Neeti Bindu Jala Sindhuvu: సింగరేణి ప్రాంతంలో భూగర్భ జలాల పెంపుదల లక్ష్యంగా ‘నీటి బిందువు-జల సింధువు’ పేరుతో ఈనెల ప్రారంభించిన మినీ చెరువుల నిర్మాణం వేగవంతంగా సాగుతోందని సంస్థ సీఎండీ ఎన్ బలరాం తెలిపారు.
మే 15 నాటికి సింగరేణి వ్యాప్తంగా మొత్తం 12 ఏరియాల్లో 62 కొత్త చెరువుల నిర్మాణం, 40 చెరువుల్లో పూడికతీత పనులు పూర్తి చేయాలని బలరాం ఆదేశించారు. హైదరాబాద్ సింగరేణి భవన్ లో సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆయన అన్ని ఏరియాల జీఎంలకు, సంబంధిత పర్యావరణ, సివిల్ శాఖల అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటికి 20 శాతం పైగా పనులు పూర్తయ్యాయని, పెండింగ్ పనుల్లో మరింత వేగం పెంచాలని, మే 15 నాటికి మొత్తం చెరువుల నిర్మాణం పూర్తి చేయాలని సీఎండీ ఆదేశించారు. రానున్న వర్షాకాలంలో సింగరేణి నిర్మించిన ఈ చెరువుల్లో నీరు పుష్కలంగా చేరే విధంగా తగు సివిల్ పనులు పూర్తి చేయాలన్నారు.
రక్షణ చర్యలుగా మినీ చెరువుల చుట్టూ కంచెలు ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. సింగరేణి సమీప గ్రామాలలో భూగర్భ జలాలు పెంచడం కోసం తీసుకున్న ఈ బృహత్ కార్యక్రమాన్ని ప్రతి ఏరియా జీఎం ప్రత్యేక శ్రద్ధతో విజయవంతం చేయాలని సూచించారు.
Also read: Gold Rate Today : మహిళలకు బిగ్ షాక్.. నేడు భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్
తొలుత 50 మినీ చెరువులు నిర్మించాలని భావించినప్పటికీ, గనుల ప్రాంతంలో ఉన్న అవకాశాలను పరిగణలోకి తీసుకొని వీటి సంఖ్యను 62 కు పెంచినట్లు తెలిపారు. అలాగే ఇప్పటికే ఉన్న 40 చెరువుల్లో నీటి సామర్థ్యం పెంపుదలకు పూడిక తొలగింపు పనులు చేపట్టాలని నిర్ణయించారు.
సింగరేణిలో గతంలో కేవలం అక్కడక్కడ చెరువుల పూడికను కొన్ని ఏరియాలో తీసిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఈ విధంగా పెద్ద ఎత్తున చెరువుల నిర్మాణాన్ని చేపట్టడం గతంలో ఎన్నడూ జరగలేదు.
ఈ చెరువుల నిర్మాణం సింగరేణి సమీప ప్రాంత భూగర్భ జలాల పెంపుదలకు ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా మందమర్రిలో 10 మినీ చెరువులు, కొత్తగూడెంలో 8, భూపాలపల్లిలో, రామగుండం-1లో, రామగుండం-2లో, ఇల్లందు, మణుగూరు, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాలలో ఏరియాకు 5 మినీ చెరువుల చొప్పున, రామగుండం-3 ఏరియాలో 4 మినీ చెరువులు కలిపి మొత్తం 60 మినీ చెరువులను సింగరేణి యాజమాన్యం నిర్మిస్తోందని సీఎండీ వివరించారు.