్రిమినల్ చెప్పిన ఖాతాలోకి 3.58లక్షల రూపాయలను బదిలీ చేశాడు. ఆ తరువాత జరిగింది మోసమని తెలుసుకుని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సీఐ నరేశ్ కేసులు నమోదు చేసి ఎస్సై మన్మోహన్, హెడ్ కానిస్టేబుల్ ఫిరోజ్, కానిస్టేబుళ్లు రాకేశ్, భార్గవిలతో కలిసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ మోసానికి పాల్పడ్డ గుంటూరు జిల్లాకు చెందిన తోట శ్రీనివాస రావు, జీవన్ కుమార్, రఘువీర్ లను ఇటీవల అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు వెల్లడించిన వివరాల మేరకు తాజాగా కొంపల్లి నివాసి, రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన కే.రితికను అరెస్ట్ చేశారు. నిందితురాలిని కోర్టులో హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు