Sri Sathyasai District Crime: డబ్బులు సంపాదించేందుకు అడ్డదారులు తొక్కడంలో కొందరు ఆరితేరారు. అమాయక మహిళలను అడ్డుపెట్టుకొని తియ్యని మాటలు ఫోన్ లో మాట్లాడించి, మోసాలకు పాల్పడుతున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైజాగ్ హనీ ట్రాప్ కేసును పోలిన విధంగా, ఈ యువకుడు హనీ ట్రాప్ కు పాల్పడడంతో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అసలేం జరిగిందంటే..
మన అమాయకత్వమే.. ఇతరులకు బలం. ఔను ఎవరు ఔనన్నా.. కాదన్నా.. ఇది నిజం. అంతేకాదు మన బలహీనతే మనకు శాపం. ఎవరైనా మహిళ గొంతుతో మనతో ఫోన్ లో మాటలు కలిపితే చాలు, కొందరు ఆ మాయమాటలు నమ్మి మోసపోతారు. అలాంటి ఘటనే ఇది. హనీ ట్రాప్ పేరిట ఇటీవల మహిళల చేత ఫోన్ చేయించడం, ఆ తర్వాత అసలు గుట్టు బయట పెడతానంటూ బ్లాక్ మెయిల్ చేయడం.. ఇది హనీ ట్రాప్ ముఠా తంతు.
ఇలాగే ఓ యువకుడు అక్రమంగా డబ్బులు సంపాదించాలని భావించి, ఓ మహిళను జత చేసుకున్నాడు. ఆ మహిళ చేత ఫోన్లు చేయించడం, ఆ తర్వాత అందినకాడికి దండుకోవడం ఇదే అలవాటుగా మార్చుకున్నాడు. ఇంతకు ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు.. శ్రీ సత్య సాయి జిల్లా లేపాక్షిలో..
లేపాక్షి మండలం కొండూరుకు చెందిన ధనుంజయ్ అనే యువకుడు ఎలాగైనా అడ్డదారిలో డబ్బులు సంపాదించాలని భావించాడు. అనుకున్నదే తడవుగా ఒక మహిళతో ఫోన్ లో మాట్లాడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత మహిళతో గుర్తు తెలియని వ్యక్తులకు అసభ్యంగా వీడియో కాల్ చేయించి.. వీడియో రికార్డ్ చేసి అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. పక్కా ప్లాన్ తో మహిళతో కొంతమందికి వీడియో కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. అసభ్య వీడియో కాల్స్ ను రికార్డ్ చేసి.. డబ్బులు ఇవ్వకపోతే వీడియోలు బయట పెడతానని బెదిరింపులకు ధనుంజయ్ పాల్పడ్డాడు.
లేపాక్షి మండలానికి చెందిన సుబ్రహ్మణ్యం వ్యక్తి నుంచి రూ.1,50,000 ఫోన్ పే చేయించుకున్న ధనుంజయ్.. ఇదే హనీ ట్రాప్ లో చిక్కుకున్న ఓ రెవిన్యూ సెక్రెటరీ నుంచి దాదాపు రూ. 3 లక్షల రూపాయలు వసూలు చేశాడు. అసభ్య వీడియో కాల్స్ చూపించి డబ్బులు కావాలని బెదిరిస్తున్న ధనుంజయ్ వేధింపులు తట్టుకోలేక పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.
Also Read: Pithapuram: పిఠాపురంలో ఏం జరుగుతోంది? వర్మ పోస్టుల అర్థం అదేనా?
ధనుంజయ్ హనీ ట్రాప్ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. బాధితుల దగ్గర డబ్బులు తీసుకునేందుకు వచ్చిన హనీ ట్రాప్ నిందితుడు ధనుంజయ్ ను పక్కా ప్లాన్ తో పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ధనుంజయకు సహకరించిన మరో ముగ్గురు నిందితులతో పాటు హనీ ట్రాప్ కు పాల్పడిన మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హనీ ట్రాప్ నిందితుల నుంచి 4 సెల్ ఫోన్లు.. రూ. 45 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.