Yogi Adityanath: ప్రపంచంలోనే అతిపెద్ద అధ్యాత్మిక వేడుక కుంభమేళాకు ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ వేదికగా మారిన సంగతి తెలిసిందే. 45 రోజుల పాటు జరిగిన ఈ అధ్యాత్మిక పండుగకు 66 కోట్లమందికి పైగా భక్తులు తరలివచ్చారు. అయితే తొక్కిసలాట ఘటనలు, భారీగా ట్రాఫిక్ జామ్, అగ్నిప్రమాదాలు వంటివి చోటుచేసుకోవడంతో యూపీ ప్రభుత్వంపై విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. కుంభమేళాను నిర్వహించడంలో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ విఫలమైందంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. తాజాగా జరుగుతున్న యూపీ బడ్జెట్ సమావేశాల్లోనూ కుంభమేళా అంశం చర్చకు రాగా కనీసం పడవలు నడిపే వారికి కూడా పెద్దగా ఒరిగిందేమి లేదంటూ విపక్ష సమాజ్ వాదీ పార్టీ మండిపడింది. దీంతో సీఎం యోగి అసెంబ్లీ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సీఎం యోగి ఏమన్నారంటే
మహాకుంభమేళా నిర్వహణపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న వేళ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో దీటుగా బదులిచ్చారు. పడవలు నడుపుకునేవారు దోపిడీకి గురయ్యారన్న విపక్ష సమాజ్ వాదీ పార్టీ విమర్శలకు చెక్ పెట్టేలా అసెంబ్లీలో ఓ విజయగాథను పంచుకున్నారు. ‘పడవలు నడిపే ఓ వ్యక్తి సక్సెస్ ను మీతో పంచుకోవాలి. అతడి కుటుంబానికి 130 పడవలు ఉన్నాయి. కుంభమేళా జరిగిన 45 రోజుల్లో రోజుకు రూ.50వేల నుంచి రూ.52వేల వరకు సంపాదించారు. అంటే 45 రోజులకు ఒక్కో పడవతో దాదాపు రూ.23లక్షల చొప్పున ఆదాయం లభించింది. మొత్తంగా 130 పడవలతో రూ.30కోట్లు ఆర్జించారు’ అని యోగి వివరించారు.
Also Read: Reliance ONGC Dispute: అంబానీకి మోదీ సర్కార్ బిగ్ షాక్.. రూ.24,500 కోట్లకు నోటీసులు
రూ.3 లక్షల కోట్ల ఆదాయం
దేశ, విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివచ్చినా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని సీఎం యోగి అసెంబ్లీలో తెలియజేశారు. 45 రోజుల్లో ఒక్క నేరం కూడా చోటు చేసుకోలేదని స్పష్టం చేశారు. కుంభమేళా భక్తుల సౌఖర్యాలు, సదుపాయాల కోసం ప్రభుత్వం రూ.7,500 కోట్లు ఖర్చు చేసిందని యోగి తెలిపారు. తద్వారా కుంభమేళాలో దాదాపు రూ.3 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని పేర్కొన్నారు. హోటల్ రంగానికి రూ.40వేల కోట్లు, నిత్యవసరాల బిజినెస్ రూ.33 వేల కోట్లు, రవాణా వ్యవస్థకు రూ. 1.5 లక్షల కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. దేశ ఆర్థిక వృద్ధికి సైతం కుంభమేళా ఎంతగానో దోహదం చేసిందని యోగి అన్నారు.