మహబూబాబాద్ స్వేచ్ఛ: Mahabubabad Mandal: మహబూబాబాద్ మండలం రెడ్యాల గ్రామంలో బంగారు మైసమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. బుధవారం బంగారు మైసమ్మ తల్లి ఆలయంలో టి పి సి సి ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి బిందు రెడ్డి ఆధ్వర్యంలో కల్యాణ మహోత్సవ వేడుకలను నిర్వహించారు. బంగారు మైసమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని గ్రామస్తులు వీక్షించి పులకించిపోయారు.
రెండేళ్లకోసారి నిర్వహించే ఈ కార్యక్రమం గ్రామస్తులు సుఖశాంతులతో వర్ధిల్లాలని శ్రీకాంత్ రెడ్డి దంపతులు ప్రత్యేకంగా నిర్వహించడం ఆనవాయితీగా సాగుతుంది. ఉదయం నిర్వహించిన బంగారు మైసమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో గ్రామస్తులు అత్యధికంగా పాల్గొని విజయవంతం చేశారు.
150 మంది మహిళలతో బోనాలు
మహబూబాబాద్ మండలంలోని రెడ్యాల గ్రామం లో బంగారు మైసమ్మకు సమర్పించేందుకు 150 మంది మహిళలు బోనాలను తీసుకెళ్లారు. ప్రత్యేక పూజల అనంతరం బోనాలను కనుల పండుగగా తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు. ఆలయంలో తీర్థప్రసాదాలు భక్తులకు అందించారు. వివిధ రకాల వ్యవసాయ పనులతో రైతులు, కూలీలు బిజీగా ఉన్నప్పటికీ గ్రామంలోని బంగారు మైసమ్మ తల్లికి సమర్పించేందుకు తీసుకెళ్లే బోనాల కార్యక్రమంలో మహిళలు అత్యధికంగా పాల్గొని విజయవంతం చేశారు. రెండేళ్లకోసారి గ్రామంలో బంగారు మైసమ్మ ఆలయంలో వెన్నం శ్రీకాంత్ రెడ్డి ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని గ్రామస్తులు వెల్లడిస్తున్నారు.
శివసత్తుల నాట్యాలు… పోతురాజు విన్యాసాలు
బంగారు మైసమ్మ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఒగ్గు కళాకారులు నిర్వహించిన కార్యక్రమాలు అందరినీ అలరించాయి. శివసత్తులు నాట్యాలు అందరిని పులకింపజేశాయి. అనంతరం పోతురాజు విన్యాసాలను గ్రామస్తులు, చూపరులు వీక్షించి తరించిపోయారు. ఈ సందర్భంగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రెండేళ్లకోసారి బంగారం మైసమ్మ కళ్యాణ మహోత్సవాన్ని గ్రామస్తుల సహకారంతో విజయవంతంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామంలోని చిన్న పిల్లలు, వృద్దులు గ్రామస్తులు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వెలసిల్లాలని బంగారు మైసమ్మ తల్లిని కొలుస్తున్నామని వివరించారు.
Also Read: Minister S Savita: నేతన్నలకు గుడ్ న్యూస్.. ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు..
గ్రామంలో విస్తారమైన వర్షాలు కురిసి రైతుల పంటలు అధికంగా దిగుబడి రావాలని ఆకాంక్షిస్తూ పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, మా అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డుపల్లి ఉపేందర్, బోనగిరి గంగాధర్, జాతీయ బీసీ సంఘం బండారు వెంకటరమణ, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పొన్నాల యుగంధర్, వార్డెన్ మోహన్, బిక్షపతి, సురేందర్ రెడ్డి, నర్సింగం శ్రీనివాస్, గ్రామస్తులు పాల్గొన్నారు.