first telugu news reader shanti swarup died of heart attack revanth reddy condolence తొలి తెలుగు యాంకర్ శాంతిస్వరూప్ సేవలు చిరస్మరణీయం: సీఎం రేవంత్ రెడ్డి
shantiswarup
క్రైమ్

ShantiSwarup: తొలి తెలుగు యాంకర్ శాంతిస్వరూప్ సేవలు చిరస్మరణీయం: సీఎం రేవంత్ రెడ్డి

Telugu News Reader: తొలి తెలుగు న్యూస్ రీడర్, శాంతి స్వరూప్ హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో రెండు రోజుల క్రితం ఆయనను హాస్పిటల్‌లో చేర్చారు. తెలుగు ప్రేక్షకుల విశేషాదరణను చూరగొన్న శాంతిస్వరూప్ శుక్రవారం కన్నుమూశారు. ఆయన మరణంపట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శాంతిస్వరూప్ సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన అందించిన సేవలు తెలుగు మీడియా రంగంలో చిరస్మరణీయం అని వివరించారు. ఆయనకు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా శాంతిస్వరూప్ మృతికి సంతాపం తెలిపారు. శాంతిస్వరూప్ మరణం దిగ్భ్రాంతి కలిగించిందని పేర్కొన్నారు. వార్తలు అనగానే తొలిగా గుర్తొచ్చేది శాంతి స్వరూప్ పేరే. తాను ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంతిస్వరూప్‌తో కలిసి ‘ప్రజలతో ముఖ్యమంత్రి’ అనే కార్యక్రమాన్ని సోమవారం చేసేవాళ్లమని గుర్తు చేశారు. ఆ విధంగా తమ అనుబంధం సుదీర్ఘమైనదని పేర్కొన్నారు.

Also Read: ఓడిపోయినా వాస్తును వదలని కేసీఆర్!.. అప్పుడు సెక్రెటేరియట్, ఇప్పుడు తెలంగాణ భవన్

శాంతిస్వరూప్ గురించి ఆసక్తికర విషయాలు

శాంతిస్వరూప్ దూరదర్శన్‌లో 1978లో ఉద్యోగం చేరారు. ఆయన వార్తలు చదవడానికి 1983వ సంవత్సరం వరకు వేచి చూడాల్సి వచ్చింది. 1983 నవంబర్ 14వ తేదీన ఆయన తొలిసారిగా తెలుగులో వార్తలు చదివారు. అవే తొలి తెలుగు వార్తల ముఖ్యాంశాలు. ఆయన పలికిన తొలి పలుకులు ఇవీ.. ‘నమస్కారం. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. బాలల దినోత్సవం సందర్భంగా లాల్ బహదూర్ స్టేడియంలో బాలల దినోత్సవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు ప్రారంభించారు’. శాంతిస్వరూప్ వార్తలు చదివే కాలంలో టెలీ ప్రాంప్టర్లు లేవు. కాబట్టి, వార్తలు రాసి చదివి గుర్తుంచుకుని కెమెరా ముందు చదివేవారు.

శాంతిస్వరూప్ తనకంటే సహ సీనియర్ యాంకర్ రోజా రాణిని పెళ్లి చేసుకున్నారు. 2011 వరకు ఆయన వార్తలు చదివారు. ఆ తర్వాత విరమణ చేశారు. ఈ సేవలు అందించినందుకు గాను ఆయనను లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు వరించింది. కేవలం వార్తలు రాయడమే కాదు.. ఆయన నవలలు కూడా రాశారు. భోపాల్ గ్యాస్ దుర్ఘటన మీద ‘రాతి మేఘం’, క్రికెట్ మీద ‘క్రేజ్’ అనే నవల రాశారు. అలాగే సతీసహగమనాన్ని వ్యతిరేకిస్తూ ‘అర్ధాగ్ని’ నవలనూ రాశారు. మంచి వక్త కూడా.

రిటైర్‌మెంట్ తర్వాత కూడా ఆయన చురుకుగా కనిపించారు. పలు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. నాటి జ్ఞాపకాలను తరుచూ తలపోసేవారు. కుర్ర యాంకర్లకూ ఆయన ఓ సలహా ఇచ్చారు. వార్తలను చదవడం కాదు.. వార్తలు చెప్పాలని సూచించారు.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..