Illegal immigration: అమెరికాలోకి అక్రమ వలస దారులపై అధ్యక్షుడు ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. అనధికారంగా యూఎస్ లో జీవిస్తున్న విదేశీయులను గుర్తించి వారిని ప్రత్యేక సైనిక విమానాల్లో స్వదేశాలకు సైతం ట్రంప్ తరలిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అక్రమ వలసలపై మాట్లాడిన అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను అధికారం చేపట్టిన తర్వాత అమెరికా – మెక్సికో సరిహద్దుల్లో అక్రమ వలసలు రికార్డు స్థాయిలో తగ్గాయని ట్రంప్ వెల్లడించారు. అక్రమ వలసలపై తాను చేస్తున్న పోరాటం ఇంతటితో ముగిసినట్లు స్పష్టం చేశారు.
95% మేర తగ్గిన అక్రమ వలసలు
గత నెల ఫిబ్రవరిలో 8,326 మంది అక్రమ వలసదారులు మాత్రమే దేశ సరిహద్దుల్లో పట్టుబడినట్లు అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. గత అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో ఈ సంఖ్య ప్రతీ నెలా 3 లక్షలుగా ఉండేదని పేర్కొన్నారు. సీబీపీ విడుదల చేసిన నివేదిక ప్రకారం అమెరికాలోకి వచ్చే అక్రమవలసదారుల సంఖ్య 95 శాతం మేర తగ్గినట్లు ట్రంప్ స్పష్టం చేశారు. ఎవరైనా అక్రమంగా దేశంలోకి ప్రవేశించడానికి చూస్తే కఠిన చర్యలు ఎదుర్కొక తప్పదని మరోమారు హెచ్చరించారు.
Read Also: Tiger Dog Fight: హ్యాట్సాఫ్.. యజమాని ప్రాణం కోసం పులిని బెంబేలెత్తించిన శునకం
ట్రంప్ ప్రకటనల్లో వాస్తవం లేదా?
యూఎస్ లోకి అక్రమ వలసదారుల రాక 95 శాతం మేర తగ్గిందన్న అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలని ఆ దేశంలోని కొన్ని మీడియా సంస్థలు తప్పుబడుతున్నాయి. అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ విడుదల చేసిన డేటా ప్రకారం.. బైడెన్ పవర్ లో ఉన్న ఆఖరి వారంలో దాదాపు 20,086 మంది అక్రమ వలసదారులను గుర్తించారు. అలాగే గత నెలలో 8,326 మందిని గుర్తించామని ట్రంప్ చెబుతున్న లెక్కల్లోనూ వాస్తవం లేదని అక్కడి మీడియా.. వార్త కథనాలు ప్రచురించింది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన ఫస్ట్ వీక్ లో 7,287 మంది మాత్రమే పట్టుబడ్డారని పేర్కొంది.
అక్రమ వలసలపై ఉక్కుపాదం
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన ట్రంప్.. కుర్చీలో కూర్చున్న తొలి రోజు నుంచే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడం ప్రారభించారు. కఠిన నిర్ణయాలు, ఆంక్షలతో వారిని దేశం నుంచి సాగనంపే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో అమెరికాకు వలస వెళ్లిన భారతీయులు సైతం పెద్ద సంఖ్యలో భారత్ కు తిరిగి వచ్చేశారు. అటు ట్రంప్ చేపట్టిన ఈ చర్యలను భారత ప్రభుత్వం సైతం తప్పుపట్టకపోవడం గమనార్హం. అక్రమ వలసలకు తాము కూడా వ్యతిరేకమని కేంద్రం పలుమార్లు స్పష్టం చేస్తూ వచ్చింది.