Thummala Nageswara Rao: స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాధాన్యత కల్పించారని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Thummala Nageswara Rao) తెలిపారు. ఖమ్మం నగరంలోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)ను ఆయన జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమీషనర్ సునీల్ దత్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. రాబోయే టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేసేలా ఏటీసీల ఏర్పాటు జరుగుతుందని తెలిపారు.
ఏటీసీ కోర్సులు డిజైన్
ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఖమ్మం, మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం ప్రాంతాలలో నాలుగు ఏటీసీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు దక్కాలంటే రొటీన్‌గా ఉన్న ఐటీఐ కోర్సులు కాకుండా, ప్రస్తుత పరిశ్రమల అవసరాల ప్రకారం నైపుణ్య కోర్సులను డిజైన్ చేయించి ఆధునిక సాంకేతిక కేంద్రాల ద్వారా అందించడం జరుగుతుందని అన్నారు. రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల వరకు ప్రపంచీకరణలో జరిగే మార్పులకు అనుగుణంగా ఏటీసీ కోర్సులు డిజైన్ చేస్తారన్నారు. ఆధునిక సాంకేతిక కేంద్రంలో అందించే కోర్సులను పూర్తి చేసే ముందే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభించేలా టాటా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని అన్నారు. నిర్వీర్యమైన ఐటీఐలను యువతకు ఉపయోగపడే విధంగా ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం తీర్చిదిద్దిందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
నేడు వేరుశనగ విత్తనాలు పంపిణీ
జాతీయ నూనె గింజల పథకంలో భాగంగా మంగళవారం నుంచి రాష్ట్రంలో వేరుశనగ విత్తనాల పంపిణీని ప్రారంభించనున్నట్లు వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి సోమవారం మీడియా ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ఈ పథకంలో భాగంగా 2025-26లో రూ.66.66 కోట్లు వెచ్చించి నూనె గింజల విస్తీర్ణం, ఉత్పాదకత పెంచి స్వయం సమృద్ధి సాధించేలా సాగు చేసే రైతులకు వివిధ రకాల ప్రోత్సాహకాలు కల్పిస్తున్నారు. రూ. 27 లక్షలతో బ్రీడర్ విత్తనాన్ని, రూ. 2.50 కోట్లతో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సీడ్ హబ్, సీడ్ స్టోరేజ్ యూనిట్లను నెలకొల్పారు.
రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా ఎంపిక
రూ. 47.06 కోట్లతో నూతన వంగడాలను ప్రాచుర్యంలోకి తేవడానికి, గత ఐదేళ్ల లోపు విడుదలైన అధిక దిగుబడి, చీడపీడల నుంచి తట్టుకునే వంగడాలకు సంబంధించిన విత్తనాలను సబ్సిడీపై రైతులకు అందజేయడానికి నిర్ణయించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వేరుశనగ పంట పండే 8 జిల్లాలను (మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ) గుర్తించారు. అక్కడ ఎఫ్పీఓ రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా ఎంపిక చేసిన రైతులకు దాదాపు రూ. 46.14 కోట్లు వెచ్చించి, 45,350 ఎకరాలకు సరిపడా 38,434 క్వింటGJG32 (19,490 క్వింటాళ్లు), కదిరి లేపాక్షి (18,212 క్వింటాళ్లు), గిర్నార్ (732 క్వింటాళ్లు) వంటి అధిక దిగుబడినిచ్చే వంగడాలను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
50% నుండి 60% అదనంగా దిగుబడి
సాంప్రదాయ వంగడాలతో పోల్చుకుంటే ఈ వంగడాలు 50% నుండి 60% అదనంగా దిగుబడి నమోదు చేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. గిర్నార్ 5 లో నూనె శాతం ఎక్కువగా ఉండడం చేత ఎక్కువ రోజులు గింజలను నిలువ చేసుకోవచ్చని వివరించారు. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా మంత్రి నూనెగింజల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, ఆయా జిల్లాల్లో రైతు వేదికల వద్ద ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా విత్తనాల పంపిణీ జరుగుతుందని డైరెక్టర్ గోపి వెల్లడించారు.
Also Read: Thummala Nageswara Rao: కమిషన్‌కు ఈటల చెప్పిందంతా అబద్దం.. నా పేరు ఎందుకు తీశారు.. తుమ్మల ఫైర్!
