Summer Foods: వేసవి కాలం మెుదలైంది. రానున్న రోజుల్లో భానుడి భగ భగలు, వడ గాల్పులు మరింత తీవ్ర తరం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆహారం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. సరైన ఆహారం తీసుకోకుంటే వాంతులు, మలబద్దకం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యల బారిన పడక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ వేసవిలో ఏ కూరగాయాలు తీసుకుంటే మంచిది? వాటితో మన శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
పొట్లకాయ
సమ్మర్ లో పొట్లకాయ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో క్యాల్షియం పుష్కలంగా లభిస్తుందని అంటున్నారు. పొట్లకాయ.. ఎముకలను బలోపేతం చేయడంతోపాటు కొలెస్ట్రాల్ స్థాయులను నియంత్రిస్తుందని చెబుతున్నారు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఔషధంగా పనిచేస్తుందని స్పష్టం చేస్తున్నారు.
కాకరకాయ
కాకరకాయ తింటే చాలా వేడి అని చాలా మందిలో ఓ అభిప్రాయం ఉంది. అందుకే సమ్మర్ లో దానిని చాలా మంది దూరం పెడుతుంటారు. అయితే అలా చేయడం కరెక్ట్ కాదని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కాకరకాయలో ఉండే విటమిన్ సి, ఐరన్, కాల్షియం, పొటాషియం.. సమ్మర్ లో శరీరానికి ఎంతో అవసరమని చెబుతున్నారు. అవి జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు పొట్టను చల్లగా ఉంచేందుకు దోహదం చేస్తాయని పేర్కొంటున్నారు.
Also Read: PM Modi: వేటగాడి దుస్తుల్లో ప్రధాని.. సింహాలకు అతి దగ్గరగా సఫారీ
టమాటా
టమాట లేని వంటను ఊహించడం కష్టం. అన్ని కాలాల తరహాలోనే వేసవిలోనూ టమాటా శరీరానికి ఎంతో ఆరోగ్యకరం. వేసవిలో క్రమం తప్పకుండా టమాటాలు తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. బాడీలో నీటి కొరతను నివారిస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా చేయడంలోనూ టమాటా ముఖ్య భూమిక పోషిస్తుంది.
బీన్స్
సమ్మర్ లో బీన్స్ తింటే ఎంతో మేలు అని నిపుణులు సూచిస్తున్నారు. బీన్స్ లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయని గుర్తు చేస్తున్నారు. వాటితో పాటు ప్రోటీన్, ఐరన్, జింక్, విటమిన్ కె.. సమృద్ధిగా ఉంటాయని చెబుతున్నారు. వేసవిలో శరీరానికి అవి ఎంతో ప్రయోజనాన్ని కలగచేస్తాయని పేర్కొంటున్నాయి. అలసట లేకుండా రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు బీన్స్ ఉపయోగపడతాయి.
ముల్లంగి
వేసవి ఆహారంలో ముల్లంగిని చేర్చుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. దానిలో ఉండే ఫైబర్.. జీర్ణక్రియను మెరుగు పరుస్తుందని అంటున్నారు. అలాగే ముల్లంగిలో ఉండే నీటిశాతం.. శరీరం డీహైడ్రేట్ కాకుండా నివారిస్తుందని చెబుతున్నారు. 100 గ్రాముల ముల్లంగిలో 93.5 గ్రాముల నీరు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.