Aditya Om Bandi Success Meet: విలక్షణ నటుడు ఆదిత్య ఓం తాజాగా ‘బందీ’ అంటూ ఓ ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ‘బిగ్‌బాస్’ తెలుగు షోలో కంటెస్టెంట్‌గా పాల్గొని, అందరి అభిమానాన్ని చూరగొన్న ఆదిత్య ఓం నుంచి ఇటువంటి సినిమాను ఎవరూ ఊహించి ఉండరు. కానీ, తన నటనతో ఓ మంచి మెసేజ్‌ని సమాజానికి ఇచ్చారంటూ ఆయనపై సినిమా చూసిన వారంతా ప్రశంసలు కురిపిస్తుండటం విశేషం. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్న తీరు తమకు ఎంతో నచ్చిందని చెబుతూ యూనిట్ సక్సెస్‌మీట్‌ను నిర్వహించింది. గల్లీ సినిమా బ్యానర్‌పై రఘు తిరుమల ఈ సినిమాను రూపొందించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సక్సెస్ మీట్‌కు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Also Read- Robinhood: స్పెషల్ సాంగ్‌లో కేతికా.. గ్లామర్ బ్యూటీకి కలిసొచ్చేనా?
ఈ కార్యక్రమంలో ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. నటుడు ఆదిత్య ఓం అందరికీ తెలిసిన నటుడు. ఆయన నటించిన ‘బందీ’ సినిమా అద్భుతంగా ఉంది. పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో వచ్చిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటోంది. అందుకే ఈ సినిమా ఆడుతున్న అన్నిచోట్ల హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. ఆదిత్య ఓం ఎంతటి విలక్షణ నటుడో ఆయన నటించిన ‘లాహిరి లాహిరి లాహిరిలో’నే తెలిసింది. యూపీ నుంచి వచ్చి ఎంతో ప్యాషన్‌తో ఆయన పని చేస్తున్నారు. ‘బందీ’ విజువల్స్, కెమెరా వర్క్ అన్నీ కూడా చాలా కొత్తగా, వైవిధ్యంగా ఉన్నాయి. దర్శకుడు రఘు తిరుమల మంచి పాయింట్‌తో రూపొందించారు. ఇలాంటి సినిమాలను అందరూ చూసి ఆదరించాలి. కమర్షియల్‌గా కూడా ‘బందీ’ సినిమా సక్సెస్ సాధించడం ఆనందంగా ఉందని తెలిపారు.

దర్శకుడు రఘు తిరుమల మాట్లాడుతూ.. ఈ సినిమా విషయంలో క్రెడిట్ మొత్తం ఆదిత్య ఓం కే చెందుతుంది. ఆయన అందరినీ ఎంతగానో ఎంకరేజ్ చేశారు. ఆయన సహకారంతోనే ఈ సినిమాను ఇంత బాగా తీయగలిగాం. ఈ సినిమా చూసిన వారంతా మ్యూజిక్, విజువల్స్ గురించి ప్రశంసిస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ చిత్రాన్ని ఇంతలా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు ధన్యవాదాలని తెలిపారు. ఆదిత్య ఓం మాట్లాడుతూ.. ‘బందీ’ సినిమా చూసిన వారందరికీ ఎంతగానో నచ్చినందుకు సంతోషంగా ఉంది. మీడియా ఇంకాస్త సపోర్ట్ అందిస్తే ఈ సినిమా మరింత మందికి చేరుతుంది. ప్రస్తుతం పర్యావరణ అసమతుల్యత వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయనే కాన్సెప్ట్‌తో, మంచి సందేశాత్మక చిత్రంగా వచ్చిన బందీని ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ థాంక్స్. ఈ సినిమాతో నిజంగానే నన్ను ‘బందీ’ని చేశారు. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే మరిన్ని మంచి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తాను. మంచి సినిమాను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపించినందుకు అందరికీ థ్యాంక్స్ అని పేర్కొన్నారు.