Errabelli Dayakar Rao: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు వినిపిస్తున్నది. ఈ కేసులో ఏ2గా ఉన్న ప్రణీత్ రావు మేనమామలు ఎర్రబెల్లి దయాకర్ రావుకు సన్నిహితులు. ప్రణీత్ రావుకు కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు గతంలో సహాయం చేశాడని సమాచారం. కానీ, అనూహ్యంగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వచ్చిన తరుణంలో ప్రణీత్ రావు ఎవరో తనకు తెలియదని కామెంట్ చేశారు. తాజాగా మరోసారి ఈ వ్యవహారంపై ఎర్రబెల్లి స్పందించారు.
తనకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సంబంధం లేదని దయాకర్ రావు పునరుద్ఘాటించారు. కానీ, తనను కావాలనే ఇందులో ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో తనను అరెస్టు చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోనని స్పష్టం చేశారు. అవసరమైతే జైలుకైనా పోతా.. కానీ, పార్టీని వీడను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read: మాజీ సీఎం కేసీఆర్ రైతుల వద్ద ఉంటే.. సీఎం రేవంత్ ఐపీఎల్ మ్యాచ్ వద్ద..: కేటీఆర్
ఒక వైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎర్రబెల్లి దయాకర్ రావుపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ సహా ఇతర రాజకీయ నాయకులపై ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆరోపణలు వస్తున్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన దయాకర్ రావు.. కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని చేతిలో ఓడిపోయారు. ఈ నియోజకవర్గం నుంచి గెలవాలనే ప్రయత్నంలో దయాకర్ రావు అడ్డదారి దొక్కారని, ప్రత్యర్థికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఫోన్ రికార్డింగ్ ద్వారా తెలుసుకుని తన ప్రచారంలో ఉపయోగించుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. పర్వతగిరిలో ప్రణీత్ రావు మేనమామ సంపత్ రావు నివాసం ఉన్నది. ఆ ఇంటిలోనే ప్రణీత్ రావు వార్ రూం ఏర్పాటు చేసుకున్నట్టు అధికారులు గుర్తించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలని దయాకర్ రావే ఫోన్ ట్యాపింగ్ చేయించారని అనుమానిస్తున్నారు.