Lok Sabha Polls 2024, Chevella Lok Sabha Election Whose is the seat
Politics

lok sabha Elections: లోక్‌సభ చేవెళ్ల సీటు ఎవరి చేతికో?

– పార్టీల కంటే అభ్యర్థుల బలాబలాలే కీలకం
– వ్యక్తిగత ఇమేజ్‌తో జనంలోకి కొండా
– పార్టీ పేరుతో రంజిత్ రెడ్డి ప్రచారం
– బీసీ నినాదంతో బరిలో దిగిన బీఆర్ఎస్
– 5 లక్షల మైనారిటీ ఓటర్లే కీలకం
– వలస రాజకీయంతో మారుతున్న పరిస్థితులు

Lok Sabha Polls 2024, Chevella Lok Sabha Election Whose is the seat?: తెలంగాణలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో రాజధాని హైదారాబాద్‌ను ఆనుకుని ఉన్న చేవెళ్ల సీటుపై ఇప్పుడు వాడీవేడీ చర్చ జరుగుతోంది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున రంజిత్ రెడ్డి, బీజేపీ తరపున కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ తరపున కాసాని జ్ఞానేశ్వర్ బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో ఒక పార్టీనుంచి ఎంపీగా గెలిచిన నేతలు ఐదేళ్లు తిరిగే సరికి వేరే పార్టీలో చేరటం ఆనవాయితీ. దీనిని కొనసాగిస్తూ, 2019లో ఇక్కడ బీఆర్ఎస్ తరపున ఎంపీగా గెలిచిన రంజిత్ రెడ్డి ఈసారి కాంగ్రెస్ నుంచి బరిలో దిగుతుండగా, 2014లో ఇదే స్థానం నుంచి బీఆర్ఎస్ తరపున ఎంపీగా గెలిచిన విశ్వేశ్వర్ రెడ్డి ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ అప్పటివరకు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ గులాబీ కండువా కప్పుకొన్నారు.

ఈ ఎంపీ స్థానంలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ జిల్లా పరిధిలోని తాండూరు, పరిగి, వికారాబాద్ అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ వశం కాగా, రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల అసెంబ్లీ సీట్లను బీఆర్ఎస్ దక్కించుకుంది. సుమారు పాతిక లక్షల ఓటర్లున్న ఈ పార్లమెంట్ స్థానంలోని 5 లక్షల ముస్లిం మైనారిటీ ఓట్లు ఫలితాన్ని ప్రభావితం చేయనున్నాయి. రాజధానికి పడమర దిక్కున గల ఈ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలైన తాండూరు, వికారాబాద్, పరిగి నియోజకవర్గాలు పేదరికం, వెనకబాటుతనంలో మగ్గిపోతుండగా, శేరిలింగంపల్లి, మహేశ్వరం,రాజేంద్రనగర్, చేవెళ్ల స్థానాలు రాజధానిలో దాదాపు భాగమై అభివృద్ధి చెందాయి. ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్, హైటెక్ సిటీ వంటి పేరున్న ప్రాంతాలన్నీ ఈ ఎంపీ స్థానం కిందకే వస్తాయి.

Also Read: నన్ను ఇరికించే కుట్ర.. జైలుకైనా పోతా.. : ఎర్రబెల్లి సంచలనం

తేడా లక్ష ఓట్లే…

2023 అసెంబ్లీ ఫలితాల ప్రకారం.. చేవెళ్ల నియోజకవర్గం పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి 7,07,456 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీకి 6,09,527 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీకి వచ్చిన ఓట్లు 3,35,504. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఓట్ల తేడా కేవలం లక్ష మాత్రమే. అయితే.. తాజా రాజకీయ పరిణామాల్లో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌తో సన్నిహితంగా వ్యవహరించటం, ఈ స్థానంలోని బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కాంగ్రెస్ కండువా కప్పుకోవటంతో బాటు నిన్నటి వరకు బీఆర్ఎస్ మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం ఇప్పుడు మౌనం వహించటంతో ఆ పార్టీ ఓట్లు కాంగ్రెస్‌కు పడతాయనే ప్రచారం జరుగుతోంది.

బీజేపీ బలం ఇదే..

ఇక్కడ బీజేపీ అభ్యర్థి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి నియోజకవర్గంలో విస్తృత సంబంధాలు ఉన్నాయి. ఎంపీగా పని చేయడం, కుటుంబ రాజకీయ నేపథ్యంతోపాటు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బంధుగణం, నిజాయితీ పరుడనే పేరు ఆయనకు వ్యక్తిగతంగా కలిసొచ్చే అంశాలు. గత ఎన్నికల్లో కొద్ది తేడాతో ఓటమి పాలు కావటంతో ఆ సానుభూతితోపాటు మోదీ మేనియా, అయోధ్య రామాలయ ప్రచారం, జాతీయవాద ఎజెండా కూడా ఇక్కడ బీజేపీ విజయానికి దోహదపడతాయని పలువురు అంచనా వేస్తున్నారు. పైగా కాంగ్రెస్ అభ్యర్థికి దీటుగా ఆర్థిక వనరులుండటం ఈయనకు కలిసొచ్చే అంశం. అయితే ఈ ఎంపీ స్థానం పరిధిలో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే కూడా లేకపోవటం, ఈ స్థానంలోని 5 లక్షల ముస్లిం మైనారిటీ ఓట్లపై పెద్దగా ఆశ లేకపోవటం ఆ పార్టీకి ఇక్కడ మైనస్. గత ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఆయన క్షేత్రస్థాయి ప్రచారం చేపడుతూ, ప్రజలతో మమేకమవుతున్నారు. ముఖ్యంగా ‘నేను లోకల్’ అంటూ చేస్తున్న ప్రచారం కూడా ఆయనకు కలిసొచ్చేలా ఉంది.

Also Read:మాజీ సీఎం కేసీఆర్ రైతుల వద్ద ఉంటే.. సీఎం రేవంత్ ఐపీఎల్ మ్యాచ్ వద్ద..: కేటీఆర్

గులాబీ లక్ష్యం

ఈ సీటును కాంగ్రెస్, బీజేపీలు అగ్రవర్ణాలకు అవకాశం ఇచ్చాయని, తాము మాత్రం బీసీ (ముదిరాజ్) అభ్యర్థికి ఛాన్సిచ్చామంటూ బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటోంది. తద్వారా ముదిరాజ్ ఓట్ల మీద గులాబీ పార్టీ గురిపెట్టింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ తమకొచ్చిన లక్ష ఓట్ల మెజారిటీ ఈ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని బీఆర్ఎస్ లెక్కలు వేస్తోంది. గతంలో తమ పార్టీ ఎంపీగా ఉంటూ కాంగ్రెస్‌లో చేరి ఓడిన విశ్వేశ్వర్ రెడ్డిలాగానే సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఓటమీ ఖాయమని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తాయని అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ చెబుతున్నప్పటికీ భారీగా కాంగ్రెస్‌లోకి సాగుతున్న వలసలు, కవిత అరెస్టు, ఫోన్ ట్యాపింగ్ పరిణామాలు, ఎంఐఎం స్పష్టంగా మద్దతు ప్రకటించకపోవటం ఆ పార్టీకి ఇబ్బందిగా మారాయి.

గెలుపుకై హస్తం వ్యూహం

ఇక టార్గెట్ 14 అంటూ బరిలోకి దిగిన కాంగ్రెస్ ఇక్కడ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని సీటిచ్చింది. ఆయన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిత్వం ఖరారైన వెంటనే.. నియోజకవర్గం నలుమూలల నుంచీ చేరికల హోరు మొదలైంది. బీఆర్ఎస్ ఎంపీగా ఉండగా అక్కడి నేతలను ఆహ్వానిస్తూ, కాంగ్రెస్ నేతలతో సమన్వయం చేసుకుంటూ సాగిపోతున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండటం, పథకాల ప్రభావం, 5 లక్షల మైనారిటీ ఓట్లు ఆయనకు కలిసొచ్చే అంశాలు. ఈయనకు బీఆర్ఎస్ ఎంపీ సీటు ఇస్తుందనే ఉద్దేశంతో కాంగ్రెస్‌లో చేరి, మల్కాజ్‌గిరి ఎంపీ సీటుకు మారిన పట్నం మహేందర్ రెడ్డి వర్గం, ఈ ఎన్నికల్లో చేవెళ్లలో రంజిత్ రెడ్డి విజయానికి మనస్ఫూర్తిగా పనిచేయాల్సిన అవసరం కనిపిస్తోంది. అలాగే నాన్ లోకల్ అనే ముద్ర, సిట్టింగ్ ఎంపీగా అనుకున్నంత అభివృద్ధి చేయలేకపోయారనే ప్రచారం సాగుతోంది.

Just In

01

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్