Sigachi Pharma Company: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని ప్రమాదం నెలకొన్న సిగాచి (Sigachi) పరిశ్రమను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, (Ramakrishna Rao)హైలెవల్ కమిటీ సభ్యులు సందర్శించారు. ప్రమాదంలో మృతి చెందిన, క్షతగాత్రుల కార్మికుల కుటుంబాలను పరామర్శించారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా పరిశ్రమలో అగ్నిమాపక శాఖ, పొల్యూషన్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సిబ్బంది, పరిశ్రమల శాఖ సిబ్బంది, కంపెనీ ప్రతినిధులు, పోలీసులు, రెవెన్యూ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష జరిపారు. ప్రమాదానికి గల కారణాలు, భద్రతా ప్రమాణాలు, సేఫ్టీ మెకా నిజం నిర్వహణపై సంబంధిత శాఖలతో చర్చించారు. పరిశ్రమలో రియాక్టర్లు, డ్రైయర్లు, ఫైర్ ఫైట్ సిస్టం, ఉద్యోగుల రక్షణ మార్గాలు, ఇతర భద్రతా అంశాలపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రామకృష్ణారావు ,(Ramakrishna Rao) మాట్లాడుతూ, ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన వైద్య సేవలందించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. పరిశ్రమల భద్రతా ప్రమాణాలపై పూర్తి స్థాయిలో చర్యలు చేపడతామన్నారు. ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి వివరాలు, మృతుల వివరాలు మృతుల ఐడెంటిఫికేషన్ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Also Read: SR Nagar Police Station: పైసలు కొట్టినవారికే వంత పాడుతున్న పోలీసులు!
బాధిత కుటుంబాలతో రామకృష్ణారావు
అనంతరం బాధిత కుటుంబ సభ్యుల కోసం ఐలా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సహాయక కేంద్రాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సందర్శించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా త్వరలో మృతుల కుటుంబాలకు క్షతగాత్రుల కుటుంబాలకు ఆర్థికసాయం అందజేస్తామన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సహయక చర్యలు మరింత సమర్థవంతంగా సాగేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
9 మంది ఆచూకీ లభించలేదు
సిగాచి కంపెనీలో జరిగిన ప్రమాదంలో 38 మంది మృతి చెందారని, అందులో ఇప్పటివరకు 31 మృత దేహాలను గుర్తించామని సంగారెడ్డి కలెక్టర్ (Sangareddy Collector) ప్రావీణ్య పేర్కొన్నారు. మరో ఏడుగురి మృతదేహాలను గుర్తించాల్సి ఉందని తెలిపారు. 23 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని, 12 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొన్నారు. ప్రమాదం నుండి 61 మంది సురక్షితంగా బయట పడ్డారని కలెక్టర్ పేర్కొన్నారు.
కొనసాగుతున్న రెస్క్యూ
సిగాచి పరిశ్రమలో జరిగిన ఘటనపై రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. సంఘటనా స్థలంలో ఇప్పటికీ సహాయక బృందాలు పనిచేస్తున్నాయి. మిస్సయినవారి వివరాలు లభించే వరకు రెస్క్యూ టీమ్‌లు శోధన కొనసాగించనున్నట్లు కలెక్టర్ ప్రావిణ్య తెలిపారు. మృతదేహాల శేషాలు, వ్యక్తిగత వస్తువులు, ఆధారాలను సేకరించి, అవసరమైన డీఎన్ఏ శాంపిల్స్ ల్యాబ్‌కు పంపించామన్నారు. డీఎన్ఏ టెస్టింగ్ ప్రక్రియ వేగంగా సాగుతున్నది. ఫోరోనెక్స్ ల్యాబ్ నుంచి వచ్చే డీఎన్ఏ రిపోర్టులు ఆధారంగా మృతుల గుర్తింపు చేపడుతున్నారు. ఇప్పటివరకు 14 మంది మృతుల రిపోర్టుల కోసం నిరీక్షణ కొనసాగుతున్నది.
బాధిత కుటుంబాలకు సహాయ కేంద్రం
పాశమైలారం (Pathamailaram) వద్ద ప్రత్యేకంగా ఒక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ 11 మంది మిస్సింగ్ అయిన వ్యక్తుల కుటుంబీకులకు తాత్కాలికంగా వసతిని ఏర్పాటు చేశారు. వారికి అవసరమైన భద్రత, ఆహారం, ఆరోగ్య సదుపాయాలు అందిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మృతి చెందిన కుటుంబాలకు రూ.లక్ష, గాయపడిన వారికి రూ.50వేలు తాత్కాలిక తక్షణ ఆర్థికసాయం అందజేస్తున్నారు. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించిన వెంటనే అంబులెన్స్ ఏర్పాటు చేసి, పోలీస్ ఎస్కార్ట్‌తో వారి స్వగ్రామాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం 23 మంది క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరికి ప్రభుత్వ సూచనల మేరకు ప్రత్యేక వైద్య సిబ్బంది ఏర్పాటుచేసి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు.
Also Read: Huzurnagar: తమిళ కంపెనీకి లాభాలు.. తెలంగాణ ప్రజలకు రోగాలు