Tamilisai Arrest: విద్యా వ్యవస్థలో కేంద్రం సూచించిన త్రిభాషా విధానంపై తమిళనాడులోని అధికార డీఎంకే ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా ఆ డీఎంకే నేతలు రాష్ట్రవ్యాప్తంగా హిందీ వ్యతిరేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. హిందీని తమపై బలవంతంగా రుద్దడాన్ని ఏమాత్రం సంహించబోమని ప్రతిజ్ఞలు చేస్తున్నారు. అటు డీఎంకే నిరసనలకు దీటుగా రాష్ట్ర భాజపా సైతం సంతకాల సేకరణ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా తెలంగాణ మాజీ గరర్నర్ తమిళిసై ఈ కార్యక్రమంలో పాల్గొనగా తాజాగా ఆమెను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు.
అనుమతి లేకపోవడంతో అరెస్టు
త్రిభాషా విధానానికి మద్దతుగా బీజేపీ నేతలు చెన్నైలోని ఎంజీఆర్ నగర్ లో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై హాజరయ్యారు. ఆమెతో పాటు పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు పాల్గొన్నాయి. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్నట్లు సమాచారం. దీంతో అనుమతి లేని కార్యక్రమంలో పాల్గొన్నందుకు తమిళిసైతో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
Also Read: Udhayanidhi Stalin: సనాతన ధర్మంపై విమర్శలు.. ఉదయనిధిపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
అన్నామళై ఫైర్
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసైను పోలీసులు అరెస్టు చేసినట్లు భాజపా తమిళనాడు అధ్యక్షుడు కె. అన్నామలై స్వయంగా వెల్లడించారు. ఆమె అరెస్టు ఖండిస్తూ అధికార డీఎంకే ప్రభుత్వంపై ఎక్స్ (Twitter)వేదికగా మండిపడ్డారు. ‘సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న తెలంగాణ -పుదుచ్చేరి మాజీ గవర్నర్ తమిళిసైను పోలీసులు అరెస్టు చేశారు. తమిళ భాష పేరుతో డీఎంకే ప్రభుత్వం డ్రామాలు ఆడుతోంది. ఆ నాటకాలను ప్రజలు గ్రహించడం మెుదలుపెట్టారు. దీంతో సీఎం ఎంకే స్టాలిన్ వణికిపోతున్నారు. ప్రజాస్వామ్యబద్దంగా చేస్తున్న సంతకాల సేకరణ కార్యక్రామాలను అడ్డుకొని అరెస్టులు చేయిస్తున్నారు’ అని రాసుకొచ్చారు.