Maoists: దశాబ్దాలుగా సుదీర్ఘ పోరాటం చేస్తున్న మావోయిస్టు పార్టీకి కాలం చెల్లిందా? ఆయుధాలు వదిలేసి చట్టబద్ధంగా పనిచేయడం ఒక్కటే సరైన మార్గమని పార్టీ నాయకత్వమే భావిస్తోందా? అవుననే అంటోంది మావోయిస్టు (Maoists) పార్టీ. తాజాగా ఆ పార్టీ కార్యదర్శి అశోక్ విడుదల చేసిన ఓ లేఖ, మావోయిస్టు పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలు, సంక్షోభాన్ని బట్టబయలు చేయడంతో పాటు, తెలంగాణ ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది.
Also Read: Khammam district: ఖమ్మం జిల్లా గంగారంతండాలో.. యువ శాస్త్రవేత్త అశ్విని గుడి కట్టించి విగ్రహం ఏర్పాటు
అంతర్గత పోరాటం నిజమే
మావోయిస్టు పార్టీలో గత రెండేళ్లుగా రెండు వర్గాల మధ్య తీవ్ర సంఘర్షణ జరుగుతోందన్న వార్తలు నిజమేనని కార్యదర్శి అశోక్ తన లేఖలో ధ్రువీకరించారు. పార్టీ అనుసరిస్తున్న ఎత్తుగడల విషయంలో కేంద్ర కమిటీ వైఫల్యం చెందిందనేది వాస్తవమేనన్నారు. ‘దీర్ఘకాలిక ప్రజాయుద్ధ మార్గంలో మావోయిస్టు పార్టీ తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి’ అని అంగీకరించారు. మెజారిటీ పార్టీ యూనిట్లు శాంతి, సాయుధ పోరాటాన్ని విరమించడం అనే విషయంలో సానుకూల వైఖరిని వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. కేంద్ర కమిటీ, పోలీస్ బ్యూరో సభ్యుడు సోనూ అలియాస్ అభయ్ గతంలో చేసిన శాంతి ప్రతిపాదనలను తాము సమర్థిస్తున్నామని అశోక్ స్పష్టం చేశారు. ఆయుధాలను వదిలేసి రాజ్యాంగ పరిధిలో చట్టబద్ధంగా ప్రజా సమస్యలపై పనిచేస్తూ పార్టీని బలోపేతం చేసుకోవడమే సరైన ఎత్తుగడగా భావిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
ప్రభుత్వానికి విజ్ఞప్తి..
తెలంగాణ ప్రజల చైతన్యం కారణంగానే సాయుధ పోరాటం వదిలిపెట్టి చట్టబద్ధ పోరాటంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని మావోయిస్టు పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం శాంతిని నెలకొల్పడం కోసం తమ పార్టీతో చర్చలు జరపాలని అశోక్ బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నుంచి ప్రతినిధి వర్గాన్ని ప్రకటించినట్లయితే, మావోయిస్టు పార్టీ తరఫున కూడా ప్రతినిధులను ఏర్పాటు చేసి ఆయుధాలను వదిలేసి శాంతియుతంగా చట్ట పరిధిలోకి పార్టీని తీసుకొచ్చే ప్రక్రియను ప్రారంభిస్తామని అశోక్ ఆ లేఖలో పేర్కొన్నారు.
16 మంది లొంగుబాటు
ఒకవైపు పార్టీ నాయకత్వం అంతర్గత పోరాటం, శాంతి చర్చల గురించి మాట్లాడుతుండగా, మరోవైపు క్షేత్ర స్థాయిలో మావోయిస్టుల పతనం కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో పోలీస్ బలగాల దూకుడుతో భారీగా నష్టపోతున్న మావోయిస్టులు వరుసగా లొంగిపోతున్నారు. నారాయణపూర్ జిల్లాలో ఒక్కరోజే ఏడుగురు మహిళా మావోయిస్టులతో సహా మొత్తం 16 మంది లొంగిపోయారు. వీరిపై రూ.70 లక్షల రివార్డు ఉంది. అజ్ఞాత జీవితం వదిలి ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై లొంగిపోతున్నట్లు జిల్లా ఎస్పీ రాబిన్సన్ గురియా తెలిపారు. అంతర్గత సంక్షోభం, నాయకత్వం నుంచి వస్తున్న శాంతి ప్రతిపాదనలు, క్షేత్ర స్థాయిలో జరుగుతున్న భారీ లొంగుబాట్లను చూస్తుంటే భారతదేశంలో మావోయిస్టుల పని ఇక ఖతమైనట్లేనా? అన్న ప్రశ్న బలంగా వినిపిస్తోంది.
Also Read: Bhadrachalam: భద్రాచలం ఎమ్మెల్యే పిఏ నవాబ్ ఆగడాలు.. రూ.3.60 కోట్లు ఇవ్వాలని డిమాండ్!
