తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: CM Revanth Reddy: రాష్ట్ర పాలనను గాడిలో పెట్టేందుకు, మరింత పట్టు బిగించేందుకు కొన్ని కఠిన నిర్ణయాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారా..?? దీనిలో భాగంగా పాలనా రథసారధి అయిన ప్రస్తుతచీఫ్ సెక్రటరీని కూడా మార్చి సీనియర్ ఐఏఎస్ రామకృష్ణారావుకు చాన్స్ ఇవ్వబోతున్నారా..?? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం సచివాలయ వర్గాల నుంచి వస్తోంది. ఓ వైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా జరుగుతుంటే, మరో వైపు ఇంకో చర్చ కూడా అటు సచివాలయంలో, ఇటు అసెంబ్లీ లాబీల్లో జోరందుకుంది.
అసెంబ్లీ సెషన్ ముగియగానే, ఉగాది తర్వాత ఏప్రిల్ మొదటివారంలో అధికార యంత్రాంగంలో భారీ కుదుపు ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. రాజకీయ వర్గాలతో పాటు, అధికారుల మధ్య కూడా చర్చ తీవ్రంగా ఉంది. పలు శాఖల సెక్రెటరీలైన సీనియర్ ఐఏఎస్ లతో పాటు జిల్లా కలెక్టర్లకూ స్థానం చలనం తప్పకపోవచ్చు. చాలా రోజుల ఈ బదిలీల ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. అసెంబ్లీ సమావేశాల కంటే ముందే ఉండొచ్చని ప్రచారం జరిగినా, కీలకమైన బడ్జెట్ సెషన్ ఉన్నందున ముఖ్యమంత్రి వాయిదా వేశారని సమాచారం.
అయితే అన్ని రకాల బదిలీలకు సంబంధించిన ముందస్తు ప్రక్రియ ఆల్రెడీ పూర్తయిందని, కేవలం ఉత్తర్వులు మాత్రమే రావాల్సిఉందని ఓ కీలక అధికారి వెల్లడించారు. తనకు ఇంకా పాలనపై పట్టు రాలేదని కొందరు విమర్శిస్తున్నారని, మంత్రులనో, అధికారులను మారిస్తేనే పట్టు వచ్చినట్లా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్య పలుమార్లు బహిరంగంగానే అంటున్నారు. ఆయన మాటల్లో అంతరార్థం గ్రహించాలనే చర్చ పాలనా కేంద్రం సచివాలయంలో జోరుగా సాగుతోంది.
Also read: BJP Etela Rajender: మూసీ కోసం ఈటెల ముందడుగు.. నిధులివ్వాలంటూ..
ఎన్నిసార్లు చెప్పినా కొందరు అధికారులు పద్దతి మార్చికోలేదని, క్షేత్ర స్థాయికి వెళ్లటం లేదని గతంలో ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రాధామ్యాలను గుర్తించి పనిచేయకుండా అలసత్వంతో ఉన్నారని అన్నారు. ఏకంగా ఏసీ రూమ్ లకు అనే రోగానికి అలవాటుపడ్డారనే తీవ్ర వ్యాఖ్యలను కూడా సీఎం చేశారు. ఇవన్నీ అధికారుల తీరుపై కొద్ది రోజులుగా ఆయనలో గూడుకట్టుకున్న అసంతృప్తికి సూచనలే అనే చర్చ జరుగుతోంది. అందుకే ఓ భారీ కుదుపు లాంటి బదిలీలు చేస్తే తప్ప చాలా మంది సెట్ కారని ముఖ్యమంత్రి కార్యాలయం కూడా భావిస్తున్నట్లు తెలిసింది.
వచ్చే నెలాఖరుకు పదవీ విరమణ పొందాల్సి ఉన్న చీఫ్ సెక్రటరీ శాంతి కుమారిని కూడా కొంత ముందుగానే మార్చుతారనే ప్రచారం ఊపందుకుంది. ఆమె స్థానంలో ప్రస్తుత ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ వస్తుందని అంటున్నారు. అదేసమయంలో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు ఆయనతోనే ఆర్థిక శాఖ ఉండనున్నట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. రిటైర్మెంట్ కు కేవలం నాలుగు నెలల సమయం ఉన్న రామకృష్ణారావుకు మరో మూడు నెలల పొడగింపు ఇచ్చి నవంబర్ దాకా కొనసాగించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం.
Also read: RIDF scheme CM Revanth: మహిళలకు గుడ్ న్యూస్.. తక్కువ వడ్డీకే రుణాలు?
మరోవైపు ముందస్తు రిటైర్ మెంట్ ద్వారా మరో ముఖ్యమైన పదవిపై శాంతి కుమారి ఆశలుపెట్టుకున్నట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్ తో సహా, మిగతా కమిషనర్లను ప్రభుత్వం నియమించనున్నట్లు సమాచారం. ఈమేరకు ముఖ్యమంత్రి ఇప్పటికే కొందరికి హామీ ఇచ్చారు. అటు కోర్టు కూడా త్వరగా ఆ నియామకాలు చేపట్టాలని ఇప్పటికే సూచించింది. శాంతి కుమారికి చీఫ్ కమిషనర్ పదవి దక్కొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది.
Also read: MLC Kavitha: స్పీడ్ పెంచిన కవిత.. టెన్షన్ లో హరీష్ రావు, కేటీఆర్?
ఇక వివిధ శాఖలను దీర్ఘకాలంగా పర్యవేక్షిస్తున్న జయేష్ రంజన్, నవీన్ మిట్టల్, సందీప్ కుమార్ సుల్తానియా, వికాస్ రాజ్, రఘునందన్ రావు, తదితరులకు కూడా బదిలీలు తప్పకపోవచ్చని అంటున్నారు. వీరిలో కొందరికి మంత్రులతో కూడా పొసగటం లేదు. పలువురు మంత్రులు తమ సెక్రటరీలను మార్చాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలుస్తోంది.
ఇక స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల్లో కూడా కొందరికి స్థాన చలనం తప్పకపోవచ్చన్న చర్చ కూడా అసెంబ్లీలో, సచివాలయంలోనూ జరుగుతోంది. కొందరికి పనిభారం, మరికొందరిపై మంత్రుల అసంతృప్తి కూడా కారణం కావొచ్చని సమాచారం. సీనియర్ మంత్రులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావులు తమ పరిధిలో ఉన్న అధికారులపై అసంతృప్తితో ఉన్నారనే వాదనలు ఉన్నాయి.
Also read: SC on TG Govt: తెలంగాణ ప్రభుత్వానికి ‘సుప్రీం’ నోటీసులు.. ఆ ఎమ్మెల్యే ఏమన్నారంటే?
అటు అఖిల భారత సర్వీసుకు చెందిన యువ అధికారుల తీరుపైన కూడా అనేక విమర్శలు, ఫిర్యాదులు కూడా ప్రభుత్వానికి వస్తున్నాయి. హోదా ద్వారా వచ్చే ఫలాలను అనుభవించేందుకు ఇస్తున్న ప్రాధాన్యత పేదలకు ప్రభుత్వ పథకాలను అందించేందుకు కొందరు అధికారులు ఇవ్వటంలేదనేది ప్రధాన విమర్శ. వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న ఐఏఎస్ లపై ఈ రకమైన ఫిర్యాదులు వస్తే ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం కూడా తెప్పించుకున్నట్లు తెలిసింది. వీటి ఆధారంగా జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులకు ప్రమోషన్లు, డిమోషన్లు ఉండనున్నట్లు సమాచారం.
అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నందున ఇక ఇచ్చిన హామీలు, పూర్తి చేయాల్సిన గ్యారంటీలపై మరింత ఫోకస్ గా ప్రభుత్వం పనిచేయాల్సిఉంది. సచివాలయంలో తీసుకున్న నిర్ణయాలు క్షేత్ర స్థాయిలో అమలు కావాలంటే ప్రభుత్వ ప్రాధామ్యాలకు అనుగుణంగా పనిచేసే అధికారుల టీమ్ ను బిల్డ్ చేయాలని ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా బదిలీలు, మార్పులు చేర్పులు ఉండనున్నాయని ఆయన సన్నిహితులు అంటున్నారు.
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/3988644/TG-Edition/Swetcha-daily-TG-epaper-21-03-2025#page/1/1