Local Body Elections: రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల వైఖరి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గ్రామస్థాయిలో పార్టీలకు అండగా నిలబడి, జెండాలు మోసి, ప్రచారం చేసిన నిబద్ధత గల కార్యకర్తలకు స్థానం దక్కడం లేదని, ఆర్థిక బలం ఉన్న అభ్యర్థులకే పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నాయని బహిర్గతమవుతున్న వైఖరిపై కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పరిస్థితి బాగోలేనప్పుడు కార్యకర్తలను బుజ్జగిస్తూ, ఆశలు కల్పిస్తూ తమ గెలుపు కోసం ఉపయోగించుకున్న నాయకులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఇచ్చిన మాటలు తప్పే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభ్యర్థి పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉన్నారా, క్రియాశీలంగా పనిచేశారా అనే విషయాలను పక్కన పెట్టి, కేవలం డబ్బును లక్ష్యంగా పెట్టుకొని పార్టీలు అవకాశాలు కల్పిస్తున్నాయని విమర్శిస్తున్నారు.
పార్టీ నేతల ఆదేశాలు ఇవే
నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు, ఎమ్మెల్యేలు ఆశావహులైన కార్యకర్తలకు నేరుగా ‘డబ్బులు ఖర్చు పెట్టగలిగితేనే ముందుకు రావాలి’ అని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఒకవేళ పార్టీ నిర్ణయాన్ని కాదని బరిలో దిగితే, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. అవసరమైతే ఇతర పార్టీలతో అవగాహనకు వచ్చి, బలమైన అభ్యర్థులకు మద్దతు ఇవ్వడానికి సైతం సిద్ధపడుతున్నట్లు తెలుస్తుంది.
కోట్లు ఖర్చు చేయాల్సిందే
ముఖ్యంగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో సర్పంచ్ స్థానం అత్యంత ఖరీదైనదిగా మారింది. కేవలం 400 ఓట్లున్న చిన్న గ్రామంలో కూడా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలంటే రూ.30 లక్షలకు పైగా ఖర్చు చేయాల్సిందేననే సంస్కృతి పాతుకుపోయింది. ఈ జిల్లాల్లో భూముల ధరలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోట్లలో నడుస్తుండటంతో, సర్పంచ్‌గా గెలిస్తే కోట్లు సంపాదించవచ్చనే ఆలోచన ప్రజల్లో, పార్టీ నేతల్లో బలంగా ఉంది.
ఖరీదైన స్థానాలు
మహేశ్వరం, కందుకూర్, కడ్తాల్, అమన్‌గల్లు, యాచారం, ఇబ్రహీంపట్నం, మంచాల, ఫారూక్‌నగర్, కొత్తూర్, నందిగామ, శంషాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లో సర్పంచ్ స్థానం అత్యంత ఖరీదైందిగా మారిపోయింది. అదేవిధంగా, వికారాబాద్ జిల్లాలోని తాండూర్, కోట్‌పల్లి, పరిగి, నవాబ్‌పేట్, మోమిన్‌పేట్, దారూర్, కొడంగల్ మండలాల్లోనూ ఇదే డిమాండ్ కొనసాగుతుంది.
నిబద్ధతకు నిరాదరణ
“జెండా మోయడంతో లాభం లేదు, ఆర్థికంగా బలముంటేనే ప్రాధాన్యత” అనే సందేశాన్ని పార్టీల నాయకులు పరోక్షంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే నిబద్ధత గల కార్యకర్తలకు బదులు, పట్టణంలో ఉంటూ అప్పుడప్పుడు ముఖ్య అతిథిగా వచ్చే ఆర్థికంగా బలమైన వ్యక్తులకు పార్టీలు పట్టం కడుతున్నాయి. దీంతో, తమ పార్టీలపై మక్కువ ఉన్నవారు కేవలం ఓట్లు వేయడానికో, జెండా మోయడానికో మాత్రమే పరిమితమవుతున్నామని మండల, గ్రామస్థాయి నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
