Cyber Fraud Cafe Trapping: థాయిలాండ్ లో ఉద్యోగాలంటే గొప్పగా మురిసిపోయారు. లక్షల్లో సంపాదన అనగానే ఎగిరి గంతేశారు. తీరా అక్కడికి వెళ్లాక 540 మంది భారతీయులకు ఊహించని షాక్ తగిలింది. దుండగులు వారిని సైబర్ ఫ్రాడ్ కేఫ్ లో బందీలుగా మార్చేశారు. వారిచేత వెట్టిచాకిరీ చేయించారు. రంగంలోకి దిగిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వారిని తిరిగి రప్పించేందుకు ఏర్పాటు ప్రారంభించింది. ఈ మేరకు సోమవారం కొందరిని దేశానికి రప్పించడంతో ఈ దారుణం వెలుగు చూసింది.
అసలేం జరిగిందంటే
థాయిలాండ్ కేంద్రంగా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన స్థానిక ఏజెంట్లు బాధితులకు ఆశచూపారు. ఉద్యోగాలు కూడా ఖరారయ్యాయని నమ్మబలికి విమానం ఎక్కించారు. థాయిలాండ్ తోపాటు దాని సరిహద్దు దేశాలైన కంబోడియా, లావోస్, మయన్మార్ లో వారిని ల్యాండ్ చేశారు. అయితే తమను సైబర్ ఫ్రాడ్ కేఫ్ కు ఏజెంట్లు అమ్మేశారని తెలుసుకొని 540 మంది భారతీయులు ఖంగు తిన్నారు. దుండగులు వీరిచేత బలవంతంగా ఆన్ లైన్ నేరాలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. సైబర్ నేరాలు చేయకపోతే బలవంతంగా కరెంటు షాకులు ఇచ్చి హింసించినట్లు సమాచారం.
కరీంనగర్ వాసి ద్వారా..
కరీంనగర్ కు చెందిన ఓ వ్యక్తి ద్వారా ఈ థాయిలాండ్ లో జరుగుతున్న దురాగతం వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలం రంగపేట గ్రామానికి చెందిన మధుకర్ రెడ్డి అనే యువకుడు ఏజెంట్ల ఉచ్చులో చిక్కుకొని థాయిలాండ్ కు వెళ్లారు. థాయిలాండ్ లో బందీగా మారాడంటూ మీడియాలో వార్తలు రావడంతో కేంద్ర హోంశాక మంత్రి బండి సంజయ్ దీనిపై స్పందించారు. భారత విదేశాంగ శాఖకు లేఖ రాశారు. దీంతో కేంద్రం మయన్మార్, థాయిలాండ్ దౌత్య కార్యాలయాలను అప్రమత్తం చేయడంతో సైబర్ ఫ్రాడ్ కేఫ్ లలో పెద్ద ఎత్తున భారతీయులు బందీలుగా ఉన్న విషయం వెలుగు చూసింది.
Also Read: Trump Trade War: స్టాక్ మార్కెట్ల కొంప ముంచిన ట్రంప్.. కనివిని ఎరుగని నష్టం
ప్రత్యేక విమానాల్లో తరలింపు
ఆయా దేశాల పోలీసుల సాయంతో సైబర్ ఫ్రాడ్ కేఫ్ లపై దాడి చేయించిన భారత దౌత్య కార్యాలయం అక్కడ పనిచేస్తున్న 540 మంది భారతీయులకు విముక్తి కలిగించింది. వారందరినీ థాయిలాండ్ లోని మై సోట్ పట్టణానికి తరలించింది. అక్కడి నుంచి భారత వైమానిక దళానికి చెందిన విమానంలో వారిని భారత్ కు పంపేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలోనే 270 మందితో కూడిన తొలి విమానం సోమవారం ఢిల్లీకి వచ్చింది. ఇవాళ మిగిలిన 270 మందిని సురక్షితంగా భారత్ కు తీసుకురానున్నారు.