Mulugu District: గాడ్ ఫాదర్ల ఆశీస్సులు, కాసులు ఖర్చు చేసే సామర్థ్యం ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించాడో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఉద్యోగి. విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడి 2 కోట్ల రూపాయల నిధులను పక్కదారి పట్టించి సస్పెండ్ అయిన సదరు ఉద్యోగి తన ఇన్‌ఫ్లూయెన్స్‌ను ఉపయోగించి తిరిగి అదే పోస్టులోకి వచ్చాడు. తాను చేసిన అక్రమాలకు సంబంధించిన రికార్డులు, ఆధారాలను మాయం చేసేశాడు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే అతనిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఐదేళ్లు గడిచిపోయినా ఇప్పటివరకు విచారణ పూర్తి కాకపోవడం. సస్పెన్షన్ సమయంలో మాజీ జెడ్పీ ఛైర్మన్ వద్ద పీఏగా పని చేసినట్టుగా తెలుస్తుండడం.
నిధుల గోల్ మాల్
ములుగు(Mulugu) జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్‌గా సతీష్ పని చేశాడు. ఈ సంస్థ మహిళలు ఆర్థికంగా స్వయం ప్రతిపత్తిని సాధించడానికి ‘సెర్ప్’ గ్రూపులకు రుణాలు మంజూరు చేస్తుంది. కాగా, రికార్డులను తారుమారు చేసి మహిళలకు ఇవ్వాల్సిన రుణాలకు సంబంధించిన నిధుల్లో నుంచి 2 కోట్ల రూపాయల మేర కొందరు ఉద్యోగులు దారి మళ్లించినట్టుగా ఐదేళ్ల క్రితం ఆరోపణలు వచ్చాయి. దీనిపై సెర్ప్ సీఈవో, అప్పటి జిల్లా కలెక్టర్ విచారణ జరిపించారు. నిధుల గోల్ మాల్ జరిగినట్టుగా ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది.
Also Read: Mulugu District: నిబంధనలకు విరుద్ధంగా రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.. పట్టించుకోని అధికారులు
రికార్డులు తారుమారు చేసే అవకాశం
ఈ క్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు అప్పట్లో ఇన్‌ఛార్జ్‌గా ఉన్న సంజీవరావు అనే ఉద్యోగిని ఆయన మాతృ శాఖకు బదిలీ చేశారు. డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్‌గా ఉన్న సతీష్‌ను విధుల్లో నుంచి సస్పెండ్ చేశారు. తెర వెనుక ఏం జరిగిందోగానీ ఆ తరువాత కొన్నాళ్లకే ఎంక్వయిరీ పెండింగ్ పేర అతనికి తిరిగి ములుగు జిల్లాలోనే పోస్టింగ్ ఇచ్చారు. అప్పట్లో కలెక్టర్‌గా ఉన్న కృష్ణాదిత్య ములుగు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలోని పాత పోస్టులోనే అతడిని నియమిస్తే రికార్డులు తారుమారు చేసే అవకాశం ఉన్నదని ఏటూరు నాగారం ఐటీడీఏలో పోస్టింగ్ ఇచ్చారు. కలెక్టర్ కృష్ణాదిత్య ట్రాన్స్‌ఫర్ కాగానే సతీష్ తన పలుకుబడిని ఉపయోగించి తిరిగి ములుగు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో తిరిగి పోస్టింగ్ తెచ్చుకున్నాడు. ఆ తరువాత నిధుల మళ్లింపునకు సంబంధించిన ఆధారాలను మాయం చేసినట్టుగా ఆ సంస్థకు చెందిన ఉద్యోగులే చెబుతున్నారు.
మరోసారి ఫిర్యాదు
మరోవైపు, మహిళలకు ఇచ్చే వడ్డీ లేని రుణాలు, గొర్రెలు, మేకలు చనిపోతే అందించే నష్ట పరిహారానికి సంబంధించిన నిధులతోపాటు స్త్రీ నిధి పథకం కింద ఇచ్చిన రుణాలకు సంబంధించి వచ్చిన వాయిదాల మొత్తంలో కూడా 3 కోట్ల రూపాయల గోల్ మాల్ జరిగినట్టు అదే సమయంలో ఆరోపణలు వచ్చాయి. దీనిపై జిల్లా సహకార అధికారి విచారణకు ఆదేశాలు జరిపారు. ఈ క్రమంలో జిల్లా సహకార శాఖ ఉద్యోగి శ్రావణ్, స్త్రీ నిధి రీజనల్ మేనేజర్ విజయభారతి దాదాపు నెల రోజులపాటు ములుగు, వెంకటాపూర్ మండలాల్లో 21 గ్రామ సంఘాలకు సంబంధించిన లావాదేవీలపై ఆడిట్ జరిపారు. దీంట్లో నిధుల గోల్ మాల్ జరిగింది నిజమే అని నిర్ధారించుకున్న వీళ్లు 21 గ్రామ సంఘాల వీవోఏలను తొలగించి వారి స్థానంలో కొత్తవారిని నియమించాలని సిఫార్సు చేశారు.
అవినీతి బాగోతంపై విచారణ
ముగ్గురు క్లస్టర్ కో ఆర్డినేటర్లను సస్పెండ్ చేస్తూ మూడు క్యుములేటీవ్ వార్షిక ఇంక్రిమెంట్లను రద్దు చేశారు. కవిత అనే ఉద్యోగిని వార్షిక ఇంక్రిమెంట్‌ను రద్దు చేయడంతోపాటు స్ర్రీ నిధి అసిస్టెంట్ మేనేజర్ జ్యోతిపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. ఇదే వ్యవహారంలో ములుగులో ఏపీఎంగా పని చేసిన వేణుగోపాల్ రావును పనిష్‌మెంట్‌పై వరంగల్‌కు బదిలీ చేయడంతోపాటు మూడు క్యుములేటివ్ వార్షిక ఇంక్రిమెంట్లను రద్దు చేశారు. వీరందరిపై కూడా విచారణ ఏళ్ల తరబడిగా పెండింగ్ లోనే ఉండిపోవడం గమనార్హం. దీనిపై జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లా స్త్రీ నిధి రీజనల్ మేనేజర్‌గా పని చేసిన మాలోత్ అరుణ్ సింగ్ జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు ఆయా శాఖల ఉన్నతాధికారులకు ఫిర్యాదులు ఇచ్చారు. చేసిన అక్రమాలు బయట పెట్టినందుకు సతీష్ తదితరులు తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నట్టుగా తెలిపారు. ఇటీవల ప్రజావాణి ద్వారా మరో ఫిర్యాదును కూడా ఉన్నతాధికారులకు పంపించారు. దీనిపై స్పందించిన ములుగు జిల్లా కలెక్టర్ దివాకర తాజాగా మొత్తం అవినీతి బాగోతంపై విచారణకు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read: Mulugu District: తక్కువ ఖర్చుతో సేంద్రియ యూరియా.. ఇలా చేయండి..?

