Nagarkurnool District: నాగర్ కర్నూల్ జిల్లాలో ఇటీవలే మొంథా తుపాను వల్ల సంభవించిన నష్టాలను వెంటనే శాఖల వారీగా సేకరించి అందజేయాలని నాగర్ కర్నూల్(Nagar Kurnool) జిల్లా అదనపు కలెక్టర్లు పి.అమరేందర్, దేవ సహాయం వ్యవసాయ, నీటిపారుదల, పంచాయతీరాజ్, గృహ నిర్మాణ, ఆర్ అండ్ బి, వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు. శాఖల వారీగా జరిగిన నష్టాలను తెలియజేస్తూ వాటి పునరుద్ధరణకు అయ్యే ఖర్చు అంచనాలను కూడా పంపాలని వారు తెలిపారు. నష్టాల అంచనాలు ఖచ్చితంగా ఉండాలని, ప్రత్యక్షంగా చూసి రాయాలని, వాటి ఫోటోలు వీడియోల తో సహా పంపాలని తెలిపారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో నష్టాల వివరాల సేకరణపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ప్రభుత్వం ఆదేశాల మేరకు..
ఈ సందర్బంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ.. మండల వారీగా అన్ని శాఖలకు సంబంధించిన నష్టాల పై ఆరా తీశారు. తాత్కాలిక పునరుద్ధరణ పనులు వెంటనే చేపట్టాలని, శాశ్వత పనుల కోసం అంచనాలను తయారు చేసి శనివారం సాయంత్రం నాటికి పంపాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో ఏ ఒక్కరికి నష్టం జరగకుండా క్షుణ్ణంగా పరిశీలించి నష్టాల వివరాలను కచ్చితంగా ప్రభుత్వం అందజేసిన ఫార్మేట్ ఆధారంగానే పంపించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంటల వారిగా దెబ్బతిన్న పంటల నష్టాల వివరాల పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు.పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఆర్ అండ్ బి ఆధ్వర్యంలో జిల్లాలు దెబ్బతిన్న రోడ్లు భవనాలు ఇతర ప్రభుత్వ భవనాలు పాఠశాలలు, అంగన్వాడీలు, కళాశాలలు, వసతి గృహాలు ఇతర ప్రభుత్వ ప్రైవేటు వ్యక్తుల దెబ్బతిన్న నష్టాలను శాఖల వారీగా అందించాలన్నారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఆవులు, గేదెలు, మేకలు, గొర్లు కోళ్ల వివరాలను స్పష్టంగా సేకరించి అందజేయాలని కోరారు.
గ్రామపంచాయతీ అధికారులు
జిల్లాలో ఎక్కడ అంటువ్యాధులు(Infections) రాకుండా చర్యలు గ్రామపంచాయతీ అధికారులు తక్షణ చర్యలను తీసుకోవాలని సూచించారు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు(Ramakrishna Rao) జిల్లాల కలెక్టర్లు తో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ సమావేశానికి అదనపు కలెక్టర్లు హాజరై జిల్లాలో జరిగిన నష్ట వివరాలను, చేపట్టిన సహాయక చర్యల కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కు అదనపు కలెక్టర్లు వివరించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి జ్ఞాన శేఖర్, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఈఈ విజయ్ కుమార్, ఇరిగేషన్ ఈఈ పార్థసారథి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాములు, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారిని రాజేశ్వరి, డి ఎం హెచ్ ఓ డాక్టర్ రవి కుమార్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఉమాపతి, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్?
