MK Stalin: లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనపై గత కొన్నిరోజులుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. జనాభా ఆధారంగా కొత్త లోక్ సభ స్థానాలకు ప్రాధాన్యత ఇస్తే తమకు తీవ్ర నష్టం తప్పదని దక్షిణాది రాష్ట్రాల సీఎంలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సైతం బహిరంగంగానే కేంద్రం ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో అడుగు ముందుకు వేసిన స్టాలిన్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్రంలో కొత్తగా పెళ్లయిన జంటలకు కీలక సూచనలు చేశారు.
‘త్వరగా పిల్లల్ని కనండి’
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్.. తాజాగా నాగపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ లోక్ సభ నియోజకవర్గ పునర్విభజన అంశంపై ఆయన మాట్లాడారు. గతంలో తాము కుటుంబ నియంత్రణకు విశేష కృషి చేసినట్లు స్టాలిన్ అన్నారు. ప్రస్తుతం జనాభా పెంచుకోక తప్పని పరిస్థితుల్లోకి తోసివేయబడినట్లు పేర్కొన్నారు. కాబట్టి కొత్త పెళ్లయిన దంపతులు.. త్వరగా పిల్లలను కనాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. తద్వారా పునర్విభజనతో జరిగే నష్టాన్ని నివారించాలని ప్రజలను కోరారు.
VIDEO | Tamil Nadu Chief Minister MK Stalin said he has changed his views on family planning and would not advise newly married to now wait before having children.
"Earlier, I used to ask the newly weds to take time before expanding their family. Now with the delimitation that… pic.twitter.com/0ewDETXAs6
— Press Trust of India (@PTI_News) March 3, 2025
5న అఖిలపక్ష సమావేశం
కేంద్రంలోని భాజపా ప్రభుత్వం చేపట్టనున్న పునర్విభజన అంశంపై చర్చించేందుకు తమిళనాడు సీఎం స్టాలిన్.. అఖిల పక్ష భేటికి పిలుపునిచ్చారు. మార్చి 5న జరిగే ఈ సమావేశంలో పాల్గొనాలని తమిళనాడులోని 40 కి పైగా పార్టీలకు ఆయన ఆహ్వానం పంపారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఈ సమావేశంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. పునర్విభజన అంశంపై వ్యూహాత్మకంగా అనుసరించాల్సిన విధి విధానాలపై స్టాలిన్ ఈ భేటిలో చర్చించనున్నారు. వివిధ పార్టీల ప్రతినిధుల నుంచి సలహాలు, సూచనలు తీసుకొని భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు.
Also Read: Summer Foods: వేసవిలో ఈ కూరగాయాలు తినట్లేదా? అయితే డేంజర్ లో పడ్డట్లే!
అదే జరిగితే తీవ్ర నష్టం
లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన పనులను 2026లో కేంద్ర ప్రభుత్వం చేపట్టనుంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా లోక్ సభ స్థానాలను విభజించే యోచనలో కేంద్రం ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాలు భారీగా లోక్ సభ స్థానాలను కోల్పోయే ఛాన్స్ ఉంది. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా చాలా తక్కువ. కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాలు జనాభాను గణనీయంగా తగ్గించుకున్నాయి. దీంతో బీజేపీ బలంగా లేని దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి.