Daughter Murder: ఆకాశమంత ప్రేమను పంచాల్సిన ఓ తండ్రి కసాయిలా మారాడు. 5 ఏళ్ల కూతురి పట్ల రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. గోరు ముద్దలు తినిపించాల్సిన చేతులతోనే ముక్కముక్కలుగా నరికి కాటికి పంపాడు. కూతురు కనిపించడం లేదంటూ కన్నతల్లి కేసు పెట్టడంతో విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరినీ కలవరపాటుకు గురి చేస్తోంది.
వివరాల్లోకి వెళ్లే..
ఉత్తర్ ప్రదేశ్ సీతాపూర్ కి చెందిన మోహిత్ కు తని (5) అనే పాప ఉంది. ఫిబ్రవరి 25 నుంచి పాప కనిపించకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి పాప ఆచూకి కోసం వెతికాయి. ఈ క్రమంలో బాలిక మృతదేహాం లభించగా ఆ మర్నాడే ఇతర శరీర భాగాలను పోలీసులు కనుగొన్నారు. దీంతో బాలికది హత్యగా తేల్చిన పోలీసులు.. సొంత బంధువులే ఇది చేసి ఉంటారని అనుమానించారు. కుటుంబ సభ్యులు అందర్నీ ప్రశ్నించగా.. పాప కనిపించకుండా పోయిన రోజు నుంచే బాలిక తండ్రి మోహిత్ కూడా అదృశ్యం అయ్యాడని పోలీసులకు తెలిసింది. దీంతో అతడ్ని గాలించి పట్టుకున్న పోలీసులకు సంచలన నిజాలు తెలిశాయి.
Also Read: Pune Court: ‘ముఖాన బొట్టు లేదు.. మెడలో తాళిలేదు’.. వివాహితపై జడ్జి ఆగ్రహం
మాట వినట్లేదని హత్య
బాలిక తండ్రి మోహిత్ ను కస్టడీలోకి తీసుకున్న సీతాపూర్ పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో పాపను తానే హత్య చేసినట్లు మోహిత్ ఒప్పుకున్నాడు. అందుగల కారణాలను పోలీసులకు వివరించాడు. మోహిత్ కు పొరుగింటిలో ఉండే రాము ఫ్యామిలీతో ఓ విషయమై వివాదం తలెత్తింది. నిత్యం రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతూనే ఉండేవి. అయితే ఇవేమి పెద్దగా అవగాహన లేని మోహిత్ కుమార్తె తరుచూ రాము ఇంటికి వెళ్తుండేది. ఎంత చెప్పినా వినకపోవడంతో మోహిత్ కు కూతురిపై కోపం కట్టలు తెంచుకుంది. తొలుత బాలికను గొంతు నులిమి హత్య చేశాడు. ఆపై ఆనవాళ్లు తెలియకుండా నాలుగు ముక్కలుగా నరికినట్లు మోహిత్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు.