Telangana Bhawan: మాజీ సీఎం కేసీఆర్‌కు వాస్తు మీద అపార నమ్మకం. ఎందరు కాదన్నా.. ఎంతమంది విమర్శించినా సెక్రెటేరియట్ విషయంలో వెనక్కి తగ్గలేదు. వాస్తు బాగాలేదని చెబుతూ పాత సెక్రెటేరియట్‌ను కూల్చేశారు. కోట్లు ఖర్చు పెట్టి కొత్త సెక్రెటేరియట్ నిర్మించారు. అనుకున్నట్టుగా వాస్తు ప్రకారం నిర్మించుకున్న కొత్త సెక్రెటేరియట్‌లో ఆయన అడుగుపెట్టారు. అప్పటి వరకు దాదాపు తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నా సెక్రెటేరియట్‌కు రాలేదు. ఈ విషయమై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ఆయన ఖాతరు చేయలేదు.
అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు కొత్త సెక్రెటేరియట్‌ను ప్రారంభించినప్పటికీ బీఆర్ఎస్ పరాజయం పాలైంది. కేసీఆర్ నమ్ముకున్నట్టుగానే ఎవ్వరినీ లెక్కచేయకుండా ఈ ఘనకార్యం చేసినా ఆయన అనుకున్న ఫలితాలను మాత్రం పొందలేకపోయాడు. వాస్తు వర్కౌట్ కాదని అప్పటికైనా కేసీఆర్ ఓ అభిప్రాయానికి వస్తాడేమో అని అనుకున్నారు. కానీ, అంతలేదు.. కేసీఆర్ వాస్తును నమ్మకుండా ఉండలేడు అని తాజా పరిణామాలు తెలుపుతున్నాయి.
Also Read: కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో హామీలు ఇవే
తాజాగా బంజారాహిల్స్‌లోని బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో మార్పులు చేస్తున్నారు. తెలంగాణ భవన్‌లో వాస్తు దోషం ఉన్నందున పార్టీకి కలిసి రావడం లేదని పండితులు సూచనలు చేసినట్టు పార్టీ వర్గాలు చర్చిస్తున్నాయి. అందుకే వాస్తు నిపుణుల సలహాలు మేరకు తెలంగాణ భవన్‌కు అవసరమైన మార్పులు చేస్తున్నట్టు తెలుస్తున్నది.
తెలంగాణ భవన్‌లో ఇప్పటి వరకు ఉపయోగించిన వాయవ్య దిశలోని గేటును మూసివేస్తున్నారు. ఈశాన్య దిశలోని గేటును తెరిచి ఈ మార్గంలోనే రాకపోకలు సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ గేటు నుంచి రాకపోకలు సాగించడానికి అనువుగా ర్యాంపు నిర్మాణం చకచకా జరుగుతున్నది. ఈ గేటు తెరిస్తే వీధి పోటు ఉన్నది. దీనికి నివారణగా లక్ష్మీ నరసింహ స్వామి చిత్రంతో కూడిన ఫ్లెక్సీని గేటుకు ఏర్పాటు చేశారు.
Also Read: గజగజ వణికిస్తున్న గజరాజు.. ఆ మండలాల్లో 144 సెక్షన్
ఇదిలా ఉండగా.. వాస్తు దోష నివారణ కోసం ఈ మార్పులు కాదని, వాయవ్య గేటు వైపు ట్రాఫిక్ పెరగడంతో గేటు ముందు స్వల్ప సమయం కూడా వాహనాలను నిలిపే పరిస్థితులు లేవని, ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయని, అందుకే ఈశాన్య గేటు ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నట్టు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. వాయవ్యం గేటు వైపు బయట వాహనాలు నిలిపితే భారీగా చలానాలు వస్తున్నాయనీ పేర్కొంటున్నారు.
మరి తెలంగాణ భవన్‌లో ఈ మార్పులతో బీఆర్ఎస్ నుంచి వేరే పార్టీలోకి వలసలు ఆగుతాయా? పార్లమెంటు ఎన్నికల్లో కారు దూసుకెళ్లుతుందా? కేసుల ఉచ్చుల నుంచి పార్టీ నాయకులు సేఫ్ అవుతారా? తెలియాలంటే వేచి చూడాల్సిందే.