IPL Match: బీఆర్ఎస్ నాయకులు ఎండిన పంట పొలాలను పరిశీలిస్తూ పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు దీక్షలు చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లలో తెలంగాణ భవన్‌లో రైతు దీక్షలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు.
‘మన ప్రభుత్వం పోయిన నాలుగు నెలల్లోనే ఇలా కరువు అంటూ మాట్లాడుకోవాల్సి వస్తుందని అనుకోలేదు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువే. 14 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. మేడిగడ్డ నుంచి రోజు రెండు వందల క్యూసెక్కుల నీరు వృధాగా పోతున్నది. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగితే వెంటనే రిపేర్ చేసి నీటిని అందించకుండా కేసీఆర్‌ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ మీద బురద జల్లే ప్రయత్నాల్లో ఉన్నారు’ అని కేటీఆర్ విమర్శలు సంధించారు.
Also Read: ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట
రేవంత్ రెడ్డి ప్రభుత్వం దున్నపోతుతో సమానం అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘రైతులకు రూ. 500 బోనస్ ఇవ్వాలని అడిగితే ఎన్నికల కోడ్ అని దాటవేస్తున్నాడు. నిజంగానే రైతులకు ఆ డబ్బు ఇవ్వాలని అనుకుంటే.. ఆ చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల సంఘానికి లేఖ రాయి. మేం కూడా రాస్తాం. అరచేతిలో వైకుంఠం చూపెట్టి కాంగ్రెస్ గెలిచింది. మళ్లీ ఓట్లు పడుతాయని భ్రమలో ఉన్నది. ఆ పార్టీ దగాకోరుతనాన్ని ప్రజలకు వివరించి చెబుతాం. మేం రైతుల హక్కుల కోసం పోరాడుతాం. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి’ అని అన్నారు.
Also Read: కేసీఆర్‌పై ముగ్గురు మంత్రుల కౌంటర్ ఎటాక్.. కాకతీయ మిషన్ ఏమైందీ?
‘ప్రతిపక్షంలో ఉన్న మన కేసీఆర్ ఎర్రటి ఎండల్లో ప్రజల్లో తిరుగుతున్నారు. రైతుల వద్దకు వెళ్లుతున్నారు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఐపీఎల్ మ్యాచ్‌లు అంటూ తిరుగుతున్నారు’ అని కేటీఆర్ కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రీ అయితే.. ప్రధానమంత్రి తాపీ మేస్త్రీ అని పేర్కొన్నారు.