తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: HCA Fund Misuse- నిధుల గోల్ మాల్ వ్యవహారంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులకు చెందిన 51.29 లక్షల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. క్విడ్ ప్రో కో పద్దతిలో లక్షల రూపాయలను స్వాహా చేసినందుకే ఈ చర్యలు తీసుకున్నట్టు స్పష్టం చేసింది. గతంలో క్రికెట్ బాల్స్, బక్కెట్ కుర్చీలు, జిమ్ పరికరాల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సారా స్పోర్ట్స్, ఎక్స్ లెంట్ ఎంటర్ ప్రైజెస్, బాడీ డ్రెంచ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చింది.
Also read: Abhishek Sharma -Travis Head: అభిషేక్ తో హెడేక్..!
అయితే, మార్కెట్ రేటుకన్నా ఎక్కువ ధరలు కోట్ చేసినా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ఈ సంస్థలకు కాంట్రాక్టర్లు ఇచ్చారు. ఈ విషయం వెలుగు చూడటంతో అప్పట్లో తీవ్ర కలకలం రేగింది. ఈ క్రమంలో ఈడీ అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. దీంట్లో అప్పట్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా, కోశాధికారిగా ఉన్న సురేందర్ అగర్వాల్ క్విడ్ ప్రో కో పద్దతిన ఈ మూడు సంస్థల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్టు వెల్లడైంది.
క్రికెట్ బాల్స్ సప్లయ్ చేసిన సారా స్పోర్ట్స్ 17లక్షల రూపాయలను సురేందర్ అగర్వాల్ భార్య భాగస్వామిగా ఉన్న కేబీ జువెలర్స్ సంస్థ ఖాతాతో పాటు ఆమె వ్యక్తిగత అకౌంట్ లోకి కొంత నగదును ట్రాన్స్ ఫర్ చేసినట్టు వెల్లడైంది. దాంతోపాటు సురేందర్ అగర్వాల్ కుమారుడు అక్షిత్ అగర్వాల్ ఖాతాలోకి కూడా నగదును బదిలీ చేసినట్టు నిర్ధారణ అయ్యింది. ఓ మ్యూజిక్ షోను స్పాన్సర్ చేస్తున్నట్టుగా పేర్కొని నగదును ఆయా ఖాతాల్లోకి ట్రాన్స్ ఫర్ చేసినట్టు వెల్లడైంది.
అదే సమయంలో బకెట్ కుర్చీలు సరఫరా చేసిన ఎక్స్ లెంట్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ సురేందర్ అగర్వాల్ , అతని కొడుకు అక్షిత్ అగర్వాల్ ఖాతాలతోపాటు వజ్రాలు కొన్నట్టుగా పేర్కొంటూ కేబీ జువెలర్స్ అకౌంట్ లోకి 21.86లక్షల రూపాయలను బదిలీ చేసింది. ఇక, జిమ్ పరికరాలను సరఫరా చేసిన బాడీ డ్రెంచ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 52 లక్షల రూపాయలను సురేందర్ అగర్వాల్, ఆయన కూతురు ఖాతాల్లోకి బదిలీ చేసింది. విచారణలో వెల్లడైన ఈ వివరాల నేపథ్యంలో తాజాగా ఈడీ అధికారులు సురేందర్ అగర్వాల్ ఆయన కుటుంబ సభ్యుల పేరున ఉన్న 51.29 లక్షల ఆస్తులను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.