తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ:Uppal Stadium: 18వ ఎడిషన్ ఐపీఎల్ క్రికెట్ మ్యాచుల సందర్భంగా ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. విధుల నిర్వహణలో ఏమాత్రం అలసత్వాన్ని ప్రదర్శించ వద్దన్నారు. ఈనెల 23న ప్రారంభమై మే 21 వరకు కొనసాగనున్న ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో 9 మ్యాచులు జరుగనున్నాయి. ఈ క్రమంలో చేయాల్సిన బందోబస్తు ఏర్పాట్లపై కమిషనర్ సుధీర్ బాబు సోమవారం తన కార్యాలయంలో సమీక్షా సమావేశం జరిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రికెట్ మ్యాచులు చూడటానికి జనం భారీ సంఖ్యలో వస్తారని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎలాంటి చిన్నపాటి అవాంఛనీయ సంఘటన జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని శాంతిభద్రతల పరిస్థితికి ఎలాంటి విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ల్యాప్ టాప్ లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, అగ్గిపెట్టెలు, పదునైన వస్తువులు, తినుబండారాలు, వాటర్ బాటిల్లను స్టేడియం లోపలికి తీసుకెళ్లనివ్వొద్దని చెప్పారు. వాహనాల పార్కింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. సాధారణ వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ముఖ్యంగా ఉప్పల్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జాంమ్ లు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
450 సీసీ కెమెరాలు…
ఇక,ఉప్పల్ క్రికెట్ స్టేడియం చుట్టూ 450 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్టు కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. ప్రతీ ఒక్కరి కదలికలు వీటిల్లో నిక్షిప్తమవుతాయన్నారు. సివిల్ పోలీసులతోపాటు ట్రాఫిక్,రిజర్వ్ విభాగాలకు చెందిన సిబ్బంది, ఎస్వోటీల అధికారులు డ్యూటీల్లో ఉంటారని చెప్పారు.టిక్కెట్ల పంపిణీలో ఎలాంటి గందరగోళ పరిస్థితులు ఏర్పడకుండా చూడాలని ఐపీఎల్ నిర్వహణా బృందానికి సూచించారు.
స్టేడియం ప్రవేశ మార్గాల్లో అనుమతి లేని వీధి వ్యాపారులను అనుమతించ వద్దని చెప్పారు. స్టేడియం లోపల ఆహార పదార్థాలు, కూల్ డ్రింకులు అమ్మేవారు ఒకే రకమైన దుస్తులు ధరించాలని సూచించారు. ఈ సమావేశంలో డీసీపీలు పద్మజ, అరవింద్ బాబు, ఇందిర, నరసింహారెడ్డి, మల్లారెడ్డి, రమణారెడ్డి, శ్యాంసుందర్ తోపాటు పలువురు ఏసీపీలు, సన్ రైజర్స్ టీం ప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read: Hardik Pandya: ముంబై ఎక్స్ ఫ్యాక్టర్.. కుంగ్ ఫూ పాండ్యా