Ration Rice Scam: నిరుపేదల కడుపు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘రూపాయికే కిలో బియ్యం’ పథకం లక్ష్యం పక్కదారి పడుతోంది. రేషన్ షాప్‌ల ద్వారా పంపిణీ అవుతున్న సన్న బియ్యం నాణ్యతపై లబ్ధిదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన మేలు రకం (ఫైన్ వెరైటీ) బియ్యం ప్రజలకు చేరాల్సిన చోట.. 20 నుంచి 30 శాతం వరకు నూకలే ఉన్న బియ్యం సరఫరా అవుతున్నట్లు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. కొన్ని నెలలుగా నూకల బియ్యం సరఫరా అవుతున్నా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రేషన్ షాప్‌ల ద్వారా సరఫరా అవుతున్న సన్న బియ్యంలో నూకలు ఎక్కువగా ఉంటుండటంతో, అన్నం వండితే ముద్దగా మారుతోందని లబ్ధిదారులు పెదవి విరుస్తున్నారు. మార్కెట్‌లో కొనుగోలు చేసే బియ్యంలో నూకలు కనిపించకున్నా, రేషన్ బియ్యంలో నూకల శాతం పెరగడంతో నిరుపేదలు ఇబ్బంది పడుతున్నారు.
రైతుల నుంచి కొని..
రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఖరీఫ్, యాసంగి సీజన్లలో ఐకేపీ, పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతుల నుంచి ధాన్యం కొంటుంది. ఆ ధాన్యాన్ని సీఎంఆర్(Custom Milling Rice) కింద మిల్లర్లకు ఇస్తుంది. మిల్లర్లు ధాన్యాన్ని మర ఆడించి ముడి బియ్యం అయితే 67 కిలోలు, బాయిల్డ్ రైస్ అయితే 68 కిలోల చొప్పున తిరిగి అందజేయాలి. ఇందుకు ప్రభుత్వం మిల్లర్లకు క్వింటాల్ బాయిల్డ్ రైస్‌కు రూ.50 చొప్పున, ముడి బియ్యానికి రూ.30 చొప్పున ఛార్జీలు కూడా చెల్లిస్తుంది. పారాబాయిల్డ్ బియ్యమైతే గరిష్టంగా నూకలు 16 శాతం, డిస్‌కలర్ (రంగుమారిన) 5 శాతం, డ్యామేజ్ 4 శాతంలోపు ఉండాలి. ముడి బియ్యమైతే గరిష్టంగా నూకలు 25 శాతం, డిస్‌కలర్ 5, డ్యామేజ్ 5 శాతంలోపు ఉండాలి.
Also Read; Etela Rajender: కమీషన్ల ఆశతోనే కాంట్రాక్టర్లకు నిధుల కేటాయింపు.. ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు
అక్కడ డిమాండ్!
కాగా, వానాకాలం ధాన్యాన్ని ఏటా మార్చి 31 లోపు యాసంగి ధాన్యాన్ని సెప్టెంబర్ 31లోపు మర ఆడించి బియ్యం తిరిగివ్వాలి. కానీ, కొనుగోలు సెంటర్‌ల ద్వారా సేకరించిన వరి ధాన్యాన్ని ఆయా మిల్లులకు కేటాయిస్తారు. ఇక్కడ పండించిన వరి ధాన్యానికి బహిరంగా మార్కెట్‌లో డిమాండ్ ఉండటంతో వరి ధాన్యం ఇతర రాష్ట్రాలకు తరలించి మిల్లర్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా ఒక్కో మిల్లుల యాజమాన్యం కోట్లలో అక్రమాలకు పాల్పడిన ఆరోపణలు వెలువడిన అధికారులు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. మేలు రకమైన వరి ధాన్యం బదులు తక్కువ ధరలో సన్న బియ్యాన్ని కొనుగోలు చేసి మర ఆడించి ప్రభుత్వానికి అందిస్తున్నారు. జిల్లాలో కొన్నిరైస్ మిల్లులో లబ్దిదారులు, అక్రమార్కుల నుంచి రేషన్ బియ్యం కొనుగోలు చేసి ఎఫ్‌సీఐ గోదాంలకు అందిస్తున్నారన్నా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కారణమెవరు?
కొందరు మిల్లర్లు, అధికారులు కుమ్మక్కై నిరుపేదలకు నాణ్యతలేని, నూకల బియ్యం అంటగడుతున్నట్టు ‘ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి మిల్లర్లు ఎఫ్‌సీఐ/పౌర సరఫరాల శాఖ పంపిన ధాన్యాన్నే మిల్లింగ్ చేసి అలా వచ్చిన బియ్యాన్ని తిరిగి ఇవ్వాలి. కానీ, కొందరు మిల్లర్లు మంచి ధాన్యాన్ని తాము వాడేసుకుంటున్నారు. తాము బయట నేరుగా తక్కువ ధరకు కొన్న నాణ్యతలేని ధాన్యాన్ని మిల్లింగ్ చేసి పౌరసరఫరాల శాఖకు పంపుతున్నారు. అందుకే బియ్యంలో నాణ్యత తక్కువగా, నూకలు ఎక్కువగా ఉంటున్నట్టు తెలుస్తోంది.
Also Read; Lord Shiva: ప్రళయం వచ్చినప్పుడు శివుడు ఆ ఒక్క నగరాన్ని మాత్రమే రక్షిస్తాడు? దానికి అంతమే లేదా?
