తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Hyderabad Crime: సంచలనం సృష్టించిన యాసిడ్ అటాక్ కేసులోని మిస్టరీని పోలీసులు గంటల్లోనే ఛేదించారు. పక్కగా ఆధారాలు సేకరించి ఈ నేరానికి పాల్పడ్డ ఇద్దరిని అరెస్ట్ చేశారు. సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ పాటిల్ కాంతిలాల్ సుభాష్, అదనపు డీసీపీ టీ.స్వామి, టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు, సైదాబాద్ ఏసీపీ డీ.వెంకన్నతో కలిసి సైదాబాద్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. సైదాబాద్ బ్కాంక్ కాలనీ నివాసి నర్సింగ్ రావు (60) పన్నెండేళ్లుగా దోభీఘాట్ రోడ్డులో ఉన్న శ్రీ భూలక్ష్మీ మాతా ఆలయం, గోశాల కమిటీల సభ్యునిగా కొనసాగుతూ వస్తున్నారు. ఈ క్రమంలో దేవాలయంలో రిసెప్షనిస్టుగా అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు.
ప్రతీరోజూ ఉదయం 6గంటలకు వచ్చి మందిరం తెరుస్తూ పూజలు, అభిషేకాలు ముగిసిన తరువాత రాత్రి 10.30గంటల సమయంలో మందిరానికి తాళం వేసి వెళుతుంటారు. ఆలయానికి, గోశాలకు ఎవరైనా దాతలు విరాళాలు ఇస్తే వారికి రసీదులు ఇవ్వటంతోపాటు ఆ లెక్కలన్నీ నర్సింగ్ రావే చూసుకుంటుంటాడు. ఈనెల 14న నర్సింగ్ రావు కౌంటర్ లో కూర్చుని ఉండగా తలపై టోపీ, ముఖానికి మాస్క్ వేసుకుని వచ్చిన ఓ వ్యక్తి తన పేరు నరేష్ అని పరిచయం చేసుకున్నాడు. అన్నదానానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నాడు.
Also Read: Mulugu District News: మిర్చికి మద్దతు ధర ఎక్కడ? బీఆర్ఎస్ నేత డిమాండ్
ఆ తరువాత అన్నదాన కార్యక్రమానికి విరాళం ఇస్తున్నట్టు చెప్పి రసీదు ఇవ్వమని అడిగాడు. నర్సింగ్ రావు రసీదు రాస్తుండగా దుస్తుల్లో నుంచి సీసాను బయటకు తీసిన వ్యక్తి హ్యాపీ హోలీ అంటూ అందులో ఉన్న యాసిడ్ ను తల, ముఖంపై పోశాడు. ఆ వెంటనే అక్కడి నుంచి బైక్ పై పారిపోయాడు. తల, ముఖంపై కాలిన గాయాలైన నర్సింగ్ రావు కేకలు పెట్టగా విని ఆలయంలో ఉన్నవారు వెంటనే వచ్చి హుటాహుడిన అతన్ని మలక్ పేట యశోధా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలియగానే సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు అక్కడ దొరికిన ఆధారాలను సేకరించారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సింగ్ రావు వాంగ్మూలాన్ని సేకరించారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ఆరు బృందాలతో విచారణ…
స్థానికంగా ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించటంతో సౌత్ ఈస్ట్ జోన్ ఉన్నతాధికారులు సైదాబాద్ పోలీసులతోపాటు టాస్క్ ఫోర్స్ సిబ్బందిని ఆరు బృందాలుగా ఏర్పరిచి రంగంలోకి దింపారు. ఈ క్రమంలో ప్రత్యేక బృందాల్లోని అధికారులు భూలక్ష్మి మాతా ఆలయం వద్ద ఉన్న సీసీ కెమెరాతోపాటు మొత్తం 400 కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఈ క్రమంలో యాసిడ్ పోసిన వ్యక్తి మందిరం వద్ద నుంచి సైదాబాద్ మెయిన్ రోడ్డు, చెంచల్ గూడ, చాదర్ ఘాట్, మలక్ పేట మెయిన్ రోడ్డు, విక్టోరియా గ్రౌండ్, మొజంజాహీ మార్కెట్, గాంధీ భవన్, ఏక్ మినార్ మసీదు, మెహదీపట్నం, టోలీచౌకీ మీదుగా బైక్ పై వెళ్లినట్టు నిర్ధారించుకున్నారు.
ఈ క్రమంలోనే సదరు వ్యక్తి గాంధీ భవన్ మెట్రో స్టేషన్ వద్ద ఓ షాపు నుంచి టోపీ కొన్నట్టు గుర్తించారు. ఈ ఆధారాలతో యాసిడ్ దాడికి పాల్పడ్డ షేక్ పేట నివాసి, వృత్తిరీత్యా పూజారి అయిన రాయికోడ్ హరిపుత్ర (31)ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను వెల్లడించిన వివరాల మేరకు భూలక్ష్మి మాత ఆలయంలోనే పూజారిగా పని చేస్తున్న సరస్వతీనగర్ కాలనీ నివాసి అరిపిరాల రాజశేఖర శర్మ (41)ను అరెస్ట్ చేశారు.
2వేల రూపాయలకు కక్కుర్తి పడి…
ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న హరిపుత్ర 2వేల రూపాయల కోసం కక్కుర్తి పడి ఈ నేరానికి పాల్పడినట్టుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. భూలక్ష్మి మాత ఆలయంలో పూజారిగా పని చేస్తున్న రాజశేఖర శర్మకు కొంతకాలంగా నర్సింగ్ రావుతో విభేదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో తనకు పరిచయం ఉన్న హరిపుత్రను పిలిచిన రాజశేఖర శర్మ తాను చెప్పినట్టుగా నర్సింగ్ రావుపై యాసిడ్ దాడి చేస్తే 2వేల రూపాయలు ఇస్తానన్నాడు. ఫోన్ పే ద్వారా వెయ్యి రూపాయలు అడ్వాన్సుగా ఇచ్చాడు.
Also Read: Ganja Seized: హైదరాబాద్ లో ఈ ఐస్ క్రీమ్ తిన్నారా? అసలు విషయం తెలిస్తే షాక్ కావాల్సిందే!
డబ్బు తీసుకున్న హరిపుత్ర యాసిడ్ అటాక్ చేశాడు. నిందితులిద్దరిపై బీఎన్ఎస్ 109, పలు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసినట్టు డీసీపీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ తెలిపారు. ఇద్దరి నుంచి మొబైల్ ఫోన్లను సీజ్ చేసి వాట్సాప్ చాటింగులను రిట్రైవ్ చేసినట్టు చెప్పారు. చాకచక్యంగా దర్యాప్తు జరిపి గంటల్లోనే నిందితులను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ సీఐ రాఘవేంద ర్ తోపాటు ప్రత్యేక బృందాల్లోని సిబ్బందిని అభినందించారు.