United Forum of Bank Unions: బ్యాంక్ ఉద్యోగులు రెండ్రోజుల సమ్మెకు పిలుపునిచ్చారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆల్ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ (UFBU) ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. మార్చి 23 అర్ధరాత్రి నుంచి మార్చి 25 అర్ధరాత్రి వరకు ఈ సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సమ్మెను దృష్టిలో ఉంచుకొని బ్యాంక్ వినియోగదారులు.. తమ నగదు లావాదేవీలను నిర్వహించుకోవాలని సంబంధిత వర్గాలు సూచిస్తున్నాయి.
సమ్మె ఎందుకంటే?
బ్యాంకుల్లో 5 రోజుల పనిదినాలతో పాటు.. ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియమకాలు చేపట్టి పని భారం తగ్గించాలని బ్యాంక్ యూనియన్లు గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ (IBA)తో UFBU (United Forum of Bank Unions) సభ్యులు చర్చలు జరపగా అది విఫలమయ్యాయి. దీంతో UFBU సమ్మెకు దిగాలని నిర్ణయించింది. ఈ మేరకు సమ్మె తేదీలను ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
నిరసనల్లో 9 సంఘాలు
యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ లో మొత్తం 9 సంఘాలు ఉన్నాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఎంప్లాయీస్ కాంగ్రెస్ (INBEC), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ (INBOC), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ (NOBW), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (NCBE), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (AIBOA), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BEFI), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ (NOBO) యూఎఫ్ బీయూ లో భాగంగా ఉన్నాయి. సమ్మె నేపథ్యంలో ఆయా యూనియన్స్ లో భాగంగా ఉన్న బ్యాంక్ ఉద్యోగులు నిరసనలు చేపట్టనున్నారు.
వరుసగా 4 రోజులు సెలవు
మార్చి 22న నాలుగో శనివారం, మార్చి 23న ఆదివారం కావడంతో బ్యాంకులకు ఇప్పటికే సెలవులు ఉన్నాయి. అయితే 23 అర్ధ రాత్రి నుంచి UFBU సమ్మెకు పిలుపునివ్వడంతో మార్చి 24, 25న బ్యాంకు సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశముంది. దీంతో వరుసగా 4 రోజులు బ్యాంకులు పనిచేయకపోవచ్చని బ్యాంకింగ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. శనివారం నుంచి వచ్చే మంగళవారం వరకూ బ్యాంకు సేవలు అందుబాటులో ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నాయి.
Also Read: IPL 2025 – SRH: బాదుడుకే బాద్ షా రైరై రైజర్స్..
ఉద్యోగుల డిమాండ్లు సమగ్రంగా..
5 రోజులు పనిదినాలు, ఖాళీల భర్తీతో పాటు మరికొన్ని డిమాండ్లను UFBU లేవనెత్తింది. చాలా కాలంగా పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్దీకరించాలని IBAను కోరుతోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెర్ఫార్మన్స్ రివ్యూ.. PLI మార్గదర్శకాలను వెనక్కు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే ఉద్యోగుల భద్రతకు భరోసా కల్పించాలని పట్టుబడుతోంది. గ్రాట్యుటీ చట్టాన్ని సవరించి గరిష్ట పరిమితిని రూ. 25 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తోంది. ఈ సమస్యలను పరిష్కరించకుంటే భవిష్యత్ లో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉద్ధృతం చేస్తామని UFBU స్పష్టం చేస్తోంది. కాగా, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2013 నుండి 2024 వరకు 1.39 లక్షల ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయినట్లు యూనియన్ సభ్యులు చెబుతున్నారు.