Registration Scam: రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి రోజు రోజుకు పెరిగిపోతున్నది. చేయి తడిపితేనే సబ్ రిజిస్ట్రార్లు ముందుకెళ్తారనే పేరున్నది. లేకపోతే ఆ రోజు రిజిస్ట్రేషన్ నిలిచిపోయే పరిస్థితి ఉంటుంది. ఆ భయంతో విక్రయదారుకు చేతులు తడపక తప్పడం లేదని సమాచారం. ప్రతి డాక్యుమెంట్‌కు ఓ రేటు ఫిక్స్ చేసి రిజిస్ట్రేషన్లు చేయడం సబ్ రిజిస్ట్రార్లకు అలవాటైంది. భూ స్వరూపం, భూ వివాదాలతోపాటు నిబంధనలను పరిగణనలోకి తీసుకోకుండా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. లంచాలకు అలవాటుపడి వివాదాలను సైతం సృష్టిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే అవినీతి, అక్రమాలపై నిఘా లేకపోవడంతోనే ఇష్టానుసారంగానే వ్యవహరిస్తున్నారని తెలుస్తున్నది. ఏసీబీ దాడులు జరిగినా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పని చేసే అధికారులకు చీమ కుట్టినట్లుగా కూడా కనిపించడం లేదు. రంగారెడ్డి జిల్లాలోని 18 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇదే తంతే నడుస్తున్నది. అక్రమ రిజిస్ట్రేషన్లు చేయడంలో జిల్లా ముందుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాతోనే నెంబర్ వన్ ఆదాయం
రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ప్రధానమైనది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఒకటి. ఈ శాఖ ద్వారానే అత్యంత ఆదాయం సమకూరుతున్నది. రాష్ట్రంలో అత్యధిక ఆదాయం రంగారెడ్డి జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారానే వస్తున్నది. అయితే, ఆదాయాన్ని ఆసరాగా చేసుకోని సబ్ రిజిస్ట్రార్లు సైతం వ్యక్తిగత స్వార్ధం కోసం వివాదాలు సృష్టించే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ భూములను, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను సైతం గుడ్డిగా రిజిస్ట్రేషన్లు చేయడం దారుణం. హయత్‌నగర్, వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిషేదిత భూములకు, నిబంధనలు పాటించకుండా అనేక భూములకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.
Also Read: Fake Documents Scam: నకిలీ పత్రాలతో 47 లక్షలకు కుచ్చుటోపీ పెట్టిన మీ సేవ నిర్వాహకుడు
ఉదాహరణకు కొన్ని
హయత్‌నగర్ మండలం సాహెబ్ నగర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 200లో 1967 సంవత్సరంలో శ్రీపురం కాలనీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలో ఉన్న శ్రీపురం కాలనీలో సుమారు 5వేల గజాల స్థలంలో శ్రీ చత్రపతి శివాజీ పార్కు ఉన్నది. ఇటీవల కొందరు వ్యక్తులు, మొదట లే అవుట్ చేసిన వారి వారసుల పేర్లతో బై నెంబర్లను ఉపయోగించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను సృష్టించారు. ఈ డాక్యుమెంట్లకు అసలు సూత్రధారి వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అని అంటున్నారు.
కార్తీకేయ ప్రాజెక్ట్ పేరుతో చేస్తున్న లే అవుట్
హయత్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ పరిధిలో 1986లో ఓ వ్యక్తి ప్లాట్ ఓనర్ల నుంచి జీపీఏ చేసుకున్నారు. వాళ్లు చనిపోవడంతో ఫోటోలు లేకుండా జీపీఏ చేసుకున్న వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా సబ్ రిజిస్ట్రార్‌తో కలిసి డాక్యుమెంట్ చేసుకున్నారు. అయితే, 2002 రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం ఫోటో ఐడెంటిటీ కార్డు లేకుండా ఎట్టి పరిస్థితిలో రిజిస్ట్రేషన్ చేయకూడదు. కాసులకు కక్కుర్తి పడి ఇష్టానుసారంగా సబ్ రిజిస్ట్రార్లు వ్యవహరిస్తున్నారు. ఇబ్రహీంపట్నం మండలం కొంగర్ కలాన్ గ్రామంలోని కార్తీకేయ ప్రాజెక్ట్ పేరుతో చేస్తున్న లే అవుట్‌కు నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. మొత్తం విస్తీర్ణంలో జీపీఏ కొంత భాగం చేసుకొని హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో పూర్తి విస్తీర్ణంతో పట్టాదారుల పేరుతో అనుమతి తీసుకున్నారు. కానీ, పట్టాదారుల ప్రమేయం లేకుండా జీపీఏను అడ్డం పెట్టుకొని మొత్తం విస్తీర్ణంలో చేసిన ప్లాట్లను కేవలం కార్తికేయ ప్రాజెక్ట్ వాళ్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు.
వ్యక్తిగత స్వలాభం కోసం అడుగులు
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం అనుమతి వచ్చిన పట్టాదారులు కాకుండా ఇతరులు చేయడంతో భవిష్యత్తులో లింక్ సమస్య ఏర్పడే అవకాశం ఉన్నది. ఈ విషయాలను సబ్ రిజిస్ట్రార్ పరిగణనలోకి తీసుకోకుండా వ్యక్తిగత స్వలాభం కోసం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా బహుళ అంతస్తుల రిజిస్ట్రేషన్ విషయంలో డీడీలు మాత్రం ఎన్ని అంతస్తులు ఉంటే అంతకు తీసుకొని డాక్యుమెంట్ పేపర్‌లో ఆడిట్ వారికు దొరకకుండా జీ ప్లస్ 2 ఫోటోను జత చేస్తున్నట్లు ప్రచారం సాగుతున్నది. ఇన్‌ఛార్జీగా ఉండి ధైర్యంగా అక్రమ రిజిస్ట్రేషన్లకు ఒడిగడుతున్నట్లు సమాచారం.
Also Read: Sheep Distribution Scam: గొర్రెల స్కాం పై సీతక్క ధ్వజం… స్కాం లపై కఠిన చర్యలే!
