SA vs ENG:చాంపియన్స్ ట్రోఫీలో ఆఖరి లీగ్ మ్యాచ్ లోనూ ఇంగ్లండ్ రాత మారలేదు. బౌలింగ్ లో నిప్పులు చెరిగే బంతులతో సఫారీ బౌలర్లు ఒకవైపు విరుచుకుపడుతుండగా.. చిరుతను తలదన్నేలా అద్భుత ఫీల్డింగ్ తో దక్షిణాఫ్రికా(South Africa) జట్టు కేక పుట్టించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బట్లర్ బృందానికి సఫారీ జట్టు చుక్కలు చూపించింది. 38.2 ఓవర్లలోనే ఇంగ్లండ్ బ్యాటర్ల ఆట కట్టించిన సఫారీ టీమ్ 179 పరుగులకే ఇంగ్లండ్ నుఆలౌట్ చేశారు. సఫారీల పదునైన బంతులకు అసలు క్రీజులో నిలవడమే కష్టంగా మారిన పరిస్థితిలో ఇంగ్లండ్(England) బ్యాటర్లు చేతులెత్తేసారు. తొలుత ఓపెనర్లు ఫిల్ సాల్ట్(8), బెన్ డకెట్ లను సఫారీ ఓపెనింగ్ బౌలర్ మార్క్ యాన్సెన్ అద్భుతమైన డెలివరీలతో హడలెత్తించాడు. తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు కొట్టిన సాల్ట్ ..యాన్సెన్ బౌలింగ్ లో వాన్‌డర్ డస్సెన్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్ గా పెవిలియన్ చేరుకున్నాడు. వన్ డౌన్ లో వచ్చిన జెమీ స్మిత్ డకౌట్ గా వెనుదిరగడం ఇంగ్లండ్ కు మరింత షాకిచ్చింది. మార్క్ రమ్ కు క్యాచ్ ఇచ్చిన స్మిత్ ..యాన్సెన్ కే వికెట్ సమర్పించుకున్నాడు. ఇక ఈ సారి వంతు బెన్ డకెట్ (24) ది అయింది. యాన్సెన్ బౌలింగ్ లో అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు మరిన్ని కష్టాల్లో పడింది. కరాచీలో పేసర్ మార్కో యాన్సెన్ దెబ్బకు టాపార్డర్ కకావికలమైంది. తర్వాత మరో పేస్ బౌలర్ వియాన్ ముల్డర్ ప్రమాదకర బ్యాటర్ జో రూట్(44 బంతుల్లో 37)ను స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేయడంతో పాటు .. టెయిలెండర్లు జోఫ్రా ఆర్చర్(31 బంతుల్లో 25), ఆదిల్ రషీద్(2)లను పెవిలియన్‌కు పంపి మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు సఫారీ స్టార్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ప్రమాదకర హ్యారీ బ్రూక్(19), కెప్టెన్ జోస్ బట్లర్(21)లను ఔట్ చేసాడు. ఇంగ్లండ్ కీలక బ్యాటర్లను ఔట్ చేసి అదరగొట్టాడు. ఇక పేసర్ రబాడ జేమీ ఓవర్టన్(11) వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో మరో 11.4 ఓవర్లు మిగిలుండగానే 38.2 ఓవర్లలో 179 పరుగులు మాత్రమే చేసి ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా జట్టు ముందు 180 పరుగుల నామమాత్ర లక్ష్యాన్ని నిర్దేశించింది.
గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీ చేరుకున్న సంగతి తెలిసిందే. ఇక దాదాపు రెండో బెర్తును సౌతాఫ్రికా ఖాయం చేసుకున్నా.. టెక్నికల్‌గా ఆఫ్ఘానిస్తాన్ కు కాస్త అవకాశం కనిపించింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ చేసి 300 పరుగులు చేయడంతో పటు .. ప్రొటిస్‌ను కనీసం 207 పరుగుల తేడాతో ఓడిస్తే ఆఫ్ఘానిస్థాన్ జట్టు సెమీస్ చేరుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ఎలాగూ ఈ ప్రమాదం లేదు .ఇక ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా ఓడినా మెరుగైన రన్ రేట్ తో సెమీస్ చేరుతుంది. కానీ 180 పరుగుల లక్ష్యం ఉండడంతో దాదాపు సౌతాఫ్రికా ఈ మ్యాచ్ లో విజయం సాధించడం లాంఛనమే.
Read Also: అందుకే హార్దిక్ భయ్యా.. నువ్వు కెప్టెన్ కాలేదు..!