తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: DK Aruna: బీజేపీ ఎంపీ డీ.కే.అరుణ ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి సుత్తి, స్క్రూడ్రైవర్, కట్టర్, తాళంచెవుల గుత్తి, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.విచారణలో నిందితుడు పాతనేరస్తుడని వెల్లడైంది. దేశ రాజధాని ఢిల్లీలోని వేర్వేరు పోలీస్ స్టేషన్ల పరిధుల్లో 17 దొంగతనాలు చేసినట్టుగా నిర్ధారణ అయ్యింది.వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
పాతబస్తీ తలాబ్ కట్ట అమ్మాన్ నగర్ బీ ప్రాంత నివాసి మహ్మద్ అక్రమ్ (48)వృత్తిరీత్యా టైల్స్ ఫిట్టర్.కాగా, తేలికగా డబ్బు సంపాదించటానికి గాను దొంగతనాలు చేయటం మొదలు పెట్టాడు. ఒక్క 2017వ సంవత్సరంలోనే ఢిల్లీలోని వేర్వేరు పోలీస్ స్టేషన్ల పరిధుల్లో 17 దొంగతనాలు చేశాడు. ఆ తరువాత హైదరాబాద్ కు వచ్చిన అక్రమ్ అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాడు. ఈనెల 15 అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 56లోని ఎంపీ డీ.కే.అరుణ ఇంట్లోకి దొంగతనం చేయాలని చొరబడ్డాడు. ఆ సమయంలో అయిన అలికిడితో ఇంటి మొదటి అంతస్తులో పడుకుని ఉన్న ఎంపీ కారు డ్రైవర్ కు మెలకువ వచ్చింది. లేచి చూడగా ఎవ్వరూ కనిపించలేదు.
Also Read: Greater Warangal: మాయమాటలతో బాలికల ట్రాప్.. ముఠా గుట్టురట్టు
దాంతో అతను నిద్రపోయాడు. కాగా, దాదాపు గంటన్నరపాటు ఎంపీ ఇంట్లోని వేర్వేరు గదుల్లోకి వెళ్లిన అక్రమ్ విలువైన సొత్తు కోసం వెతికాడు. అయితే, చేతికి ఏమీ దొరకక పోవటంతో వచ్చిన దారిలోనే పరారయ్యాడు. ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఎంపీ డీ.కే.అరుణ జరిగిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తన నివాసం వద్ద భద్రతను పెంచాలని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి భద్రతను పెంచాలంటూ పోలీసు అధికారులను ఆదేశించారు కూడా. డీ.కే.అరుణ వద్ద డ్రైవర్ గా పని చేస్తున్న ఉద్యోగి ఇచ్చిన మేరకు కేసులు నమోదు చేసిన జూబ్లీహిల్స్ డీఐ మధుసూదన్ సిబ్బందితో కలిసి విచారణ చేపట్టారు.
ఇందులో భాగంగా ఎంపీ నివాసంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. దాంతోపాటు ఆమె ఇంటికి వెళ్లే అన్ని దారుల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని కూడా విశ్లేషించారు. ఈ క్రమంలో చోరీకి యత్నించింది అక్రమ్ అని గుర్తించారు. మంగళవారం ఉదయం 10గంటల సమయంలో అమ్మాన్ నగర్ బీలోని అతని ఇంటి వద్ద అక్రమ్ ను అరెస్ట్ చేశారు. చాకచక్యంగా దర్యాప్తు జరిపి నిందితున్ని అరెస్ట్ చేసిన డీఐ మధుసూదన్ తోపాటు సిబ్బందిని డీసీపీ విజయ్ కుమార్ అభినందించారు.
Also Read: Hyderabad News: ఆ లారీ నిండా అవే.. ఎట్టకేలకు పోలీసులు పట్టేశారు