Kamalapuram: రాజకీయ ఘర్షణలతో నాడు కత్తులు దూసిన కొత్త కమలాపురం గ్రామం యువత చూపిన చొరవతో ఐక్యతను చాటి గ్రామపంచాయతీని ఏకగ్రీవం చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పీఆర్వో దూదిపాళ్ళ విజయ్ కుమార్ స్వగ్రామమైన కొత్త కమలాపురం లో జీపీ ఏకగ్రీవం కావడంతో వెల్లివిరిసిన ఆదర్శం తో గ్రామస్తులు సంబరాలు జరుపుకుంటున్నారు.. రాజకీయ కక్షలు భిన్నాభిప్రాయాలు కలిగిన నాయకులు ఉన్న ఈ గ్రామంలో గతంలో ప్రతి ఎన్నిక వివాదాస్పదంగానే ఉండేది.
రెండేళ్ల కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ గ్రామానికి చెందిన ఓ యువకుడు హైదరాబాదులో ఉంటూ ఓటు హక్కు వినియోగించుకోవడానికి స్వగ్రామం రాగా ఆ యువకుడు పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసేందుకు పోలీసు బందోబస్తు తో వెళ్లాల్సి వచ్చింది. ఈ పరిస్థితిలో ఉన్న కొత్త కమలాపురంలో ఈ రెండేళ్లలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. దీనికి ప్రధాన కారణం కమలాపురం గ్రామానికి చెందిన దూదిపాళ్ల విజయకుమార్ సీఎం రేవంత్ రెడ్డికి పీఆర్వో గా నియమితులు కావడం ఆయన సూచనలతో గ్రామంలోని యువత గ్రామాభివృద్ధికి బాటలు వేయాలని సంకల్పించడం ప్రధాన కారణం.
ఎన్ఆర్ఐ లు ఆదర్శంగా నిలిచారు
ఊరు ఊరంతా ఒక్కతాటి మీదికి రావడానికి సీఎం పిఆర్ఓ విజయ్ సూచనలతో గ్రామానికి చెందిన ఎన్నారై రేపాల సతీష్ నేతృత్వంలో ఓ యువ బృందం కీలకంగా వ్యవహరించారు. ఈ చిన్న గ్రామం నుంచి చదువుకున్న యువత విదేశాలకు వెళ్లేందుకు ఎక్కువమందికి చేయూతనిచ్చి, గ్రామంలో అనేక మందికి సహకరించిన రేపాల సతీష్ ఆలోచనలు, ఆశయాలు అన్నింటా ఆదర్శమే. ఈ యువనేత నాయకత్వంలోనే వుయ్ కేర్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసి ఈ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి ఆదర్శంగా నిలుస్తూ అదే బాటలో గ్రామాన్ని ఒక్క తాటి మీదికి తెచ్చి ఏకగ్రీవం చేయడంలో సఫలీకృతమయ్యారు.
Also Read: Kamalapuram Students Failed: ఏమైందిరా.. మెుత్తం ఇలా కట్టకట్టుకొని ఫెయిల్ అయ్యారు..!
ఎటువంటి కండిషన్స్ లేకుండా జీపీ ఏకగ్రీవం
గ్రామాల్లో ఏకగ్రీవాలు అనగానే గుడి, బడి, రోడ్డు తదితర నిర్మాణాల కోసం వేలం పాటలు పెట్టడం, లేదా గ్రామస్తుల కూర్చొని ఒప్పందం చేయడం ఇన్ని డబ్బులు ఇవ్వాలి అని కండిషన్ల పెడుతూ ఏకగ్రీవాలు కావడం ఎక్కువగా చూస్తున్నాం. కానీ కొత్త కమలాపురం గ్రామపంచాయతీలో మాత్రం ఎటువంటి కండిషన్స్ లేకుండా అందరి ఏకాభిప్రాయంతో ఏకగ్రీవంగా చేసుకున్నారు. దీంట్లో గ్రామంలోని యువత కీలక పాత్ర పోషించటం హర్షనీయం. ఆదర్శంగా నిలిచిన ఈ గ్రామం ఇక్కడ యువత అందరి మన్ననలు కూడా పొందుతోంది.
సర్పంచిగా వడ్డే సులోచన, ఉప సర్పంచ్ గా దూదిపాళ్ళ భాస్కరరావు
కొత్త కమలాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ గా వడ్డే సులోచన, ఉప సర్పంచిగా దూదిపాళ్ల భాస్కర్ రావును గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిపిలో 8 వార్డులు ఉండగా ఐదు వార్డులకు కూడా వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరో మూడు వార్డులు ఎస్టీలకు రిజర్వ్ చేయగా ఆ వార్డుల్లో ఎస్టీ అభ్యర్థులు లేకపోవడంతో అక్కడ గతంలో కూడా ఎన్నిక జరగలేదు, ఈసారి కూడా ఎన్నికలు లేవు.
దూదిపాళ్ళ భాస్కరరావు కు దక్కిన గౌరవం
నందమూరి తారక రామారావుకు వీరాభిమానిగా నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ లీడర్ గా నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న లీడర్ గా పేరున్న దూదిపాళ్ళ భాస్కరరావు ను కమలాపురం ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకొని గ్రామం గౌరవాన్ని కట్టబెట్టింది. నిబద్ధత గల నాయకునికి గౌరవం కల్పించడం పట్ల మండలంలోని రాజకీయ నాయకులంతా హర్షం వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ వార్డు సభ్యులు గా గుత్తా గంగయ్య, అన్నా ప్రగడ శాంతకుమారి, చాగంటి వాణిశ్రీ, బండి జ్యోతి లను గ్రామస్తులు ఏకాభిప్రాయంతో ఏకగ్రీవంగా ఎన్నుకుని ఆదర్శంగా నిలిచారు.
Also Read: Mulugu District: పోరుకన్నా.. ఊరుమిన్నా సత్ఫలితాలు.. ఎంత మంది మావోయిస్టుల లొంగుబాటు తెలుసా?

