Parking Dispute: పంజాబ్ లో దారుణం చోటుచేసుకుంది. పార్కింగ్ అంశంలో చెలరేగిన వివాదం ఓ సైంటిస్టును బలితీసుకుంది. మెుహాలిలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మృతుడు 39 ఏళ్ల డా.స్వర్ణాకర్ ఇటీవలే స్విట్జర్లాండ్ నుంచి మెుహాలికి వచ్చారు. అతడికి కొద్ది రోజుల క్రితమే కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కూడా జరిగింది. స్వర్ణాకర్ హత్యకు కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలన కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే
డా. అభిషేక్ స్వర్ణాకర్ (Dr Abhishek Swarnkar).. మెుహాలిలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (Institute of Science Education and Research) లో సైంటిస్టుగా వర్క్ చేస్తున్నారు. ఇటీవలే అతడు స్విట్జర్లాండ్ నుంచి భారత్ వచ్చి IISER లో చేరారు. సెక్టార్ 67 ప్రాంతంలోని ఓ అద్దె ఇంటిలో తల్లిదండ్రులతో కలిసి స్వర్ణాకర్ జీవిస్తున్నారు. ఇంటి బయట స్వర్ణాకర్ బైక్ ను పార్క్ చేయగా.. దాని వద్ద నిందితుడు మోంటీతో పాటు మరికొందరు నిలబడి ఉన్నారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన స్వర్ణాకర్.. బైక్ ను తీసేందుకు యత్నించారు. ఈ క్రమంలో మోంటీ – స్వర్ణాకర్ మధ్య స్వల్ప వివాదం తలెత్తింది. అది మరింత ముదరడంతో మోంటీ ఒక్కసారిగా స్వర్ణాకర్ పై దాడి చేశాడు. ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. ఈ క్రమంలో ఇరు కుటుంబాలు జోక్యం చేసుకొని మోంటీని వెనక్కి లాగాయి. అయితే అప్పటికే సైంటిస్టు స్వర్ణాకర్ నేలపై కుప్పకూలిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి.
పోలీసులు ఏమన్నారంటే
స్వర్ణాకర్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు మోంటీపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అతడిపై మరిన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. స్వర్ణాకర్ హత్య ఘటన.. ప్రస్తుతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అయితే గతంలోనే బైక్ పార్కింగ్ విషయంలో మోంటీతో స్వర్ణాకర్ గొడవ పడినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసుల దర్యాప్తులో మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
Also Read: Muhammad Riaz: ఎంత కష్టమొచ్చిందో.. జిలేబి అమ్ముకుంటున్న ఫేమస్ ప్లేయర్.. అతనెవరంటే?
కిడ్నీ మార్పిడి ఆపరేషన్
IISER సైంటిస్టు అయిన డా. స్వర్ణాకర్ గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధి సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో స్విట్జర్లాండ్ లో మంచి ఉద్యోగాన్ని సైతం వదులుకొని అతడు భారత్ కు వచ్చేశారు. ఈ క్రమంలోనే IISER లో జాయిన్ అయ్యారు. ఇటీవలే స్వర్ణాకర్ కు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. సొంత సోదరి అతడికి కిడ్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం అతడు ఒక కిడ్నీతో జీవిస్తున్నారు. ఈ క్రమంలో మోంటీ అతడిపై దాడి చేయడం, అప్పటికే ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు ఉండటంతో స్వర్ణాకర్ ప్రాణాలు కోల్పోయాడు. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో చాలా ప్రాంతాల్లో పార్కింగ్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇరుగు పొరుగు వారు పార్కింగ్ విషయంలో గొడవ పడి పరస్పరం దాడి చేసుకుంటున్న ఘటనలు దేశంలో కనిపిస్తున్నాయి.