కరీంనగర్ బ్యూరో, స్వేచ్ఛ: జగిత్యాల (Jagtial) జిల్లా గొల్లపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై శ్వేత (Woman SI Swetha) తోపాటు ద్విచక్ర వాహన దారుడు నరేష్ మృతి చెందారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం నుండి జగిత్యాల వైపు వెళుతుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. జగిత్యాలలో పలు పోలీస్స్టేషన్లలో ఎస్సైగా విధులు నిర్వహించిన ఎస్సై శ్వేత ప్రస్తుతం డీఆర్బీసీలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు.
మంగళవారం స్వగ్రామం అయిన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండ నుంచి శ్వేత తన కారుని స్వయంగా డ్రైవింగ్ చేస్తూ జగిత్యాల (Jagtial)కు వెళ్లుతున్నారు. గొల్లపల్లి మండలం చిల్వకోడూరు సమీపంలో ఎదురుగా వచ్చిన బైక్ ను శ్వేత నడుతున్న కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొని పొలాల్లోకి దూసుకుపోవడంతో ఆమె అక్కడిక్కడే మరణించింది. బైక్పై ప్రయాణిస్తున్న యువకుడు సైతం మృతి చెందాడు. మృతుడు జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టుకు చెందిన నరేష్ (26) గా గుర్తించారు. అతను మంచిర్యాల జిల్లా లక్షెట్పేట డీసీబీ బ్యాంకులో పని చేస్తున్నాడు. ఉదయం విధులకు ఇంటి నుంచి బైక్ పై వెళుతుండగా ప్రమాదానికి గురై అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.