Ram Mandir: ఎన్నో వివాదాలు, మరెన్నో న్యాయ పోరాటాల తర్వాత ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో రామ మందిరం కొలువుదీరిన సంగతి తెలిసిందే. నిత్యం వేలాది మంది భక్తులు బాల రాముడ్ని దర్శించుకొని పరవశించిపోతున్నారు. అటువంటి రామమందిరంపై ఉగ్రవాదుల కన్ను పడినట్లు తెలుస్తోంది. ఆలయంపై దాడి చేసి దేశంలో మరోమాలు అలజడి సృష్టించాలని ఉగ్రమూకలు ప్లాన్ చేసినట్లు సమాచారం. గుజరాత్ కు చెందిన పోలీసులు.. ఓ టెర్రరిస్టును అరెస్టు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది.
గ్రెనెడ్లతో దాడికి ప్లాన్
గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS).. హర్యానా ఫరీదాబాద్‌లోని పాలి ఏరియాలో ఒక టెర్రరిస్టును అరెస్టు చేసింది. ఐఎస్ఐ ఉగ్రసంస్థకు చెందిన 19 ఏళ్ల అబ్దుల్ రెహ్మాన్ గా అతడ్ని బలగాలు గుర్తించాయి. అతడి నుంచి రెండు గ్రెనేడ్‌లు, విప్లవ సాహిత్యం ఉన్న పుస్తకాన్ని స్వాధీనం చేసుకున్నాయి. కేంద్ర ఏజెన్సీలు, ఫరీదాబాద్ ఎస్‌టీఎఫ్ సహకారంతో గుజరాత్ ఏటీఎస్ అధికారులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. రామమందిరంపై దాడి చేయడం అతడి టార్గెట్ గా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఉగ్రవాది నుంచి స్వాధీనం చేసుకున్న రెండు గ్రెనేడ్లను బాంబు స్క్వాడ్ సిబ్బంది వెంటనే నిర్వీర్యం చేసినట్లు సమాచారం.
Also Read: Ranveer Allahbadia: వివాదాస్పద యూట్యూబర్ కేసు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
కొనసాగుతున్న ఆపరేషన్
గుజరాత్ ఏటీఎస్ చేపట్టిన ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్టు అధికారులు చెప్పారు. ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ వెనక మరికొందరు ఉండే ఛాన్స్ ఉందని అనుమానిస్తున్నారు. అతడి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయి. రామమందిరంతో పాటు మరెక్కడైనా దాడికి ప్లాన్ చేశారా? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.