తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Mayor Vijayalaxmi: గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వరుసగా వివాదాల్లో చిక్కుతున్నారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రేస్ పార్టీలో చేరిన ఆమె వరుసగా మజ్లీస్ పార్టీతో వివాదాలను సృష్టించుకుంటున్నారు. కాంగ్రేస్ పార్టీలో చేరిన కొత్తలోనే ఆమె నగరంలోని లక్డీకాపూల్, మాసాబ్ ట్యాంక్ ప్రాంతాల్లోని అధికార పార్టీకి చెందిన రెండు హోటళ్లలో తనిఖీలు నిర్వహించి, సొంత పార్టీ నేతలతోనే విభేదాలు తెచ్చుకున్నారు. బీఆర్ఎస్ పార్టీలో కొనసాగినపుడు సైతం ఆమె సొంత బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లతో సైతం సబ్యతగా వ్యవహారించటంలో విఫలమయ్యారన్న విమర్శలున్నాయి.
ఆ తర్వాత హడావుడిగా చికెన్ సెంటర్లను తనిఖీ చేసి, మజ్లీస్ పార్టీ నేతకు చెందిన షాపును సీజ్ చేసి మరో వివాదానికి మేయర్ తెర దీశారు. మజ్లీస్ పార్టీ నేత మేయర్ తనిఖీ, ఆదేశాలను ఏ మాత్రం పట్టించుకోకుండా తనదైన స్టైల్ లో మళ్లీ చికెన్ సెంటర్ ను తెరిపించుకున్న సంగతి తెల్సిందే. ఈ వివాదానికి సంబంధించి మేయర్ పై సీఎం, పీసీసీ చీఫ్ వరకు ఫిర్యాదులు కూడా వెళ్లినా, ఆమె తన వ్యవహారశైలిని మార్చుకోలేదు. పైగా మార్చుకునే ప్రయత్నం కూడా చేయలేదని సొంత పార్టీకి చెందిన కార్పొరేటర్లు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
రాజకీయంగా మేయర్ విఫలం?
రాష్ట్రంలోనే అత్యధిక జనాభా ( సుమారు కోటి 20 లక్షల పై చిలుకు)కు అత్యవసర సేవలందిస్తున్న జీహెచ్ఎంసీ పరిధికి ఫస్ట్ సిటిజన్ గా వ్యవవహారిస్తున్న మేయర్ విద్యావంతురాలే అయినా రాజకీయ సమయానుకూలంగా రాజకీయ వ్యూహాలు రచించటం, ఎత్తుగడలు వేయటంలో విఫలమవుతున్నందునే ఆమె తరుచూ వివాదాలకు కేంద్ర బింధువవుతున్నట్లు టాక్ ఉంది. తాజాగా అధికార కాంగ్రేస్ పార్టీ అనధికార మిత్రపక్షమైన మజ్లీస్ పార్టీకి చెందిన స్టాండింగ్ కమిటీ సభ్యుల అభ్యంతరాలను సున్నితంగా తోసిపుచ్చటంలో విఫలమైన మేయర్ మున్ముందు స్టాండింగ్ కమిటీలో పెట్టనున్న ఇతర ప్రతిపాదనలకు స్టాండింగ్ కమిటీ ఆమోదం ఎలా పొందుతారన్నది ఆసక్తికరంగా మారింది.
కమిటీలో మెజార్టీ సభ్యులు వాళ్లే
రెండు రోజుల క్రితం జరిగిన కొత్త స్టాండింగ్ కమిటీ ఫస్ట్ మీటింగ్ లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద అభివృద్ది చేయాలంటూ పలు చెరువుల జాబితాను కమిటీ ముందుకు తీసుకురాగా, ఆ జాబితాలో పాతబస్తీకి చెందిన ఏ ఒక్క చెరువు లేకపోవటంతో మజ్లీస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇలాంటి సమయంలో ఎంతో వ్యూహాత్మకంగా సభ్యులు శాంతింపజేసి, ప్రతిపాదనలను తదుపరి మీటింగ్ వాయిదా వేసుకునే అవకాశమున్నా, మేయర్ ఆ ఛాన్స్ ను వినియోగించుకోకుండా సభ్యుల ఓటింగ్ పెడదామని సూచించటంతో మజ్లీస్ సభ్యులకు ఆగ్రహాం తెప్పించినట్లు సమాచారం.
Also Read: BRS 25th Anniversary: బీఆర్ఎస్ లో టెన్షన్ టెన్షన్.. ఆ ఇద్దరు నేతల గురించే అంతా చర్చ..
వాస్తవానికి స్టాండింగ్ కమిటీకి ఎన్నికైన 15 మంది సభ్యుల్లో ఎనిమిది మంది సభ్యులు మజ్లీస్ పార్టీకి చెందిన వారు కాగా, మిగిలిన ఏడుగురు కాంగ్రేస్ పార్టీకి చెందిన వారుండగా, శనివారం జరిగిన స్టాండింగ్ కమిటీ మీటింగ్ కు మజ్లీస్ పార్టీ సభ్యులు కేవలం నలుగురు మాత్రమే హాజరు కావటం, మేయర్ ఓటింగ్ పెట్టాలని ప్రతిపాదించటంతో మజ్లీస్ సభ్యులు ఎదురు తిరిగినట్లు సమాచారం. మా పార్టీ నుంచి కేవలం నలుగురం మాత్రమే వచ్చినందుకు మీరు ఓటింగ్ ప్రతిపాదిస్తున్నారా? కమిటీలో మెజార్టీ సభ్యులు మేమేనన్న విషయాన్ని మర్చిపోయారన్న విషయాన్ని మేయర్ కు గుర్తు చేస్తూ, మున్ముందు మేయర్ పెట్టే ప్రతిపాదనలకు మజ్లీస్ మెజార్టీ సభ్యులు తిరస్కరించే అవకాశమున్నట్లు సమాచారం.
మజ్లీస్ సభ్యుల వ్యూహాం ఏలా ఉండనుంది?
స్టాండింగ్ కమిటీలో మెజార్టీగా ఎనిమిది మంది సభ్యులున్నమజ్లీస్ పార్టీ ఇకపై కమిటీ సమావేశాలపై స్పెషల్ ఫోకస్ చేసేందుకు సిద్దమైనట్లు విశ్వసనీయ సమాచారం. స్టాండింగ్ కమిటీ అజెండాలో తాము పెట్టిన ప్రతిపాదనలున్నాయా? లేదా? అన్న విషయాన్ని వెరిఫై చేసుకున్న తర్వాతే వారు సమావేశానికి ముహూర్తం ఖరారు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. తాము చెప్పిన విధంగా మేయర్ తమ ప్రతిపాదనలకు అంగీకరించని పక్షంలో సమావేశానికి హాజరై, మేయర్ ను ఇరకాటం పెట్టేందుకు ప్రతిపాదనలను ఆమోదించే విషయంలో ఓటింగ్ డిమాండ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
మేయర్ ఇప్పటికే పలు సార్లు మజ్లీస్ నేతలనేగాక, సొంత కాంగ్రేస్ నేతలను టార్గెట్ చేస్తూ హడావుడి చేసిన విషయంలో పాటు శనివారం నాటి స్టాండింగ్ కమిటీలో చోటుచేసుకున్న రగడ పై కూడా త్వరలోనే కాంగ్రేస్ పార్టీ పెద్దలకు మజ్లీస్ నేతలు ఫిర్యాదు చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలిసింది.
Also Read: BJP: తెలంగాణ బీజేపీకి తప్పని రథ‘సారధి’ తిప్పలు.. పగ్గాలు ఎవరికో?