Congress Vs Brs: మణుగూరు పట్టణంలో ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వందల సంఖ్యలో తెలంగాణ భవన్ వద్దకు చేరుకొని ఆ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాంగ్రెస్ శ్రేణులు కార్యాలయంలోని ఫర్నిచర్‌ను బయటకు తీసి పెట్రోల్ పోసి తగలబెట్టడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు ఫైర్‌స్టేషన్ సిబ్బంది రంగంలోకి దిగారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా, భారీగా చేరిన కాంగ్రెస్ కార్యకర్తల ఉధృతిని ఆపలేకపోయారు.
Also Read: BRS vs Congress: స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ!.. మళ్లీ కోర్టుకు వెళ్లేందుకు బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్!
పోలీసులు భారీ బలగాలు
కాంగ్రెస్ నాయకులు తెలంగాణ భవన్‌లో ఉన్నబీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులను బయటకు పంపి, బీఆర్‌ఎస్ పార్టీ జెండాలను పీకి వేసి, కాంగ్రెస్ జెండాలను ఎగురవేశారు. అనంతరం “ఎమ్మెల్యే పాయం నాయకత్వం వర్ధిల్లాలి – జై కాంగ్రెస్” అంటూ నినాదాలు చేస్తూ ఆనందోత్సవాలు నిర్వహించారు. కాంగ్రెస్ నేతల ప్రకారం ఈ కార్యాలయం ఒకప్పుడు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్మించిన ఇందిరా భవన్. తరువాత ఆయన బీఆర్‌ఎస్ పార్టీలో చేరడంతో, దీనిని తెలంగాణ భవన్‌గా మార్చారు. ఇప్పుడు కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, తమ పార్టీ సొంత కార్యాలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాం అని తెలిపారు. సంఘటనపై మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐలు నాగబాబు, అశోక్ రెడ్డి, సబ్ డివిజన్ పోలీసులు భారీ బలగాలతో చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం అక్కడ పోలీసులు మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.
Also Read: Congress vs BRS: నిజానిజాలపై కొనసాగుతున్న పొలిటిరల్ రచ్చ!
