Wife harassment: భార్య వేధింపులు తాళలేక మగవారు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. తాజాగా ముంబయికి చెందిన ఓ వ్యక్తి భార్య టార్చర్ తట్టుకోలేక తన బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన సూసైడ్ నోట్ ను ఏకంగా కంపెనీ వెబ్ సైట్ లో పోస్టు చేశాడు. తన చావులో భార్యతో పాటు అత్త ప్రమేయం కూడా ఉందని రాసుకొచ్చాడు.
హోటల్ గదిలో సూసైడ్
ముంబయికి చెందిన నిశాంత్ త్రిపాఠి (Nishant Tripathi).. ఫిబ్రవరి 28న నగరంలోని ఓ హోటల్ లో దిగాడు. గది బయట ‘డూ నాట్ డిస్టర్బ్’ అనే బోర్డు పెట్టాడు. దీంతో సిబ్బంది అటుగా వెళ్లలేదు. అయితే హోటల్లో దిగి 3 రోజులు దాటినా నిశాంత్ బయటకు రాకపోవడంతో మార్చి 2న హోటల్ స్టాఫ్ మాస్టర్ కీతో గదిని ఓపెన్ చేశారు. గదిలో నిశాంత్ విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి ఖంగు తిన్నారు. వెంటనే పోలీసు సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అయితే చనిపోవడానికి ముందు నిశాంత్ తన సూసైడ్ నోట్ ను కంపెనీ వెబ్ సైట్ లో షేర్ చేశాడు.
లేఖలో ఏముందంటే
ఆత్మహత్య లేఖలో భార్య అపూర్వ పారిఖ్ పై ప్రేమ చూపిస్తూనే తన చావుకు ఆమెనే కారణమని నిశాంత్ స్పష్టం చేశాడు. తన అత్త ప్రార్థన మిశ్రాకు సైతం ఇందులో ప్రమేయమున్నట్లు చెప్పుకొచ్చాడు. ‘నువ్వు ఈ లేఖ చదివే టైంకి నేనుండను. మనిద్దరి మధ్య జరిగిన వాటికి నేను నిన్ను ద్వేషించాలి. కానీ నేను ఇప్పటికీ ప్రేమిస్తున్నా. అది ఎప్పటికీ పోదు. మీ ఇద్దరి వల్ల నేను పడిన వేదనంతా నా తల్లికి తెలుసు. మీరు ఆమెను కలవొద్దు. ఇది నా కోరిక. ఇప్పటికే ఆమె చాలా బాధ పడింది. నా తల్లిని ప్రశాంతంగా అయినా బాధ పడనివ్వండి’ అని నిశాంత్ లేఖలో వాపోయారు.
Also Read: Amit Shah: ముదిరిన హిందీ వివాదం.. సీఎంపై విరుచుకుపడ్డ అమిత్ షా
తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు
నిశాంత్ తల్లి నీలం చతుర్వేది.. ఒక మహిళా హక్కుల కార్యకర్త. తన కుమారుడి మరణంపై తీవ్ర ఆవేదనకు గురైన ఆమె.. తాజాగా సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. దీంతో ఈ విషయం వెలుగు చూసింది. తన జీవితం శూన్యమై పోయిందని, తానొక జీవచ్ఛవంలా మారిపోయాయని నీలం చతుర్వేది ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ కష్టాల్లో ఉన్న 46,000 మందిని కలిశానన్న ఆమె అందులో దాదాపు 37,000 మందికి న్యాయం చేసినట్లు చెప్పారు. అయితే తన కుమారుడి విషయంలో మాత్రం తనకు అన్యాయం జరిగిందని వాపోయారు. కాగా నిశాంత్ తల్లి ఫిర్యాదు మేరకు.. అతడి భార్య అపూర్వ, అత్త ప్రార్థన మిశ్రాపై పోలీసులు కేసు నమోదు చేశారు.