తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Digital Arrest Scam: దేశంలో ఎక్కడా డిజిటల్ అరెస్టులు ఉండవని హైదరాబాద్ సైబర్ క్రైం ఎస్సై ప్రణీత చెప్పారు. రకరకాలుగా మోసాలు చేస్తున్న సైబర్ క్రిమినల్స్ డిజిటల్ అరెస్టుల పేరిట బెదిరించి డబ్బులు గుంజుతున్నారన్నారు. ఇలాంటి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తే ఏమాత్రం భయపడవద్దని సూచించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఏయేటికాయేడు రెచ్చిపోతున్న సైబర్ మోసగాళ్లు వేర్వేరు రకాలుగా జనాన్ని మోసం చేస్తూ ప్రతీ సంవత్సరం 7వందల కోట్ల రూపాయలకు పైగా కొల్లగొడుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సైబర్ మోసాలపై అవగాహన కల్పించేందుకు సైబర్ క్రైం డీసీపీ డీ.కవిత ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సైబర్ క్రైం పోలీసులు ప్రజల వద్దకే వెళ్లి ఆయా నేరాలు జరిగే తీరును వివరిస్తున్నారు. ఇక, సైబర్ క్రిమినల్స్ ఇటీవలిగా డిజిటల్ అరెస్టుల పేరుతో అవతలి వారిని భయపెట్టి లక్షల్లో డబ్బు గుంజుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వృద్ధులను టార్గెట్ చేస్తున్న సైబర్ మోసగాళ్లు మీ పేర కొరియర్ వచ్చింది..అందులో డ్రగ్స్ ఉన్నాయని ఫోన్లు చేసి లక్ష్యంగా చేసుకున్న వారిని బెదరగొడుతున్నారు. ఇప్పటికే మీపై ముంబయి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు కేసులు నమోదు చేశారని అదరగొడుతున్నారు.
Also Read: CM Revanth on KCR: రాజకీయ కక్ష సాధింపు మీదా? మాదా?.. సీఎం రేవంత్ ఫైర్
ఆ వెంటనే పోలీస్ యూనిఫాంలో ఉండే వ్యక్తులు వాట్సాప్ వీడియో కాల్ చేసి ఇదే విధంగా భయపెట్టి అరెస్టు కాకుండా ఉండాలంటే తాము చెప్పినట్టుగా చేయాలంటున్నారు. ఇదంతా నిజమే అని నమ్ముతున్న బాధితులు సైబర్ క్రిమినల్స్ చెప్పినట్టుగా లక్షల రూపాయలను వాళ్లు చెప్పిన ఖాతాల్లోకి బదిలీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ లోని గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ర్టానిక్స్ లో నిర్వహించిన అవగాహనా సదస్సులో సైబర్ క్రైం ఎస్సై ప్రణీత ఈ నేరాలపై అవగాహన కల్పించారు. దేశంలోని ఏ రాష్ట్ర పోలీసులు కూడా డిజిటల్ అరెస్టులు చేయరని చెప్పారు. కొరియర్ లో ఒకవేళ నిజంగా డ్రగ్స్ లాంటివి ఉంటే పోలీసులే స్వయంగా వచ్చి విచారణ చేస్తారు తప్పితే ఫోన్లు చేసి భయ పెట్టరని తెలిపారు.
Also Read: Water Bell system: విద్యార్థులకు గుడ్ న్యూస్.. వాటర్ బెల్ వచ్చేసింది..!
ఇటువంటి కాల్స్ వస్తే అస్సలు నమ్మవద్దని సూచించారు. పరిచయం లేని వ్యక్తుల నుంచి వచ్చే ఏపీకే ఫైల్స్ లింక్ పై అస్సలు క్లిక్ చేయవద్దని చెప్పారు. క్లిక్ చేసి లింక్ ను ఓపెన్ చేస్తే సైబర్ నేరగాళ్లు ఫోన్ ను హ్యాక్ చేసి ఖాతాల్లో ఉన్న డబ్బు మొత్తం తమ అకౌంట్లలోకి ట్రాన్స్ ఫర్ చేసుకుంటారన్నారు. ఓటీపీ నెంబర్లను కూడా ఎవ్వరితో షేర్ చేసుకోవద్దన్నారు. ఇంటి వద్ద నుంచే పని చేసుకునే అవకాశం కల్పిస్తాం ఇస్తామన్నా…మేం చెప్పినట్టుగా పెట్టుబడులు పెడితే ఊహించని లాభాలు వస్తాయన్నా ఏమాత్రం నమ్మవద్దన్నారు. పరిచయం లేని యువతుల నుంచి వచ్చే వాట్సాప్ వీడియా కాల్స్ కు స్పందించవద్దన్నారు. ముఖ్యంగా యువతులు దుస్తులు లేకుండా చేసే ఫోన్ కాల్స్ ను ఏమాత్రం పట్టించుకోవద్దని, వెంటనే కట్ చేసేయాలన్నారు.
పది సెకన్లు మాట్లాడినా సైబర్ క్రిమినల్స్ దానిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తామని బెదిరించి డబ్బులు గుంజుతారన్నారు. ఇక, సైబర్ క్రిమినల్స్ చేతుల్లో మోసానికి గురైతే మొదటి గంటలోనే 1930 నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. అలా చేసినట్టయితే డబ్బును కాపాడే అవకాశాలు ఉంటాయన్నారు. దీంటోపాటు 8712665171 నెంబర్ కు కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. కార్యక్రమంలో కానిస్టేబుళ్లు శ్రీకాంత్, వినయ్ పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు