Nizamabad district: నిజామాబాద్, జిల్లాలో వీడీసీల (గ్రామాభివృద్ధి కమిటీలు) ఆగడాలను అరికట్టేందుకు జిల్లా న్యాయ సేవా సంస్థ కఠిన చర్యలకు సిద్ధమైంది. గతంలో కోలీప్యాక్ గ్రామంలో జరిగిన గ్రామ బహిష్కరణపై విచారణ చేసి, ఐదుగురు వీడీసీ సభ్యులకు జైలు శిక్ష విధించిన నేపథ్యంలో, ఇప్పుడు అరాచకాలను అరికట్టేందుకు న్యాయ వ్యవస్థ రంగంలోకి దిగింది. నిజామాబాద్ జిల్లా(Nizamabad district)లో వీడీసీ అరాచకాలపై బాధితులు పోలీసు(Police)కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో, న్యాయ సేవా సంస్థకు ఆశ్రయిస్తున్నారు. బాధితులకు న్యాయం చేస్తామని న్యాయ సేవా సంస్థ న్యాయమూర్తి ఉదయ్ భాస్కర్ రావు ధైర్యం కల్పించారు.
Also Read: Land Encroachments: డేంజర్ జోన్‌లో పెద్ద చెరువు.. అధికారుల అలసత్వం
కబ్జాపై విచారణ..
ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి(Jeevan Reddy) హయాంలో సుబిర్యల్ గ్రామంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి వీడీసీ కమిటీ అక్రమంగా షట్టర్లు నిర్మించిందని ఫిర్యాదులు అందాయి. ఈ ఆరోపణలు నిజమని తేలడంతో న్యాయ సేవా సంస్థ దీనిపై విచారణ ప్రారంభించింది. సుమారు నాలుగేళ్ల క్రితం సుబిర్యల్ రోడ్డుకు పక్కన ప్రభుత్వ భూమిలో 11 షట్టర్లు అక్రమంగా నిర్మించారని, దీనికి అప్పటి మాజీ సర్పంచ్ గణేశ్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మద్దతు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. దళితులను బహిష్కరించినట్లు కూడా ఆరోపణలు రావడంతో ఈ విషయం మరింత తీవ్రంగా మారింది.
అధికారులకు ఆదేశాలు..
ఈ విషయమై న్యాయ సేవా సంస్థ న్యాయమూర్తి ఉదయ్ భాస్కర్ రావు అధికారులను విచారణకు పిలిచారు. ఏ ధైర్యంతో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి వీడీసీ సొంతానికి భవనాలు నిర్మించారని, నాలుగు సంవత్సరాలుగా అద్దెలు ఎలా వాడుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ అక్రమ కట్టడాలను వెంటనే సీజ్ చేసి, పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అన్ని విషయాలు తెలిసినా ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో నివేదికతో పాటు అక్రమ షాపులను సీజ్ చేయాలని, బాధ్యులపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
బాధితులకు భరోసా..
న్యాయ సేవా సంస్థ వేసిన కమిటీ గ్రామాల్లో వీడీసీలకు కఠిన హెచ్చరికలు జారీ చేసింది. వీడీసీ కమిటీలు గ్రామాభివృద్ధికి మాత్రమే పనిచేయాలని, అరాచకాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. బాధితులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, న్యాయం కోసం తమ డోర్లు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని న్యాయమూర్తి ఉదయ్ భాస్కర్ రావు భరోసా ఇచ్చారు. ఈ విచారణతో సుబిర్యల్‌లోని వీడీసీ కమిటీ తమ కమిటీని రద్దు చేస్తున్నట్లు రాతపూర్వకంగా న్యాయ సేవా సంస్థకు లేఖ ఇచ్చింది. దీంతో జిల్లాలోని ఇతర వీడీసీ కమిటీల్లో కూడా భయం నెలకొంది.
Also Read: UPI Payments: 1 నుంచి యూపీఐ పేమెంట్లలో మార్పులు.. లిమిట్ 50 సార్లు!